Share News

వారమన్నారు.. ఐదేళ్లయినా లేదు!

ABN , Publish Date - May 03 , 2024 | 11:49 PM

వైసీపీ పాలనలో సామాన్య ప్రజలే కాదు.. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా మోసం తప్పలేదు. ఈ ఐదేళ్లలో ఉద్యోగులు దారుణ వంచనకు గురయ్యారు. గత ఎన్నికలకు ముందు.. తాము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ హామీని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలంతా నమ్మి.. గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు తమవంతు కృషి చేశాయి. కాగా.. ఇప్పటివరకూ సీపీఎస్‌ రద్దు చేయకపోవడంతో గుర్రుగా ఉన్నాయి.

వారమన్నారు.. ఐదేళ్లయినా లేదు!
సీపీఎస్‌ రద్దు కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయుల ధర్నా (ఫైల్‌)

- అటకెక్కిన సీపీఎస్‌ రద్దు హామీ

- మాటతప్పిన సీఎం వైఎస్‌ జగన్‌

- ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మోసం

(కాశీబుగ్గ)

ఉద్యోగికి ఎంత మేలు చేయాలో అంత చేసేయాలి. వారి కళ్లల్లో ఆనందం నింపాలి. అప్పుడే వారు ప్రజలకు మెరుగైన సేవలందించగలరు. చంద్రబాబు ఉద్యోగులను దారుణంగా వంచించారు. సీపీఎస్‌ రద్దు విషయంలో కమిటీలతో కాలయాపన చేశారు. మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో.. సీపీఎస్‌ను రద్దుచేస్తాం.

- 2019లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతిపక్ష నేతగా జగన్‌ ఇచ్చిన హామీ ఇది

........................

సీపీఎస్‌ రద్దు సాంకేతిక అంశం. అందులో చాలా సమస్యలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోకుండా సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని అమలుచేస్తే... చెల్లింపులకు రాష్ట్ర బడ్జెట్‌ కూడా సరిపోదు.

- 2021 డిసెంబరు 15న ఉద్యోగ సంఘాల నేతలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలివీ

................................

వైసీపీ పాలనలో సామాన్య ప్రజలే కాదు.. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా మోసం తప్పలేదు. ఈ ఐదేళ్లలో ఉద్యోగులు దారుణ వంచనకు గురయ్యారు. గత ఎన్నికలకు ముందు.. తాము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ హామీని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలంతా నమ్మి.. గత ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు తమవంతు కృషి చేశాయి. కాగా.. ఇప్పటివరకూ సీపీఎస్‌ రద్దు చేయకపోవడంతో గుర్రుగా ఉన్నాయి. ‘ఇంకా వారం కాలేదా’? అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సీఎం జగన్‌ తీరుపై మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశాయి. సీపీఎస్‌ రద్దు చేసి.. పాత పింఛన్‌ విధానాన్ని(ఓపీఎస్‌) అమలు చేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు 2021 డిసెంబరులో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో ‘క్షమించండి’ అంటూ తన మాటగా సీఎం జగన్‌ ప్రకటించారు. అది సాంకేతిక అంశమని తెలియక మాటిచ్చామని చెప్పుకొచ్చారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలంతా నిరాశ చెందుతున్నాయి.

ఇదీ పరిస్థితి

జిల్లావ్యాప్తంగా 25,732 మంది ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఉన్నారు. సచివాలయ ఉద్యోగులు 5,240 మంది, విద్యాశాఖలో 4,396 మంది, వైద్య ఆరోగ్య శాఖలో 2,256 మంది, పోలీస్‌ శాఖలో 836 మంది, రెవెన్యూలో 610 మంది ఉన్నారు. అలాగే పురపాలక శాఖలో 712మంది, పంచాయతీరాజ్‌ శాఖలో 472 మంది, ఖజానా శాఖలో 71మంది, రిజిస్ర్టేషన్‌ శాఖలో 69 మంది ఉన్నారు. ఇలా, ఆర్టీసీతోపాటు ఇతర శాఖల్లో వందలాది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2004 తరువాత కొలువులు పొందిన ప్రతీ ఉద్యోగిని సీపీఎస్‌ పరిధిలో చేర్చారు. జిల్లాలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల్లో 60శాతానికిపైగా సీపీఎస్‌లో ఉన్నవారే. వీరికి అంతకు ముందు ఉద్యోగులకు వచ్చిన పదవీ విరమణ బెనిఫిట్స్‌ రావు. సీపీఎస్‌ విధానానికి లోబడి మాత్రమే పింఛన్‌ ఇస్తారు. ఉద్యోగుల మూల వేతనంతో సంబంధం లేకుండా వారు ఏళ్ల తరబడి పొదుపు చేసుకున్న నగదును పెట్టుబడిగా ఉంచుతారు. అందులో 60శాతం పదవీ విరమణ ప్రయోజనాలుగా, 40శాతం స్టాక్‌మార్కెట్‌ తరహాలో ప్రభుత్వం పొదుపు చేస్తుంది. ఇందులోనే లెక్క కట్టి పింఛన్‌ అందిస్తారు. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో గ్యారెంటీ పెన్సన్‌ స్కీంను తెరపైకి తెచ్చారు. పదవీ విరమణ సమయంలో దాచుకున్న మొత్తంలో 60 శాతాన్ని అందిస్తారు. మిగిలిన 40 శాతాన్ని లెక్కకట్టి పింఛన్‌గా అందించనున్నారు. అయితే ఇది కూడా సీపీఎస్‌కు దగ్గరగా ఉండడంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు సరికదా.. ఉన్న రాయితీలు సైతం నిలిపేసింది. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘1982లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పెన్షన్‌.. ఉద్యోగుల హక్కు. ఇది పాలకుల భిక్ష కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. సీపీఎస్‌, జీపీఎస్‌ విధానాల ద్వారా ఉద్యోగుల సామాజిక భద్రతపై వేటు వేయడం సరికాదు. సీపీఎస్‌.. ఉద్యోగుల పాలిట శాపం. సీపీఎస్‌ స్థానంలో తీసుకువచ్చిన జీపీఎస్‌ కూడా అంకెలగారడీ తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. పాత పెన్షన్‌ విధానాన్ని(ఓపీఎస్‌) పునరుద్ధరించే వరకూ పోరాటం కొనసాగిస్తామని’ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నారు. హామీని నెరవేర్చని వైసీపీకి.. ఈ సారి ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు.

................................

దారుణం

ఐదేళ్లుగా సీపీఎస్‌ రద్దు కోసం ఎదురుచూశాం. గత ఎన్నికల్లో సీఎం జగన్‌ ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ఒక్క క్షమాపణతో మా ఆశలను తుడిచేశారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?

- గుంట కోదండరావు, యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌

................................

ఐదేళ్లుగా ఉక్కుపాదం

ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎంతో మేలు చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీలను సైతం రద్దుచేశారు. ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు.

- ఎస్‌వీ రమణ, యూటీఎఫ్‌, పలాస శాఖ

Updated Date - May 03 , 2024 | 11:49 PM