Share News

మురుగు కూపాలుగా మార్చారు

ABN , Publish Date - May 04 , 2024 | 11:58 PM

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలోని నీటి వనరుల పరిస్థితి దయనీయంగా మారింది. ఐదేళ్ల పాలనా కాలంలో వాటిపై దృష్టి సారించకపోగా.. నిర్వహణకు నిధులు కూడా మంజూరు చేయలేదు. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు మురుగు కూపాలుగా మారాయి.

 మురుగు కూపాలుగా  మార్చారు
పాలకొండలో కిష్టప్ప కోనేరు ఇలా..

వాటి అభివృద్ధికి సక్రమంగా నిధులు కేటాయించని వైనం

నిర్వహణను గాలికొదిలేసిన వైనం

స్థానిక వనరులను కాపాడడంలో వైఫల్యం

తాగు, సాగునీటికి తప్పని ఇబ్బందులు

ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు

(పాలకొండ)

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలోని నీటి వనరుల పరిస్థితి దయనీయంగా మారింది. ఐదేళ్ల పాలనా కాలంలో వాటిపై దృష్టి సారించకపోగా.. నిర్వహణకు నిధులు కూడా మంజూరు చేయలేదు. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు మురుగు కూపాలుగా మారాయి. చెరువులను ఆధునికీకరించి తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్న ప్రజాప్రతినిధుల హామీలు కూడా గాలిలో కలిసిపోయాయి. మొత్తంగా వైసీపీ సర్కారు తీరుపై జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జిల్లాలో అధ్వానంగా మారిన పలు చెరువుల పరిస్థితిని ఇప్పుడు తెలుసుకుందాం..

ఇదీ పరిస్థితి..

- పార్వతీపురంలో ఉన్న నాలుగు ప్రధాన చెరువులు గతంలో వందలాది కుటుంబాలకు తాగునీటిని అందించేవి. అయితే కొన్నాళ్లుగా వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో ఆయా చెరువులు పేరుకే అన్నట్లుగా మారాయి. జగన్నాథపురంలోని పాత్రుడి కోనేరుకు ఎంతో చరిత్ర ఉన్నా.. దాని నిర్వహణను పూర్తిగా మరిచారు. కొత్తవలస దుర్గమ్మగుడి, బెలగాం, అగ్రహారంవీధి శివారు, వేణుగోపాల్‌ థియేటర్‌ ఎదురుగా చెరువులు నీరు రంగు మారి కలుషిత మయ్యాయి. దీంతో ఆ నీటిని ఎవరూ వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక దుర్గమ్మ కోవెల పక్కన ఉన్న కోనేరు అభివృద్ధికి రూ.94 లక్షలు మంజూరైనా ఫలితం లేకపోయింది. చెరువుగట్టును బాగు చేసి కంచె ఏర్పాటు చేశారు. కానీ కోనేరులో నీరు మాత్రం కలుషితమవడంతో వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది.

- సాలూరులో వడ్డాది కోనేరు కూడా నిర్వహణకు నోచుకోక పూర్తిగా పాడైంది. ప్రస్తుతం అది చెత్తాచెదారంతో నిండిపోయింది. గతంలో చాలా మంది ఈ కోనేరు నీటిని తమ అవసరాలకు వినియోగించేవారు. దీనిని బాగు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చినా.. వివిధ కారణాలతో కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఆ కోనేరులో ఆక్రమణలకు గురవుతోంది. ఇప్పటికే రాణిగారి కోనేరు పూర్తిగా ఆక్రమణకు గురైంది. పట్టణంలోని వడ్డాది కోనేరు అభివృద్ధికి అమృత్‌సర్‌ పథకం కింద రూ.50 లక్షలు మంజూరు చేశారు. అయితే పూర్తిస్థాయిలో కోనేరును బాగు చేయ లేదు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- పాలకొండలో వెంకటరాయుని కోనేరు, కిష్టప్ప కోనేరు, కల్యాణి కోనేరు, భగీరఽథ చెరువులు మురుగు కూపాలుగా మారాయి. గతంలో వెంకటరాయుని కోనేరులో బోటు షికారు ఏర్పాటు చేస్తామన్న పాలకులు, అధికారులు ప్రకటనలకే పరిమితమయ్యారు. ఈ కోనేరుపై చుట్టూ మొక్కలు నాటడం, కూర్చోవడానికి వీలుగా సిమెంట్‌ పలకలు ఏర్పాటు చేశారు. అయితే అవి కొద్దికాలానికే కనుమరుగైపోయాయి. దశాబ్దాలుగా తాగునీటిని ప్రజలకు అందించిన చెరువులు కూడా కనీస నిర్వహణకు నోచుకోకపోవడంతో వాటిల్లో నీరు పూర్తిగా కలుషితమైంది. దీంతో స్థానికులకు తాగు, సాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. కార్తీక మాసం, ఇతర పర్వదినాల్లో ప్రజలు ఆయా చెరువుల్లో స్నానాలు చేసుకొనేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండాపోయింది. మొత్తంగా వైసీపీ ఐదేళ్ల పాలనా కాలంలో స్థానికంగా ఉన్న నీటి వనరులపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించకపోవడంపై జిల్లావాసులు మండిపడుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

పాలకొండలోని కోనేరు, చెరువుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నీటి శుభ్రత కోసం ప్రత్యేక విధానాలను రూపకల్పన చేస్తున్నాం. చెరువులను బాగుచేసి వినియోగంలోకి తీసుకొస్తాం. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం.

- సర్వేశ్వరరావు, నగర పంచాయతీ కమిషనర్‌, పాలకొండ

Updated Date - May 04 , 2024 | 11:58 PM