Share News

పొలిటికల్‌ బెట్టింగ్‌

ABN , Publish Date - May 05 , 2024 | 12:06 AM

ఎన్నికల ఫలితాలపై అప్పుడే పందెంగాళ్లు కాళ్లు దువ్వుతున్నారు.

పొలిటికల్‌ బెట్టింగ్‌

రంగంలో దిగిన పందెంరాయుళ్లు

కూటమి విజయంపై మొగ్గు

ఆకివీడు / ద్వారకాతిరుమల, మే 4: ఎన్నికల ఫలితాలపై అప్పుడే పందెంగాళ్లు కాళ్లు దువ్వుతున్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల విజయావ కాశాలపై అంచనా వేసుకుంటున్నారు. జనం నాడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పందెం కాయడంలో కమీషనుదారులు కీలకంగా మారారు. నియోజకవర్గ కేంద్రాలు, పల్లెల్లోని ప్రధాన కూడళ్లలో సంచరిస్తున్నారు. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్న నియోజకవర్గాలనే ఎన్నుకుంటున్నారు. ముఖ్య నాయకులు పోటీచేసే చోట పందెం కాసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో ఉండి, భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలపై పందెం రాయుళ్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో టీడీపీ మెజార్టీపైనే ఎక్కువ పందేలు జరుగుతున్నాయి.

ఐదు శాతం కమీషన్‌

పందేలు కాయడంలో పశ్చిమ గోదావరి జిల్లా పెట్టింది పేరు. క్రికెట్‌, కోడి పందేలు గురించి చెప్పనవసరం లేదు. అంతక మించి ఎన్నికల పందేలు కాస్తుంటారు. రెండు వైపులా పందెం గాళ్లకు మధ్య వర్తిత్వం వహించడంలో కమీషన్‌దారులదే హవా. దళారులకు 5 శాతం కమీషన్‌ ఉంటుంది. దీంతో క మీషన్‌దారులు కూడా ప్రజల నాడిని తెలుసుకొనేందుకు నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు.

కూటమి వైపు ఎక్కువ పందేలు

ఈసారి లక్షలు, కోట్లలో పందేలు కాస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో పందేలు కాసిన పందేలరాయుళ్లు ఇక్కడ తిష్ట వేశారని చెబుతున్నారు. అక్కడ కాంగ్రెస్‌ గెలుస్తుందని పందేలు కాసి సొమ్ములను కైవసం చేసుకున్న వారు ఇక్కడ తెలుగుదేశం కూటమి గెలుస్తుందని లక్షలాది రూపాయలతో పందేలు కాస్తున్నారు. వైసీపీ గెలుస్తుందని పందెం కాసేవాళ్లు అరుదుగా కనిపిస్తున్నారని పందెంరాయుళ్లు చెబుతున్నారు. దీంతో పందేలరాయుళ్లు సైతం నిరాశతో ఉన్నారని, వైసీపీ గెలిస్తే 4, 5 రెట్లు ఎక్కువ ఇస్తామన్నా ఎవరూ ముందుకు రావడం లేదని చెబుతున్నారు. మొత్తం మీద వైసీపీ గెలుస్తుందని పందేలు కాసేవారు తక్కువగా ఉన్నారని, దీంతో టీడీపీ కూటమి విజయం ఖాయమని అంచనా వేస్తున్నారు.

Updated Date - May 05 , 2024 | 12:06 AM