Share News

ఉద్యోగుల జీతాల చెల్లింపునకు చట్టబద్ధత కల్పించాలి

ABN , Publish Date - May 04 , 2024 | 11:54 PM

ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన జీతభత్యాలు, పెన్షన్లు, తదితర ఆర్థిక అంశాలకు చట్టబద్దత కల్పించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌ సూర్య నారాయణ డిమాండ్‌ చేశారు

ఉద్యోగుల జీతాల చెల్లింపునకు చట్టబద్ధత కల్పించాలి
సమావేశంలో సంఘీభావం తెలియజేస్తున్న ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు

పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగానికి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారే బాధ్యత వహించాలి

ఆర్థిక బకాయిలన్నింటినీ ‘పారు బకాయి’కింద రద్దు చేస్తారేమోనని ఉద్యోగుల్లో ఆందోళన

ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక సమావేశం

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 4 : ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన జీతభత్యాలు, పెన్షన్లు, తదితర ఆర్థిక అంశాలకు చట్టబద్దత కల్పించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌ సూర్య నారాయణ డిమాండ్‌ చేశారు. సాధారణ ఎన్నికల విధులకు ఉద్యోగ సిబ్బందిని నియమించిన నియోజక వర్గ రిటర్నింగ్‌ అధికారే సంబంధిత ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించు కునేలా వ్యక్తిగత బాధ్యత తీసుకునేలా భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సభ్య సంఘాలతో జరిపే చర్చలకు హాజ రయ్యే వివిధ శాఖల ప్రతినిధులను రెండేళ్లకోసారి నేరుగా సంబంధిత ఉద్యోగులే ఎన్నుకునేలా ఏర్పాట్లు ఉంటే ఉద్యోగ సంఘాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయన్నారు. ఐక్యవేదిక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాశాఖ సమావేశం శనివారం ఏలూరులోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, పెన్షనర్లు హాజర య్యారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 12 అంశాలపై చర్చావేదిక నిర్వహించారు. తొలుత ఇవే అంశాలను మీడియా సమావేశంలోనూ వివరించారు. సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల ఆర్థిక అంశాలకు చట్టబద్దత కల్పించినపుడు, ప్రభుత్వం దానిని ఉల్లంఘిస్తే ఐపీసీ నిబంధనల మేరకు ప్రాసిక్యూట్‌ చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక చెల్లింపులకు చట్టబద్దత లేకపోవడం వల్లే 15వ తేదీ దాటినా జీతాలు, పెన్షన్లు వస్తూనే ఉన్నాయన్నారు. ఉద్యోగ సంఘాల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల ప్రభుత్వం నాలుగు స్థంబాలాట ఆడుతోందని, ఈ పరిస్థితి వల్ల కొన్ని సంఘాలు పాలాభిషేకాలకు, చాయ్‌ పే చర్చలకు పరిమితమవుతున్నాయని ఆరోపించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయమన్నా దిక్కులేదని, కనీసం సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగినా స్పందన లేదన్నారు. జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి పన్నురాబడి పరిధి లేదా పన్నురేటును పెంచుకునే అవకాశం లేనందున ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.20–25 వేలకోట్ల బకాయిలన్నింటినీ ఒకేసారి ‘పారు బకాయి’ కింద రద్దు చేస్తారేమోనన్న ఆందోళన ఉద్యోగ, పెన్షనర్లలో నెలకొందని వివరించారు.ఉద్యోగుల సమస్యలపై నిరసన తెలియజేద్దామన్నా నాయకులను గృహ నిర్బంధాలు, పోలీసు నోటీసులతో వేదిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల జీతం నుంచి నెలనెలా మినహాయించుకుంటున్న ఆరోగ్య బీమా సొమ్ము, ప్రభుత్వ వాటా కలిపితే ఏడాదికి రూ.450 కోట్లుగా ఉందని, ఇంత పెద్దమొత్తంలో నిధులు వున్నా ఉద్యో గులకు ఈహెచ్‌ఎస్‌ వైద్యసేవలను పెయిడ్‌ సర్వీసుగా కాకుండా, సామాన్యులకు ఉచితంగా అంద జేసే ఆరోగ్యశ్రీ సేవలుగా దిగ జార్చారని మండిపడ్డారు. రేషనలైజేషన్‌తో పెద్దసంఖ్యలో టీచరు పోస్టులను రద్దు చేశారని, మన రాష్ట్ర సరిహద్దుల్లో పొరుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం వారివారి మాతృ భాషల్లో బోధన కోసం ప్రత్యేక పాఠశాలలను నిర్వహిస్తోన్న ఏపీ ప్రభుత్వం, ఇక్కడమాత్రం మాతృభాషలో పాఠశా లలను నిర్వహించడం లేదని ఎద్దేవా చేశారు. ఐక్యవేదిక సమావేశాలు ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసమేనని, తమకు యజమాని ప్రభుత్వమే తప్ప రాజకీయ పార్టీలు కాదన్నారు. ఎన్నికల నియమావళి వున్నా ఉద్యోగులు సమావేశాలు నిర్వహించు కోవడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని, ఎన్నికల నియామవళి రాజకీయ పార్టీలకే పరిమితమని పౌరులకు, ఉద్యోగులకు వర్తించబోదని వివరించారు. అంతర్గత సమావేశాలకు ఎవరినుంచీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 6న నిర్వహించే స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ చర్చావేదికలు ఎన్నికల అనంతరం ఈ నెల 13న నిలిచిపోయేవి కావని, నిరంతరం కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఐక్యవేదిక సెక్రటరీ జనరల్‌, ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాజీపఠాన్‌ మాట్లాడుతూ సీపీఎస్‌ కంటే జీపీఎస్‌ మరింత భయంకరమైనదన్నారు. కో–చైర్మన్‌ కరణం హరికృష్ణ, వైస్‌చైర్మన్లు కేదారేశ్వరరావు, రమేష్‌బాబు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మాగంటి శ్రీనివాసరావు, కరిమి రాజేశ్వరరావు, ప్రసాద్‌, ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.అప్పారావు,గోవిందరావు, శేషుకుమార్‌, రామకృష్ణ, సుందరయ్య పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:54 PM