Share News

ఊరొక్కటే.. అన్నీ రెండేసి

ABN , Publish Date - May 05 , 2024 | 12:02 AM

వెంకటరాయుని అగ్రహారం.. (వీఆర్‌ అగ్రహారం).. ఏకపట్టా అగ్రహారం.. బ్రాహ్మణ అగ్రహారం.. పేర్లు ఎన్ని ఉన్నా.. ఊరొక్కటే. కానీ రెండు పంచాయతీలు.. రెండు మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు, రెండు నియోజకవర్గాలలో ఉందా ఊరు.

ఊరొక్కటే.. అన్నీ రెండేసి
ఈ బోర్డే ఆ రెండు గ్రామాలకు సరిహద్దు

- రెండు పంచాయతీలు... ఇద్దరు సర్పంచులు

- రెండు మండలాలు.. ఇద్దరు ఎంపీపీలు

- రెండు రెవెన్యూ డివిజన్లు... ఇద్దరు ఆర్డీవోలు

- రెండు నియోజకవర్గాలు.. ఇద్దరు ఎమ్మెల్యేలు

- రెండు జిల్లాలు.. ఇద్దరు కలెక్టర్లు..

(రాజాం రూరల్‌)

వెంకటరాయుని అగ్రహారం.. (వీఆర్‌ అగ్రహారం).. ఏకపట్టా అగ్రహారం.. బ్రాహ్మణ అగ్రహారం.. పేర్లు ఎన్ని ఉన్నా.. ఊరొక్కటే. కానీ రెండు పంచాయతీలు.. రెండు మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు, రెండు నియోజకవర్గాలలో ఉందా ఊరు. అంతే కాదండోయ్‌.. ఆ గ్రామానికి ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఇద్దరు కలెక్టర్లు.. అక్కడితో ఆగకుండా రెండు తాగునీటి పథకాలు.. రెండు పాఠశాలలు.. ఇలా అన్నీ రెండేసే.. ఎంపీ మాత్రం ఒక్కరేనండోయ్‌.. దశాబ్దాల కిందట నుంచే ఇలా ఉన్న ఈ గ్రామంలో అభివృద్ధి అంతంత మాత్రమేనని చెప్పకతప్పదు. చిన్నపాటి వివాదాలు, మనస్పర్ధలు తప్పితే.. గ్రామస్థులంతా కలిసి మెలిసే ఉంటారు. కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడుంది.. ఎందుకిలాంటి పరిస్థితి నెలకొంది.. ఆ ఇద్దరేసి ఎవరెవరో తెలుసుకుందాం..

రాజాం మండలంలో...

వీఆర్‌ అగ్రహారం.. దశాబ్దాల కిందట బ్రాహ్మణులకు రాజులు ఇచ్చిన ఏకపట్టా అగ్రహారం. కాలక్రమంలో గ్రామంలోని తూర్పున అన్ని కులాలకు చెందినవారు పాకలు, ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తూ వచ్చారు. ఇలాంటి నిర్మాణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పేటగా పిలవడం ప్రారంభించారు. కాలక్రమంలో వీఆర్‌ అగ్రహారంలో వీఆర్‌ పేట అంతర్భాగంగా మారింది.

అన్నీ రెండేసి..

ప్రస్తుతం వీఆర్‌ అగ్రహారం అదే గ్రామ పంచాయతీ, రాజాం మండలం, రాజాం నియోజకవర్గం, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిఽధి.. విజయనగరం జిల్లాలో ఉంది. వీఆర్‌ పేట నాగులవలస పంచాయతీ, జి.సిగడాం మండలం, ఎచ్చెర్ల నియోజకవర్గం, శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌.. శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఒకే గ్రామంగా ఉన్న ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు, ఇద్దరు జడ్పీటీసీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ రాజాం, ఎచ్చెర్ల శాసనసభ స్థానాలు విజయనగరం లోక్‌సభ పరిధిలో ఉండడంతో ఒకరే ఎంపీగా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం..

తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి అభ్యర్థిగా కోండ్రు మురళీమోహన్‌ ఎన్నికల బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి తలే రాజేష్‌ పోటీ చేస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కూటమి బీజేపీ అభ్యర్థి ఎన్‌.ఈశ్వరారావు పోటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ పోటీలో ఉన్నారు. ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ తరఫున కలిశెట్టి అప్పలనాయుడు.. వైసీపీ నుంచి ప్రస్తుత ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

సమస్యలూ లేకపోలేదు..

వీఆర్‌ అగ్రహారం గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రం ఉండడంతో ఆ ప్రాంతానికి చెందిన రైతులు, విద్యార్థులు, మహిళలు అంతగా ఇబ్బందులు పడే పరిస్థితి లేదు. కానీ వీఆర్‌ పేటకు సంబంధించి ఏడు కిలోమీటర్ల దూరంలో జి.సిగడాం మండల కేంద్రం ఉంది. దీంతో వీఆర్‌ పేటకు సంబంధించి మండల పరిషత్‌, రెవెన్యూ, పొలీస్‌, ఎంఈవో తదితర కార్యాలయాలకు వెళ్లాలంటే అన్నివర్గాల ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. ప్రధానంగా విద్యార్థుల వెతలు అన్నీ ఇన్నీ కావు.

ఐకమత్యంతోనే..

చిన్నపాటి వివాదాలు, మనస్పర్థలు మినహాయిస్తే గ్రామాలు వేరైనా దశాబ్దాలుగా రెండు గ్రామాల ప్రజలంతా దాదాపుగా ఐకమత్యంతోనే ముందుకు సాగుతున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం రెండు గ్రామాల ప్రజలు కష్టసుఖాలలో కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు.

రాజకీయం నేపథ్యం...

1987లో మండల వ్యవస్థ ప్రారంభమైంది. అదే సమయంలో చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, వీఆర్‌ పేటకు చెందిన దివంగత జనపాల బాలకృష్ణ టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయ అరంగేట్రం చేశారు. దీంతో వీఆర్‌ పేటను జి.సిగడాం మండలంలో చేర్పించేలా గద్దే బాబూరావు కృషి చేశారు. ఫలితంగా వీఆర్‌ పేట.. జి.సిగడాం మండలంలో విలీనం కాగా వీఆర్‌ అగ్రహారం రాజాం మండలంలో ఉండిపోయింది. జి.సిగడాం మండలం చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గద్దే బాబూరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పట్లో జి.సిగడాం మండలం చీపురుపల్లి నియోజకవర్గంలో ఉండేది.

అభివృద్ధి అంతంత మాత్రమే..

గ్రామంలో అభివృద్ధి అంతంతమాత్రం గానే ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటు రాజాం, అటు ఎచ్చెర్ల నియోజక వర్గాలలో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. గడచిన అయిదేళ్లలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు తిలోదకాలిచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదనే చెప్పాలి. అయితే తాగునీటి సమస్య పరిష్కారంలో ఇద్దరు సర్పంచ్‌లు విజయం సాధించారని చెప్పాలి. అగ్రహారంలో ప్రాథమికోన్నత పాఠశాల ఉండగా... పేటలో ప్రాథమిక పాఠశాల ఉంది.

Updated Date - May 05 , 2024 | 12:02 AM