Share News

కృష్ణాలోకి నూజివీడు

ABN , Publish Date - May 04 , 2024 | 11:56 PM

నూజి వీడును కృష్ణా జిల్లాలో కలపాలని మీరు ఎప్పటి నుంచో కోరు తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా చేస్తా.. ఈలోగా వీరు కూటమికి ఓట్లు వేసి మద్దతు పలకాలి. వైసీపీ ని ఓడించాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నూజివీడు ప్రజాగళం సభలో పిలుపునిచ్చారు.

కృష్ణాలోకి నూజివీడు

అధికారంలోకి రాగానే కలుపుతాం

అమరావతికి పూర్వ వైభవం

సైకో ప్రభుత్వంతో అంతా నాశనం

మాదిగలు, మాలలకు న్యాయం చేస్తాం

చింతలపూడి ఎత్తిపోతల పూర్తి నా కల

అందరికీ ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు

కూటమికి మద్దతు పలికి వైసీపీని ఓడించాలి

నూజివీడు సభలో చంద్రబాబు పిలుపు

నూజివీడుకు వరాలు

నూజివీడు ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తాం.

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు.

పరిశ్రమలను రప్పించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం.

అందరికి ఇళ్ళ స్థలాలు సమకూరుస్తాం. టిడ్కో ఇళ్ళను అందుబాటులోకి తీసుకువస్తా.

డ్రైనేజి, రహదారి విస్తరణ, ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉంటా.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్‌ల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తాం

ఏలూరు/నూజివీడు, మే 4(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘నూజి వీడును కృష్ణా జిల్లాలో కలపాలని మీరు ఎప్పటి నుంచో కోరు తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా చేస్తా.. ఈలోగా వీరు కూటమికి ఓట్లు వేసి మద్దతు పలకాలి. వైసీపీ ని ఓడించాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నూజివీడు ప్రజాగళం సభలో పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా నూజివీడులో శనివారం మధ్యాహ్నం మండుటెండలోనే వేలాది మంది హాజరైన సభలో చంద్రబాబు చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. మన మేనిఫెస్టో అద్భుతం అంటూ కీర్తించారు. నూజివీడు ఎమ్మెల్యే, ఆయన తనయుడిపై విరుచుకుపడ్డారు. ఇక మీ ఆటలు సాగవంటూనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని లెక్కలు తీస్తామని నొక్కి చెప్పారు. చూస్తూ ఊరుకోబోమని ప్రతీది టచ్‌ చేస్తామంటూ హర్షద్వానాల మధ్య కామెంట్లు చేశారు. తన పాలనలో మల్లవల్లిలో ఇండస్ర్టియల్‌ పార్క్‌ను ఏర్పాటు చేసి, ఉపాధి కల్పనకు అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నించాను. కాని ఈ సైకో ప్రభుత్వంలో అదంతా నాశనమైందని, తిరిగి యువతకు ఉద్యోగాలు ఇచ్చేలా పరిశ్రమలను రప్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

అమరావతితోనే నూజివీడు అభివృద్ధి

‘అమరావతి రాజధానిగా ప్రపంచస్థాయిలోనే నెంబర్‌వన్‌గా నిలుపుదామనుకున్నా. దుర్మార్గుడు వచ్చాడు. మూడు ముక్కల ని, అమరావతిని నాశనం చేశాడు. ఇది రాజధాని అయితే నూజివీడు నుంచే ఉద్యోగాలు చేసే వారంతా అమరావతికి వచ్చి వెళ్లేవారు. దీన్ని అంతా జగన్‌ చెడగొట్టాడు. కావాలనే ఇష్టానుసారం వ్యవహరించాడు. అమరావతి రాజధాని అయితే నూజివీడు సమీపాన ఔటర్‌ రింగ్‌ రోడ్డు వచ్చి ఉండేది. హను మాన్‌ జంక్షన్‌ వరకు అద్భుతమైన మార్గం అయ్యి ఉండేది. దీన్ని జగన్‌ రద్దు చేశాడు. అమరావతికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత నాది. జగన్‌కు తెలిసింది విధ్వంసమే. నాకు తెలిసింది అభివృద్ధే. ఎమ్మార్పీఎస్‌ కూటమికి మద్దతు ఇచ్చింది. మాదిగలకు సరైన న్యాయం చేస్తాం. వర్గీకరణ విషయం పరిగణనలోకి తీసుకుంటా. ఇదే తరుణంలో మాలలకు ఇప్పటికే అన్యాయం జరిగింది. వారు కూడా కూటమికే ఓటు వేయాలి. కచ్చితంగా వారికి న్యాయం జరిగేలా చూసే బాధ్యత నాది. బీసీ వర్గాల సంక్షేమం కోసం ఇప్పటికే బీసీ డిక్లరేషన్‌ తెచ్చాం. కచ్చితంగా ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుంది. నూజివీడును సస్యశ్యామలం చేసేలా నా అంతట నేనుగా శ్రమించాను. చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేయటం నా కల. నాగార్జునా సాగర్‌ ఎడమ కాలువ ద్వారా నూజివీడుకు నీరు తెచ్చే అవకాశం ఉండగా, ఇది చాలా వ్యయ ప్రయాసల తో కూడుకుంది. అందుకనే దాన్ని కాదని చింతలపూడి ఎత్తిపోతలను అమల్లోకి తెద్దామనుకున్నాం. ఈ పథకాన్ని పూర్తి చేసి మీ చేలకు నీరందిస్తాం. తాగునీటికి కొరత లేకుండా చేస్తాం. ఇది పూర్తి అయితే మామిడి పంటకు నూజివీడు కేంద్రం. మామిడికి ఒక తడి వేయవచ్చు. మంచి పంటను దక్కించుకోవచ్చు. అలాగే ఇంకో పక్క జొన్న, పామాయిల్‌ వంటి పంటలను మెరుగుపరుచుకోవచ్చు.

