Share News

ఇది ప్రభుత్వ కుట్రే ?

ABN , Publish Date - May 04 , 2024 | 11:58 PM

ప్రభుత్వ ఉద్యోగులు ప్రభు త్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. వీరి ఓటు ప్రభుత్వానికి అనుకూలంగా పడదు. అందుకే ఉద్యోగులను ఎలాగైనా ఓటింగ్‌కు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం శనివారం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో ప్రభుత్వం గందరగోళం సృష్టించిందనే ఆరో పణలు విన్పిస్తున్నాయి.

ఇది ప్రభుత్వ కుట్రే ?
ఏలూరులో పోస్టల్‌ ఓటేసేందుకు ఉద్యోగుల పాట్లు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో గందరగోళం

పోస్టల్‌ బ్యాలెట్‌పై అధికారుల తీరు అనుమానాస్పదం

భీమడోలు ఉద్యోగికి చింతలపూడి పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ

పోస్టల్‌ బ్యాలెట్‌కు దూరమైన గణపవరం మండల ఉద్యోగులు

ఉద్యోగుల ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా భావించే కుట్ర పన్నారంటూ ఆరోపణలు

ఏలూరు టూటౌన్‌/ఉంగుటూరు మే 4 : ప్రభుత్వ ఉద్యోగులు ప్రభు త్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. వీరి ఓటు ప్రభుత్వానికి అనుకూలంగా పడదు. అందుకే ఉద్యోగులను ఎలాగైనా ఓటింగ్‌కు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం శనివారం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో ప్రభుత్వం గందరగోళం సృష్టించిందనే ఆరో పణలు విన్పిస్తున్నాయి. తమ ఓట్లు ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం కల్పించిందని ఉద్యోగులు వాపోతున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటల వరకు చాలాచోట్ల ఈ గందరగోళం మధ్య ప్రారంభం కాలేదు.

ఉత్తర్వుల జారీలో తికమక

జిల్లా అధికారుల నుంచి శుక్రవారం వచ్చిన సమా చారం ప్రకారం ఉద్యోగులు వారి సొంత నియోజవర్గం ౅కేంద్రంలో గల ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో పోస్టల్‌ బ్యాలె ట్‌ వినయోగించుకోవాలని ఉత్తర్వులు జారీ చేయగా సాయంత్రం నాటికి దీనిని మార్చి ఎక్కడ ఎలక్షన్‌ డ్యూటీ పడితే అక్కడే ఓటు వినియోగించుకోవాలని మరో ఉత్తర్వులు ఇచ్చారు. తీరా శనివారం ఉదయం ఓటు హక్కు వినియోగించుకునే నిమిత్తం ఫెసిలిటేషన్‌ సెంటర్‌కు వెళ్లిన ఉద్యోగులకు మధ్యాహ్నం వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ జారీ చేయలేదు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఎక్కడ ఉపయోగించుకోవాలో ఉద్యోగులకు ప్రభుత్వం అవగాహన కలిగించలేదు. ఉద్యోగులకు ఓటు హక్కు ఒక ప్రాంతంలో ఉంటుంది. వాళ్లు ఉద్యోగం వేరే ప్రాం తంలో చేస్తారు. ఎన్నికల డ్యూటీ నిమిత్తం వేరే కేంద్రంలో ట్రైనింగ్‌ ఇస్తారు. ఈ మూడు ప్రాం తాల్లో ఎక్కడ ఓటు వేయాలో ఉద్యోగులకు అధి కారులు అవగాహన కల్పించలేదని ఉద్యోగులు, ఉపా ధ్యాయులు వాపోతున్నారు. కొంతమంది ఉద్యోగులకు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి మీ ఓటు మా ఏరియాలోనే ఉంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలియేషన్‌ కేంద్రానికి వెళ్ళి ఓటు వేయండి అని ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. తీరా ఆ కేంద్రానికి ఓటు వేయడానికి వెళ్తే మీ ఓటు ఇక్కడలేదని అధికారులు చెప్పడంతో ఉద్యో గులు నిర్ఘాంత పోతున్నారు. ఉద్యోగులు పని చేసే నియోజకవర్గంలో ఫారం– 12 (ఉద్యోగి వివరాలు) ఇచ్చిన చోటే మీరు ఓటు వేయాలని అధికారులు చెబుతున్నారు. మరలా అక్కడ నుంచి ఫారం– 12 ఇచ్చిన నియోజకవర్గ ప్రధాన కేంద్రం వద్దకు వెళ్లాలంటే 40, 50 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఇప్పటికే చాలా దూరప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాం. ఈ ఎండల్లో మరలా అక్కడి ఎలా వెళ్ళగలమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అధికారులు మీరు ఎక్కడ అయితే ట్రైనింగ్‌ అయ్యారో అక్కడ పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. తీరా ట్రైనింగ్‌ సెంటర్‌లో ఓటు వేయవచ్చని వచ్చిన వారికి నిరాశే మిగడంతో దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మౌలిక సదుపాయాలు కరువు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేక ఉద్యోగులు విలవిలలా డారు. మండుటెండల్లో ఎంతో దూరం నుంచి వచ్చిన వారికి కనీసం తాగునీరు ఏర్పాటు చేయకపోవడంతో ఉద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబికింది. కనీసం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు ఎలా వేయాలో తెలియజెప్పే హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయలేదు.

భీమడోలు పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగికి చింతలపూడిలో ఎన్నికల డ్యూటీ పడింది. అతను ఫారం–12 ను ఉంగుటూరులో దరఖాస్తు చేయగా అతనికి చింతలపూడి నియోజకవర్గ ఓటు బ్యాలెట్‌ జారీ చేయడం అధికారుల నిరక్ష్య ధోరణికి గా నిదర్శనంగా మారింది.

ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉంగుటూరు, నిడమర్రు, భీమడోలు మండలాల ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ను నారాయణపురం హైస్కూలులో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో వినియోగించు కున్నారు. అయితే నియోజకవర్గంలోని గణపవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్లడంతో ఏలూరు జిల్లా కేంద్రం నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌లు రాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు గందర గోళ పడ్డారు. పదిరోజుల క్రితం తాడేపల్లిగూడెంలో ఎన్నికల ట్రైనింగ్‌ తీసుకొన్న గణపవరం ఉద్యోగులు అక్కడ ఫారం– 12 దరఖాస్తులు సమర్పించగా అక్కడకు వెళ్లిన ఉద్యోగులకు అక్కడ బ్యాలెట్‌ జారీ కాలేదు. ఉంగుటూరు వస్తే ఇక్కడ బ్యాలెట్‌ లేదని చెప్పడం తో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు రాజకీయ పార్టీ ల జోక్యం చేసుకోవాల్సిన పరిస్ధితి దాపరించింది. ప్రభుత్వ ఉద్యోగుల ఓటును వ్యతిరేక ఓటుగా భావించడం వల్లే వారిని ఇబ్బంది పెట్టి వారు ఓటు హక్కు వినియోగించుకోకుండా చేయడమే ప్రధాన అజెండా సాగిందని ఉద్యోగ సంఘాల పెద్దలు ఆరోపణ చేస్తున్నారు. కాగా తాడేపల్లిగూడెంలో ఫాం–12 ఇచ్చి ఉంగుటూరు నియోజకవర్గంలో ఓటు లేకపోతే ఉద్యోగులకు ఎక్కడ ఓటు ఉందో అక్కడ వినియోగించుకోవాలని ఆర్వో ఖాజావలి ఒక ప్రకటనలో కోరారు. అవసర మైతే ఫోన్‌ నెంబర్‌ 94910 41424లో సంప్రదించాలని కోరారు.

ఎన్నికల సిబ్బంది అందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం : కలెక్టర్‌

ఏలూరు సిటీ/ పెదపాడు/నూజివీడు టౌన్‌, మే 4 : జిల్లాలో ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది అందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ చెప్పారు. ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించి పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ప్రక్రియ, కేంద్రంలో సౌకర్యాలను పరిశీలించారు. వట్లూరులోని సర్‌ సీఆర్‌రెడ్డి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన దెందులూరు నియోజకవర్గం పోస్టల్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. జిల్లాలో 18 వేల మందికి పైగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారని కలెక్టర్‌ అన్నారు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను శనివారం కలెక్టర్‌ సందర్శించారు. కలెక్టర్‌ వెంట ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అఽధికారి ఎం.ముక్కంటి , కమిషనర్‌ ఎస్‌ వెంకటకృష్ణ, జేసీ లావణ్యవేణి, పాటు నూజివీడు ఆర్డీవో భవానిశంకరి, పోలీసు, రెవెన్యూ, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. కాగా జిల్లాలో తొలిరోజు 5,690 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ఓటుకు రూ.2 వేలు

ప్రభుత్వ ఉద్యోగు లకు ప్రభుత్వం ఏమి చేయలేదని, వీరంతా వ్యతిరేకంగా ఓటు వేస్తారని వైసీపీ నేతలు భావించారు. అందుకే డబ్బులు ఎర చూపి ఓట్లు వేయించు కోవాలని పోలింగ్‌ కేంద్రం వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు పడిన తంటాలు అవిఇవి కావు. ఎలాగైనా ఓటర్లను గుర్తించి ఓటుకు రూ.2వేలు చొప్పున పంచారని గుసగుసలు వినిపించాయి.

ఓటుకు దూరంగా ఉంచాలి

ప్రభుత్వ ఉద్యోగులను ఎలాగైనే ఓటుకు దూరంగా ఉంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. అందుకే సరైన క్లారిటీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఓటు ఎక్కడ వేయాలో తెలియని గందరగోళ పరిస్థితుల్లోకి ప్రభుత్వం నెట్టేసింది. దీనికి కారణం ఉద్యోగుల ఓట్లు అనుకూలంగా పడవనే.

– డి.శ్రీనివాసరావు, ఎస్‌ఏ, పెదపాడు హైస్కూల్‌.

ఎండలో ఇబ్బందులు పెట్టారు..

కోటదిబ్బ జూనియర్‌ కళాశా లకు వెళ్ళి ఓటు వేయండి అంటూ తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిం ది. నేను ఐడీ పత్రాలు తీసుకుని వెళ్ళాను. ఉద యం 10 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటిగంట వరకు వెయిట్‌ చేయించి మీకు ఓటు లేదు గణపవరం మండలం వెళ్ళి వేయండి అని చెప్పారు. ఎండలో మహిళా ఉద్యోగులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు.

– శిరోమణి, టీచర్‌, గణపవరం మండలం.

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం..

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యా యులు ప్రభుత్వానికి వ్యతిరేకమని తెలిసి పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని గందరగోళ పరిస్థితికి నెట్టారు. ఉద్యోగులు మూకుమ్మడిగా ఓట్లు వేస్తే ఓడిపోతామనే భయం వైసీపీ నేతల్లో ఉంది. అందుకే ఈ గందరగోళం సృష్టించారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయా ల్లేవు. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ ఓటు వేయాలో ఫోన్‌ మెసేజ్‌ ద్వారా తెలపాలి. ఈ అంశంపై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం.

– బడేటి చంటి, ఏలూరు కూటమి అభ్యర్థి

Updated Date - May 04 , 2024 | 11:58 PM