Share News

కరెంటు పోయి.. గడపలో నిద్ర

ABN , Publish Date - May 04 , 2024 | 11:55 PM

తొలికాన్పులో ఆడపిల్ల పుట్టడంతో వారెంతో సంతోషించారు. తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబర పడ్డారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. విధి వారిపై చిన్నచూపు చూసింది. తీరని శోకాన్ని మిగిల్చింది. ఇంటి స్లాబు పెచ్చులూడి మీద పడడంతో మూడు నెలల చిన్నారి మృతి చెందింది. పాలకొండ మండలం వెలగవాడ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

కరెంటు పోయి.. గడపలో నిద్ర

తల్లి, అమ్మమ్మకు స్వల్ప గాయాలు

తెల్లవారుజామున ఘటన

పాలకొండ: తొలికాన్పులో ఆడపిల్ల పుట్టడంతో వారెంతో సంతోషించారు. తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబర పడ్డారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. విధి వారిపై చిన్నచూపు చూసింది. తీరని శోకాన్ని మిగిల్చింది. ఇంటి స్లాబు పెచ్చులూడి మీద పడడంతో మూడు నెలల చిన్నారి మృతి చెందింది. పాలకొండ మండలం వెలగవాడ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒకే గ్రామానికి చెందిన సంజీవ్‌, మంజులకు రెండేళ్ల కిందట వివాహమైంది. మూడు నెలల కిందటే వారికి ఊహారాణి పుట్టింది. కాగా ఇటీవల సంజీవ్‌ ఉపాధి పనుల నిమిత్తం హైదరాబాద్‌ వలసపోయాడు. దీంతో కొద్దిరోజులుగా మంజుల అదే గ్రామంలోని కన్న వారింటిలో ఉంటోంది. కాగా శుక్రవారం రాత్రి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో గాలి కోసం మంజుల తన చిన్నారి పాప, తల్లితో కలిసి ఇంటి గడపలో పడుకుంది. అయితే శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంటి స్లాబు పెచ్చులూడి పడడడంతో ఊహారాణి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి పక్కనే నిద్రిస్తున్న తల్లి, అమ్మమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఊహించని ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి మరణాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పాప జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భోరున విలపిస్తున్నారు. మరోవైపు గ్రామంలోనూ విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - May 04 , 2024 | 11:55 PM