Share News

కొండలు దిగి.. క్యూలో నిలబడి!

ABN , Publish Date - May 04 , 2024 | 11:56 PM

జిల్లాలో పింఛనుదారుల కష్టాలు మూడోరోజూ కూడా కొనసాగాయి. పింఛన్‌ సొమ్ము కోసం కొండలు దిగి వచ్చిన వారికి నానా అవస్థలు పడ్డారు. శనివారం బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. తాగునీరు అందుబాటులో లేక.. నీడ పట్టున కూర్చొనే అవకాశం లేక.. మండుటెండలో లబ్ధిదారులు విలవిల్లాడారు.

కొండలు దిగి.. క్యూలో నిలబడి!
సాలూరు రూరల్‌: ఉదయం ఎనిమిది గంటలకే మామిడిపల్లి బ్యాంక్‌ వద్ద వేచి ఉన్న పింఛన్‌దారులు

సర్కారు తీరుపై మండిపాటు

సాలూరు రూరల్‌, మే 4: జిల్లాలో పింఛనుదారుల కష్టాలు మూడోరోజూ కూడా కొనసాగాయి. పింఛన్‌ సొమ్ము కోసం కొండలు దిగి వచ్చిన వారికి నానా అవస్థలు పడ్డారు. శనివారం బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. తాగునీరు అందుబాటులో లేక.. నీడ పట్టున కూర్చొనే అవకాశం లేక.. మండుటెండలో లబ్ధిదారులు విలవిల్లాడారు. బ్యాంకుల్లో నగదు జమకాక.. ఏ ఖాతాలో పింఛన్‌ సొమ్ము పడిందో తెలియక.. అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా.. వైసీపీ ప్రభుత్వం బ్యాంకుల్లో నగదు జమ చేయడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. తమను ముప్పుతిప్పలు పెట్టడం తగునా? అంటూ ప్రశ్నిస్తున్నారు. సాలూరు మండలం గంజాయిభద్ర, కొదమ, సంపంగిపాడు, డెన్స్‌రాయి తదితర గిరిశిఖర గ్రామస్థులు ఉదయాన్నే కొండలు దిగి.. ఎనిమిది గంటలకే బ్యాంకుల వద్దకు చేరుకొని క్యూలో బారులుదీరారు. పింఛన్‌ డబ్బులు కోసం గంటల కొద్దీ నిరీక్షించారు. కాగా కొందరి ఖాతాల్లో నగదు జమకాలేదు. గ్రామ సచివాలయానికి వెళ్లాలని బ్యాంకు సిబ్బంది సూచించడంతో లబ్ధిదారులు ఉసూరుమన్నారు. కొండలు దిగి వచ్చినా ఫలితం లేకపో యిందంటూ ఆవేదన చెంది.. ఇళ్లకు వెనుదిరిగారు.

- మక్కువ: మండలంలో బ్యాంకుల వద్ద మూడోరోజు కూడా రద్దీ కనిపించింది. ఆధార్‌ సీడింగ్‌, ఈకేవైసీ చేసుకోవడానికి పింఛనుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాల నుంచి బ్యాంకులు, సీఎస్‌పీ సెంటర్లకు చేరుకోవడానికి పింఛన్‌దారులు వ్యయ ప్రయాసలు ఎదుర్కొన్నారు.

డబ్బులు పడలేదన్నారు

ఉదయం ఎనిమిది గంటలకే బ్యాంకుకు వెళ్లి వరుసలో నిల్చున్నాను. గంటల కొద్దీ లైన్‌లో ఉన్న ఫలితం లేకపోయింది. నా ఖాతాలో పింఛను డబ్బులు జమకాలేదని చెప్పారు. వార్డు సచివాలయానికి వెళ్లాలని బ్యాంకు అధికారులు చెప్పారు. గత నెలలా పింఛను పంపిణీ చేయడానికి ఉన్న ఏమిటి ఇబ్బందో అర్థం కావడం లేదు. పలుకుబడి ఉన్న వారికి మాత్రం ప్రస్తుతం ఇంటికి తెచ్చి పింఛన్‌ తెస్తున్నారు. ఇదేమి విధానమో తెలియడం లేదు.

- ఆదాడ పైడితల్లి, పింఛనుదారు, సాలూరు

Updated Date - May 04 , 2024 | 11:56 PM