Share News

మావాడే.. ఏం చేయలేను!

ABN , Publish Date - May 04 , 2024 | 11:54 PM

విజయనగరంలో ప్రభుత్వ, ఖాళీ స్థలాలు కబ్జా కావడం సర్వసాధారణంగా మారింది. రాత్రికి రాత్రి చదును చేసి.. ఎప్పటినుంచో ఉన్నట్లు మాయలు చేసి.. స్థలాలు స్వాధీనం చేసుకుంటున్నారు. వారి వెనుక పెద్ద నేత ఉండడంతో ఈ దందాకు చెక్‌ పడడం లేదు.

మావాడే.. ఏం చేయలేను!
చదును చేసిన భూమి, (ఇన్‌సెట్‌లో) భూమి ధ్రువపత్రాలతో బాధితులు

మావాడే.. ఏం చేయలేను!

10 ఎకరాల స్థలంలో ఎమ్మెల్యే అనుచరుడి పాగా

తానేం చేయలేనంటున్న ముఖ్య ప్రజాప్రతినిధి

విజయనగరంలో ఎక్కడికక్కడే మాఫియా తిష్ట

వాటిపై సుదీర్ఘంగా పోరాడుతున్న బాధితులు

స్పందన వినతి చేసుకున్నా స్పందన ఏదీ?

(విజయనగరం రూరల్‌)

విజయనగరంలో ప్రభుత్వ, ఖాళీ స్థలాలు కబ్జా కావడం సర్వసాధారణంగా మారింది. రాత్రికి రాత్రి చదును చేసి.. ఎప్పటినుంచో ఉన్నట్లు మాయలు చేసి.. స్థలాలు స్వాధీనం చేసుకుంటున్నారు. వారి వెనుక పెద్ద నేత ఉండడంతో ఈ దందాకు చెక్‌ పడడం లేదు. మన్నార్‌ రాజగోపాలస్వామి ఆలయ సమీప భూములు కూడా ఆక్రమణకు గురయ్యాయి. దీనిపై ఏడెనిమిదేళ్లుగా బాధితులు పోరాడుతున్నారు. తాజాగా మరోసారి విలేకరులకు శనివారం గోడు వెళ్లబోసుకున్నారు. వాస్తవానికి ఈ ఆలయానికి వున్న 78 ఎకరాల 94 సెంట్లలో అప్పటి ప్రభుత్వం సర్వే నెంబరు 209లో సెంట్రల్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీకి పది ఎకరాలను అభివృద్ధి.. ఆదాయం కోసం కేటాయించింది. వాటిలో రోడ్లు, కాలువలు తదితర వాటిని ఏర్పాటు చేసి 200, 300, 400 గజాలు చొప్పున స్థలాల విభజించి విక్రయాలు జరిపింది. కొనుగోలు చేసుకున్నవారికి పక్కాగా రిజిస్ట్రేషన్లు కూడా చేసేశారు. ఇంత వరకూ బాగానే వున్నా 2017లో ఈ భూమిపై ప్రస్తుత ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడి కన్ను పడింది. ఎక్సవేటర్లతో స్థలాన్ని లెవల్‌ చేయించేశారు.. ఆయన వెనుక మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అప్పటి నుంచి బాధితులు పోరాడుతూనే ఉన్నారు. నేతలు, అధికారులకు గోడు వివరిస్తూనే వచ్చారు. కలెక్టర్‌ స్పందనలోనూ వినతిపత్రాలు ఇచ్చారు. తాజాగా శనివారం మరోసారి స్థలాల వద్దకు వచ్చిన బాధితులు తమకు జరుగుతున్న నష్టం గురించి విలేకరులకు వివరించారు. ఎమ్మెల్యేను కలిసినా చూద్దాం.. చేద్దాం అంటూ ఎటూ తేల్చడం లేదని వాపోయారు. కాగా వారి స్థలానికి అనుకుని పెద్ద గెడ్డ వుంది. ఈ గెడ్డను కూడా అక్రమణదారులు వదల్లేదు.. గెడ్డను కప్పేసి, ఆ గెడ్డలోంచి నీరు బయటకు వెళ్లేందుకు గొట్టాలు కూడా వేసేశారు.

మాకు న్యాయం చేయాలి

సెంట్రల్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ ద్వారా మేము స్థలాలను కొనుగోలు చేశాం. సర్వే రాళ్లు కూడా వేసుకున్నాం. 2017 వరకూ మా స్థలాలకు సంబంధించి హద్దురాళ్లు వున్నాయి. ఆ తర్వాత కొందరు వ్యక్తుల కన్ను స్థలంపై పడింది. ఎమ్మెల్యే అండతో వారు రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే వద్దకు వెళ్లి అడిగితే నిస్సహాయంగా సమాధానం చెప్పారు.

- ఎం.సూర్యప్రకాష్‌రావు, బాధితుడు

మాకు దిక్కేదీ

మా స్థలాలకు దిక్కే లేకుండా పోయింది. హద్దురాళ్లు తొలగించేశారు. మాకు రిజిస్ట్రేషన్‌ అయిన పేపర్లను ఎమ్మెల్యే కోలగట్లకు చూపించాం. అధికారులకు కూడా చూపించాం. అదిగో.. ఇదిగో అంటున్నారు తప్ప న్యాయం జరగలేదు. మా స్థలాలు మాకు అప్పగించాలి.. ఈ స్థల ఆక్రమణకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలి. 2017 నుంచి మేం ఇబ్బంది పడుతున్నాం.

- శంకరరావు, విశాఖపట్నం.

ఇదెక్కడి ఘోరం

నగరంలోని డబుల్‌ కాలనీలో సెంట్రల్‌ కో-ఆపరేటివ్‌ సోసైటీ ద్వారా 1983లో కొనుగోలు చేసిన స్థలాలను సంబంధిత వ్యక్తులకు అప్పగించాలని టీడీపీ నాయకులు కాళ్ల గౌరీశంకర్‌, వజ్రపు శ్రీనివాసరావులు డిమాండ్‌ చేశారు. శనివారం బాధితులతో కలిసి స్థలాన్ని, పైపులైన్లు వేసిన ప్రాంతాలను పరిశీలించారు. ఈసమస్యను అధికారులు పరిష్కరించాలని కోరారు.

- గౌరీశంకర్‌, శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు

Updated Date - May 04 , 2024 | 11:54 PM