Share News

ఇది ‘అధికార’ దోపిడీ!

ABN , Publish Date - May 04 , 2024 | 11:49 PM

ఇసుకాసురులు సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. నదుల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించి యంత్రాలు ఉపయోగించరాదని, ఇసుక రవాణా చేయకూడదని సుప్రీంకోర్టు ఇటీవల ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది. అయినప్పటికీ తాము తగ్గేది లేదంటూ ఇసుక తవ్వకాలకు అనుమతి పొందిన ఏజెన్సీ నిర్వాహకులు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఇది ‘అధికార’ దోపిడీ!
ఎచ్చెర్ల మండలం పొన్నాడ వద్ద నాగావళి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు

- వంశధార, నాగావళిలో అడ్డుగోలుగా తవ్వకాలు

- సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా పట్టని వైనం

- యంత్రాలతో తవ్వి.. టిప్పర్లతో తరలించి..

- జిల్లా నుంచి విశాఖపట్నానికి సరఫరా

- దండుకుంటున్న అధికారపార్టీ నాయకులు

- నిలువరించలేకపోతున్న అధికారులు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్న వేళ కొందరు అధికారపార్టీ నేతల దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. యంత్రాంగం విధుల్లో నిమగ్నమై ఉండగా.. విపక్షాల నాయకులు ప్రచారంలో బిజీగా ఉండగా.. వీరు మాత్రం తమపని కానిచేస్తున్నారు. వంశధార, నాగావళి నదలను కొల్లగొడుతున్నారు. యంత్రాలతో ఇసుకను తవ్వి టిప్పర్లలో విశాఖకు తరలిస్తున్నారు. బిల్లుపై ఉన్న ధరకన్నా అధికంగా అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేస్తున్నారు.

.......................

ఇసుకాసురులు సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. నదుల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించి యంత్రాలు ఉపయోగించరాదని, ఇసుక రవాణా చేయకూడదని సుప్రీంకోర్టు ఇటీవల ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది. అయినప్పటికీ తాము తగ్గేది లేదంటూ ఇసుక తవ్వకాలకు అనుమతి పొందిన ఏజెన్సీ నిర్వాహకులు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇసుక రీచ్‌ల నిర్వహణ.. తవ్వకాలకు ‘ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌’ సంస్థకు అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ ఇచ్చిన రశీదులతో నాగావళి, వంశధార నదుల నుంచి విశాఖకు దర్జాగా ఇసుక తరలిపోతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. అధికారపార్టీ నేతల అండతో అక్రమ రవాణా సాగిపోతోంది. ఏజెన్సీలకు అధికార పార్టీ నేతలకు ఇసుక కల్పతరువుగా మారిపోయింది.

- అనుమతి ఒకచోట.. తవ్వకాలు మరోచోట....

కొత్తూరు మండలం నవగాం వద్ద వంశధార నదిలో ఇసుక తవ్వకాలకు.. తరలింపునకు ఏజెన్సీకి అనుమతి లభించింది. ప్రస్తుతం కొత్తూరు మండలం అంగూరులో వంశధార నదిలో ఇష్టానుసారంగా ఎక్స్‌క్లవేటర్లతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఆ ఇసుకను తారాస్‌ లారీలతో విశాఖకు తరలించేస్తున్నారు. కాగా.. బిల్లులో మాత్రం నవగాం నుంచి తరలిస్తున్నట్టు చూపుతున్నారు. అలాగే బిల్లుపై ఉన్న ధర కన్నా.. అదనంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- వంశధార, నాగావళిని తోడేస్తున్నారు...

నరసన్నపేట మండలం మడపాం వద్ద వంశధార నదిలో కూడా ఎక్స్‌కవేటర్లతో ఇసుక తవ్వేస్తున్నారు. హైవేకు ఆనుకుని ఉన్న ఈ నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా.. అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు.

- ఎచ్చెర్ల మండలం పొన్నాడ వద్ద నాగావళి నదిలోనూ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వుతూ నేరుగా విశాఖకు తరలిస్తున్నారు. శ్రీకాకుళం రూరల్‌, గార, ఆమదాలవలస మండలాల్లో కూడా వంశధార, నాగావళి నదుల్లో ఇసుకను తోడేస్తున్నారు. ఎక్కడా ఇసుక తవ్వకాలను నిలుపుదల చేయలేదు.

- జలుమూరు మండలం డొంపాక వద్ద వంశధార నదిలో ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. వందలాది లారీలు, ట్రాక్టర్లతో తరలించేస్తున్నారు. కొత్త, పాత తేదీలతో రశీదులు ఇచ్చి.. దోపిడీకి పాల్పడుతున్నారు. ఎన్నికల వేళ అటు అధికారులు విధుల్లో బిజీగా ఉన్నారు. ఇటు ప్రతిపక్ష నాయకులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇదే అదుపుగా అధికారపార్టీ నాయకుల అనుచరులు ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ దృష్టి సారించి.. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలయ్యేలా నదుల్లో ఇసుక తవ్వకాలు నిలుపుదలకు చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - May 04 , 2024 | 11:49 PM