Share News

ఇంటి వద్దనే ఓటింగ్‌

ABN , Publish Date - May 04 , 2024 | 12:30 AM

దేశంలోనే తొలిసారిగా ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని కల్పించిన క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిరోజు ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి సుమిత్‌కుమార్‌ తెలిపారు.

 ఇంటి వద్దనే ఓటింగ్‌
భీమవరంలో ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధురాలు

జిల్లాలో మొదటిరోజు

వినియోగించుకున్నవారు 213 మంది

భీమవరం టౌన్‌, మే 3 : దేశంలోనే తొలిసారిగా ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని కల్పించిన క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిరోజు ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి సుమిత్‌కుమార్‌ తెలిపారు. ఈ విధానం ఇంకా కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో ఈ విధానంలో ఓటు హక్కు వినియోగించుకునేవారు 1,119 మంది ఉండగా తొలిరోజు 85 ఏళ్లు నిండినవారు 98 మంది, 40 శాతం వికలాంగత్వం కలిగిన వారు 115 మంది వినియోగించుకున్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 85 ఏళ్లు పైబడిన వారు, 40 శాతం కన్నా ఎక్కువ వికలాంగత్వం ఉన్న వారికీ ఎన్ని కల సంఘం హోం ఓటింగ్‌ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. పోలింగు అధికారి, సహాయ పోలింగు అధికారి, సూక్ష్మ పరిశీలకుడు సమక్షంలో హోం ఓటింగ్‌ జరిగిందన్నారు. ఈ ప్రక్రియ వీడియోగ్రాఫరు, ఆర్మ్డ్‌కానిస్టేబుల్‌ సమక్షంలో పక డ్బందీగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనారోగ్యంతో మంచంపై ఉన్నవారు, 85 ఏళ్లు దాటిన వృద్ధులను ముందు గానే గుర్తించామని, ఓటరు ఇంటిలోనే ప్రత్యేక ప్రత్యేక పోలింగు కంపార్ట్‌మెంట్‌ను ఏర్పాటుచేసి ఓటరు ద్వారా ఓటును వేయించి సీల్డు కవర్లో అధికారుల సమక్షంలోనే సీల్డ్‌ డ్రమ్ములో భద్రపరుస్తున్నట్టు తెలిపారు. అర్హులంతా తమ ఓటు హక్కును తమ ఇంటివద్దే వినియోగించుకోవా లని కోరారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ఆచంట నియోజకవర్గంలో 86 మంది, పాలకొల్లు–329, నరసాపురం–112, భీమవరం–109, ఉండి–151, తణుకు–181, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 151 మంది ఉన్నారు. మొదటి విడతగా 3వ తేదీ నుంచి 5 వరకు, రెండోవిడత 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు హోం పోలింగ్‌ జరుగుతుది.

వీరికీ తాయిలాలు..!

పోలింగ్‌స్టేషన్‌కు వచ్చి ఓటు వేయని వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు వేసే ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టగా శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించారు. అయితే ఇలా ఓటు వేసేవారికి కొందరు ముందుగానే తాయిలాలు అందించారని సమాచారం. రూ.2వేల నుంచి 2,500 వరకు ఇచ్చారని చెబుతున్నారు. ఒక నియోజకవర్గంలో ఓటర్లకు భారీగా నజరాన అందిం చారనే గుసగుసలు వినిపించాయి.

Updated Date - May 04 , 2024 | 12:30 AM