Share News

ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలి

ABN , Publish Date - May 05 , 2024 | 12:06 AM

ఎండల తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగిఉండాలని జిల్లా మలేరియా అధికారి టి.జగన్మోహనరావు సూచించారు.

ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలి

సీతానగరం: ఎండల తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగిఉండాలని జిల్లా మలేరియా అధికారి టి.జగన్మోహనరావు సూచించారు. ఆయన బూర్జ గ్రామ ఉపాధిహామీ వేతనదారులకు వేసవి దృష్ట్యా వడదెబ్బ డీహైడ్రేషన్‌కు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. బయట ఉష్ణోగ్రతల కారణంగా శరీరం ఎక్కువ నీరు లవణాలను కొల్పోతుందని, వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. నీరు, నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌, కొబ్బరినీళ్ళు, ఇంకా ఇంటి వద్ద అందుబాటులో ఉన్న ద్రావణాలు తరుచుగా తీసుకోవాలన్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు వైద్య సిబ్బంది వద్ద గ్రామాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌ను నీటిలో కలిపే విధానాన్ని అక్కడ వైద్య సిబ్బందిచే చేసి చూపించారు. అక్కడ ప్రజలకు ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని తాగించారు. ఈసందర్భంగా జగన్మోహన్‌ మాట్లాడుతూ వడదెబ్బకు గురయ్యే సమయంలో తలనొప్పి, తలతిరగడం, వికారం, జ్వరం, స్పృహ కొల్పోవడం అపస్మారక స్థితి మొదలగు లక్షణాలు ఉంటాయని వివరించారు. ప్రాథమికంగా వెంటనే చేపట్టాల్సిన చర్యలను అందరికీ అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే దగ్గర్లో ఉన్న చల్లని నీడ ప్రదేశానికి తీసుకువెళ్లి తడిగుడ్డతో శరీరాన్ని రుద్దుతూ ఉండాలని స్పృహలో ఉన్నపుడు మాత్రమే నీరు తాగించాలని అన్నారు. గ్రామాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌, గోపాల్‌, వైద్య సిబ్బంది గాయిత్రి, నరసమ్మ, వెంకటేష్‌, ఆశాకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:06 AM