Share News

ఇది జగనన్న బాదుడు

ABN , Publish Date - May 05 , 2024 | 12:00 AM

కరెంట్‌ చార్జీలు తగ్గిస్తానని గత ఎన్నికల ముందు జగన్‌ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో కూడా కరెంట్‌ చార్జీలు పెంచనని చెప్పి మరీ సామాన్యుల నడ్డి విరిచారు. ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణం చేశాక ఏడాదిలోపే బాదుడు మొదలెట్టారు. ఐదేళ్లలో ఇష్టానుసారంగా విద్యుత్‌ చార్జీల మోత మోగించారు. ఏకంగా తొమ్మిది సార్లు జనం నెత్తిన చార్జీల భారం మోపారు.

ఇది జగనన్న బాదుడు

పెంచబోమని హామీ ఇచ్చి.. సామాన్యుల నడ్డి విరిచి..

ఐదేళ్లలో ఏకంగా తొమ్మిదిసార్లు మోత

సర్కారు తీరుపై జిల్లావాసుల తీవ్ర అసంతృప్తి

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

- గరుగుబిల్లి మండలం గొట్టివలసకు చెందిన ఈశ్వరరావుకు గ్రామంలో ఓ పెంకిటిల్లు ఉంది. ఒక ఫ్యాను, రెండు ఎల్‌ఈడీ ట్యూబ్‌ లైట్లు వాడుతున్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయనకుు నెలకు రూ.300 బిల్లు వచ్చేది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కరెంట్‌ వినియోగానికి గాను ప్రతి నెలా రూ.600 చెల్లించాల్సి వస్తోంది. గతంలో కంటే విద్యుత్‌ బిల్లులు అధికంగా వస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆయన వాపోతున్నాడు.

- భామినికి చెందిన జి.జోగినాయుడు గ్రామంలోని స్లాబ్‌ ఇంటిలో ఉంటున్నారు. రెండు ఫ్యాన్లు, రెండు లైట్లు వాడుతున్నాడు. గతంలో ఆయకు ప్రతినెలా రూ.300 విద్యుత్‌ బిల్లు వచ్చేది. కానీ ప్రస్తుతం రూ.500 పైబడి బిల్లు వస్తోంది.

- భామిని మండలం ఘనసరకు చెందిన ముద్దాడ కాంతమ్మ గ్రామంలోని ఓ గదిలో నివాసం ఉంటోంది. ఒక బల్బు, ఫ్యాన్‌ వినియోగిస్తోంది. షెడ్యూల్డ్‌ కులానికి చెందిన ఆమెకు విద్యుత్‌ బిల్లుపై రాయితీ ఉంది. కానీ ప్రతినెలా రూ.850 పైనే బిల్లు వస్తోంది. దీంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతోంది. కరెంట్‌ ఎప్పుడు తొలగిస్తారన్న భయంతో ప్రతినెలా విద్యుత్‌ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది.

- మక్కువకు చెందిన రఘుమండల ప్రసాద్‌కు గ్రామంలో ఓ స్లాబు ఇల్లు ఉంది. రెండు ట్యూట్‌ లైట్లు, రెండు ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. అయితే గతంలో నెలకు రూ.300 బిల్లు వచ్చేది. అయితే వైసీపీ పాలనలో అది రెట్టింపయ్యింది. ప్రతినెలా రూ.600 నుంచి రూ.800 వరకు బిల్లు వస్తుండడంతో ఆయన ఆందోళన చెందుతున్నాడు.

ఇలా ఎంతోమంది జిల్లాలో అవస్థలు పడుతున్నారు. విద్యుత్‌ను వినియోగించాలంటేనే హడలెత్తిపోతున్నారు. విద్యుత్‌ బిల్లులు మోతతో షాక్‌కు గురువుతున్నారు. ప్రతినెలా సామాన్య, మధ్యతరగతి వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నెలకు రూ.300 నుంచి రూ.500 లోపు బిల్లులు వచ్చేవి. వైసీపీ అఽధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు చార్జీలు పెంచేయడంతో విద్యుత్‌ బిల్లులు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతినెలా అదనపు భారం పడుతుండడంతో వైసీపీ సర్కారు తీరుపై జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు.

హామీ ఏమైంది?

