Share News

మేమేం చేశాం పాపం..

ABN , Publish Date - May 04 , 2024 | 11:47 PM

మూలపేట పోర్టుకు సంబంధించి 16 నిర్వాసిత కుటుంబాలకు పీడీఎఫ్‌ అందలేదు. మరో 16 మందికి యూత్‌ప్యాకేజీ దక్కలేదు. గతేడాది ఏప్రిల్‌ 19న సీఎం జగన్‌ మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశారు.

మేమేం చేశాం పాపం..
మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్‌(ఫైల్‌)

- మూలపేట నిర్వాసితుల్లో కొందరికి అందని పీడీఎఫ్‌, యూత్‌ ప్యాకేజీలు

- నెరవేరని సీఎం జగన్‌ హామీ

(టెక్కలి)

సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రామానికి చెందిన దారపు తాతారెడ్డి అనే దివ్యాంగుడు ఉపాధి కోసం కొన్నాళ్ల పాటు వలస వెళ్లాడు. మూలపేటలో ఆ దివ్యాంగుడికి ఇల్లు, ఆస్తులు ఉన్నా పీడీఎఫ్‌ మాత్రం అందలేదు. పీడీఎఫ్‌ కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చివరికి నెలరోజులు కిందట ఆ దివ్యాంగుడు మృతి చెందాడు.

..................

మూలపేట పంచాయతీ విష్ణుచక్రం గ్రామానికి చెందిన గిన్ని రామారావు అనే వ్యక్తి వలస వెళ్లడంతో పీడీఎఫ్‌ ఇప్పటికీ అందలేదు.

................

మూలపేట గ్రామానికి చెందిన జీరు హైమ భర్త ఎర్రయ్య కుటుంబం ఉపాధి కోసం కొన్నాళ్ల పాటు విశాఖపట్నం వలస వెళ్లింది. ఆ కుటుంబానికి పీడీఎఫ్‌, కుమారులకు యూత్‌ప్యాకేజీ సైతం అందలేదు.

......

..ఇలా మూలపేట పోర్టుకు సంబంధించి 16 నిర్వాసిత కుటుంబాలకు పీడీఎఫ్‌ అందలేదు. మరో 16 మందికి యూత్‌ప్యాకేజీ దక్కలేదు. గతేడాది ఏప్రిల్‌ 19న సీఎం జగన్‌ మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశారు. నిర్వాసితులందరికీ పీడీఎఫ్‌, యూత్‌ప్యాకేజీలు అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకూ చాలామందికి పీడీఎఫ్‌, యూత్‌ప్యాకేజీ అందలేదు. సీఎం హామీ ఇచ్చినా తమకు ఎటువంటి పరిహారం దక్కడం లేదని ఆయా నిర్వాసితులంతా ఆవేదన చెందుతున్నారు. కొన్నాళ్ల కిందట పోర్టు అభివృద్ధి పనుల పరిశీలన పేరిట వైసీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మత్స్యశాఖమంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పెద్దలు వచ్చారు. ఆ సమయంలో నిర్వాసితులు తమ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లి అర్జీలు అందజేసినా ఇంతవరకూ పరిష్కారం చూపలేదు. సబ్‌కలెక్టరేట్‌తో పాటు అధికారపార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

Updated Date - May 04 , 2024 | 11:47 PM