ముద్దరబోయినతోపాటే ఓట్లు రావాలి

నూజివీడు కన్వీనర్‌ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తిరిగి పార్టీలోకి వచ్చారు. ఆయన భవిష్యత్తు నేను చూసుకుంటా. ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో అంతా ఇస్తా. కచ్చితంగా నూజి వీడులో సారధి గెలవాలి. అన్ని ఓట్లు ఇటేపడాలి. అంటూ ముద్దరబోయిన ఎదుట చంద్రబాబు అసలు లక్ష్యం ఉంచారు. దీన్ని కాదని ఎవరైనా గీత దాటితే పరిణామాలు వేరే ఉంటాయి అన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.

వ్యవస్థలను నాశనం చేసిన వైసీపీ : పార్థసారఽథి

నూజివీడు ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారధి మాట్లాడు తూ ‘ఐదేళ్ల పాలనలో వైసీపీ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేసింది. నూజివీడు నియోజకవర్గంలో తాగు నీటికి, సాగు నీటికి తీవ్ర కటకట ఏర్పడింది. మామిడి తోటలు ఎక్కడ చూసినా కాయ కానరాని పరిస్థితి. చంద్రబాబుకు పేరు వస్తుందనే కారణంతో ఈ ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతలను ఆపి, 33 మండలాల్లోని రైతులను ఇబ్బంది పాలు చేసింది. ఫలితంగా పంట భూములు బీళ్ళుగా మారు తున్నాయి. త్రాగునీటిలో ప్లోరైడ్‌ చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ పరిస్థితి మారాలంటే చంద్రబాబు సీఎం కావాల్సిందే. ఈ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే క్వారీ అక్రమా లకు బాబూరావు అనే ఒక ఎస్సీ సోదరుడిని బలి చేసి 3 కోట్ల 70 లక్షలు ఫైన్‌ వేయించారు. కాని ఆ క్వారీ అక్రమాల్లో ఎమ్మెల్యేకి, ఆయన కుమారుడికి పాత్ర ఉంది’ అని విమర్శిం చారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్దరబోయిన వెంకటేశ్వర రావు, టీడీపీ నాయకులు అట్లూరి రమేష్‌ వేదికపై ఉన్నారు.

జగన్‌ ఇల్లు బాగుపడింది : పుట్టా

ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌ మాట్లాడు తూ ‘మీ ఇల్లు బాగు పడితేనే నాకు ఓటు వేయండి అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ చెబుతున్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో బాగుపడింది ఒక్క జగన్‌ ఇల్లు మాత్రమే. తాడేపల్లి, వైజాగ్‌, బెంగళూరు, హైదరాబాద్‌ ఇలా ప్రధాన నగరాల్లో ఆయన మాత్రమే ఇళ్ళు కట్టారు. పేదలకు మాత్రం ఒక సెంటు స్థలం ఇచ్చి నయవంచనకు గురిచేశారు. తన కుటుంబంలో చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారు. ఏలూరు నియోజకవర్గ పరిధిలో ఏడు నుంచి 8 పరి శ్రమలను తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలను కల్పి స్తాం. ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపితే మీ గళాన్ని నా గొంతుతో వినిపిస్తా. జాతీయంగా గుర్తింపు వున్న నూజి వీడు మామిడికి మార్కెట్‌ కల్పిస్తాం. జాతీయస్థాయిలో మామిడి ఎగుమతులకు రైల్వే రాక్‌లను తిరిగి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను. కేంద్రం నుంచి అందుతున్న వివిధ పథకాల ద్వారా ప్రత్యేకంగా నూజివీడును అభివృద్ధి పథంలో నడిపిస్తా.

Updated Date - May 04 , 2024 | 11:56 PM