కరెంట్‌ చార్జీలు తగ్గిస్తానని గత ఎన్నికల ముందు జగన్‌ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో కూడా కరెంట్‌ చార్జీలు పెంచనని చెప్పి మరీ సామాన్యుల నడ్డి విరిచారు. ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణం చేశాక ఏడాదిలోపే బాదుడు మొదలెట్టారు. ఐదేళ్లలో ఇష్టానుసారంగా విద్యుత్‌ చార్జీల మోత మోగించారు. ఏకంగా తొమ్మిది సార్లు జనం నెత్తిన చార్జీల భారం మోపారు. మొత్తంగా విద్యుత్‌ వినియోగదారులకు ఇచ్చిన మాటపైనా మడమ తిప్పారు. ఎస్సీ, ఎస్టీలందరికీ 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్‌ ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చి మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక తండాలు, కాలనీల్లో ఉండేవాళ్లకే అని షరతు పెట్టి మిగతా వారికి ఎగ్గొట్టేశారు. మొత్తంగా ట్రూఅప్‌ చార్జీలు, విద్యుత్‌ కొనుగోళ్ల సర్దుబాటు పేరిట భారీగా విద్యుత్‌ చార్జీల పెంచి ప్రజలపై అదనపు భారం మోపారు. సర్దుబాటు పేరుతో పదేళ్ల కిందట వాడిన విద్యుత్‌ వినియోగానికి కూడా వివిధ రూపాల్లో చార్జీలు వసూలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని చెప్పవచ్చు.

వాణిజ్య వర్గాలనీ వదలలేదు

కేటగిరీ-2 కింద కనెక్షన్‌ను పొందిన వాణిజ్య వర్గాలనూ వైసీపీ ప్రభుత్వం వదలలేదు. అదనపు లోడ్‌ పేరుతో వాతలు పెట్టింది. అధికంగా విద్యుత్‌ వినియోగం చేసిన వారికి నోటీసులు జారీ చేసిన పరిస్థితి జిల్లాలో ఉంది. దీంతో వాణిజ్య వర్గాలు కూడా వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

బాదుడు ఇలా..

- 2021-22 ఏప్రిల్‌ నుంచి గృహ విద్యుత్‌కు బదులుగా కాంట్రాక్ట్‌ లోడ్‌పై స్థిర చార్జీల కింద కిలో వాట్‌ విద్యుత్‌కు రూ.పది చొప్పున వసూలు చేశారు. సింగిల్‌ ఫేస్‌ కనెక్షన్‌ తీసుకున్న వినియోగదారుడు కనీసం మూడు కిలోవాట్ల లోడ్‌ తీసుకుంటే.. ప్రతినెలా రూ.30 అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇలా ఏడాదికి వారిపై రూ.300 అదనపు భారం పడుతుంది. ఇటువంటి సమయంలో త్రీ ఫేస్‌ కనెక్షన్‌ తీసుకుంటే ఐదు కిలోవాట్ల లోడ్‌ నమోదవుతుంది. దీనిపై ఏడాదికి ఆయా వినియోగదారుల నుంచి రూ.600 తప్పనిసరిగా వసూలు చేసిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉందని చెప్పవచ్చు.

- 2014-19 మధ్య వినియోగించిన యూనిట్లకు ట్రూ అప్‌ పేరిట లెక్కించి విద్యుత్‌ వినియోగదారుల నుంచి వసూలు చేయాలని వైసీపీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ప్రతి యూనిట్‌కు 22 పైసలు చొప్పున భారం వేశారు.

- 2021-22లో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించి ఇంధన సర్దుబాటు చార్జీల కింద గతేడాది ఏప్రిల్‌ నుంచి వసూలుకు వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనివల్ల గృహ విద్యుత్‌ వినియోగదా రులకు విద్యుత్‌ బిల్లులు షాక్‌ ఇస్తున్నాయి.

- గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రతినెలా విద్యుత్‌ కొనుగోలుకు అదనంగా చేసే ఖర్చులో యూనిట్‌పై గరిష్ఠంగా 40 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇంధన చార్జీల సర్దుబాటు పేరిట వచ్చే మూడు నెలల్లో ఇలానే వసూలు చేస్తారు. ఏప్రిల్‌ బిల్లు జూన్‌లో , మే నెల బిల్లు జూలై నెలలో , జూన్‌ నెల బిల్లు ఆగస్టులో వసూలు చేయనున్నారు. కాగా జిల్లాలో 1,92,279 మంది విద్యుత్‌ వినియోగదారులు ఉన్నారు. అయితే వారంతా వైసీపీ ప్రభుత్వ పాలనలో విద్యుత్‌ బిల్లులు చూసి గగ్గోలు పెడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన బిల్లులను పోల్చుకుంటూ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రతినెలా అధిక మొత్తంలో వచ్చే బిల్లులను చూసి ఆందోళన చెందుతున్నారు. రెట్టింపు స్థాయిలో వచ్చే బిల్లులను అరకొర ఆదాయంతో ఎలా చెల్లించాలో తెలియక మథనపడుతున్నారు. మరికొందరు వాటికోసం అప్పులు చేయాల్సి వస్తోంది. మొత్తంగా వైసీపీ సర్కారు విద్యుత్‌ బిల్లుల బాదుడుపై జిల్లావాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 05 , 2024 | 12:00 AM