Share News

గందరగోళంగా.. పోస్టల్‌ బ్యాలెట్‌

ABN , Publish Date - May 04 , 2024 | 11:46 PM

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. కొన్నిచోట్ల గందరగోళ పరిస్థితులు తలెత్తగా.. మరికొన్నిచోట్ల ప్రశాంతంగా సాగింది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోనూ పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించారు.

గందరగోళంగా.. పోస్టల్‌ బ్యాలెట్‌
శ్రీకాకుళంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

- నరసన్నపేటలో ఆలస్యంగా ప్రారంభం...

- కేంద్రాల్లో రాజకీయ నేతల హల్‌చల్‌

నరసన్నపేట/కలెక్టరేట్‌, మే 4: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. కొన్నిచోట్ల గందరగోళ పరిస్థితులు తలెత్తగా.. మరికొన్నిచోట్ల ప్రశాంతంగా సాగింది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోనూ పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల విధుల్లో ఉద్యోగులు తమకు కేటాయించిన కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పోలింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా పరిశీలించారు. పాతపట్నంలో పోలింగ్‌ కేంద్రాన్ని కూడా సందర్శించారు. పకడ్బందీగా బ్యాలెట్‌ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. ఆది, సోమ, మంగళవారాల్లో కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ కొనసాగనుందని, ఉద్యోగులు శతశాతం పాల్గొని ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. కాగా.. నరసన్నపేటలో పోస్టల్‌బ్యాలెట్‌ పోలింగ్‌ నిర్వహించే సిబ్బంది మధ్య సమన్వయలోపం.. కేంద్రాల వద్ద అధికారుల పర్యవేక్షణ లోపంతో గందరగోళ పరిస్థితులకు కారణమైంది. సరైన ఏర్పాట్లు లేక ఉద్యోగుల్లో అసహనం నెలకొంది. నరసన్నపేటలోని జూనియర్‌ కళాశాలలో.. ఉదయం 7గంటల నుంచే పోస్టల్‌బ్యాలెట్‌ ప్రారంభమవుతుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. కానీ 9 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. దీంతో ఉద్యోగులు నిరీక్షించి.. అసహనం వ్యక్తం చేశారు. అయితే నరసన్నపేట మండలానికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రంలోకి ఉద్యోగులతో పాటు.. వివిధ రాజకీయ పార్టీ నాయకులు వెళ్లారు. సిబ్బందికి అవగాహన లేక అందరినీ ఒకేసారి పోలింగ్‌ కేంద్రంలోకి పంపించడంతో ఉద్యోగులు ఓటు వేసేందుకు నానా ఇబ్బంది పడ్డారు. రహస్యంగా కాకుండా బహిరంగంగా ఓటు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు గగ్గోలు చెందారు. దీనిపై పోలింగ్‌ సిబ్బందిని నిలదీశారు. అక్కడ విధులు నిర్వహించే పీవో కూడా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఆర్వో జీవీ రామ్మోహన్‌రావు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఓటువేసిన కవర్లను వేసేందుకు ఏర్పాటు చేసిన డ్రమ్ములపై పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు చెందినట్లు కనీకనిపించని చిన్న అక్షరాలతో రాశారు. దీంతో కొందరు ఉద్యోగులు గందరగోళానికి గురయ్యారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద రాజకీయపార్టీ నాయకులు హాల్‌చల్‌ చేశారు. పోలింగ్‌ ఏజెంట్లు పేరుతో కేంద్రాలో కూర్చొని ఉద్యోగులను ప్రభావితం చేసేందుకు కొందరు ప్రయత్నించారు. కేంద్రాల వద్ద నరసన్నపేట సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ ఆశోక్‌బాబు బందోబస్తు నిర్వహించారు. ఉమ్మడిపార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి, వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. కాగా.. నరసన్నపేటలో పోలింగ్‌పై వచ్చిన కథనాలు వాస్తవం కాదని, సాఫీగా ఈ ప్రక్రియ జరిగిందని ఆర్వో రామ్మోహన్‌ తెలిపారు.

దురుసుగా వ్యవహరించిన కానిస్టేబుల్‌

టెక్కలి : టెక్కలిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నిర్వహించిన పోస్టల్‌బ్యాలెట్‌ ప్రక్రియ వద్ద కానిస్టేబుల్‌ డి.గోపాలం దురుసుగా వ్యవహరించారు. ఓటింగ్‌ వద్ద ఫ్యాన్‌ లేక ఉక్కపోతకు గురైన కాంగ్రెస్‌ అభ్యర్థి కిల్లి కృపారాణి బయటకు వచ్చి కుర్చీపై కూర్చోగా.. ఆమెపై కానిస్టేబుల్‌ చిర్రుబుర్రులాడారు. ఇక్కడ కూర్చోవద్దు.. లోపలకు వెళ్లండి అంటూ గర్జించడంతో తానేమి చేశానని కానిస్టేబుల్‌ను ఆమె ప్రశ్నించారు. లోపలకు వెళ్తావా? లేదా? అంటూ దురుసుగా మాట్లాడారు. టీడీపీ అభ్యర్థి తరపున జనరల్‌ ఏజెంట్‌గా వచ్చిన కింజరాపు ప్రసాద్‌తో పాటు వైసీపీ ఏజెంట్లపైనా కూడా కానిస్టేబుల్‌ ఇదే రీతిలో వ్యవహరించాడు. దీంతో పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తానని కిల్లి కృపారాణి తెలిపారు.

వాట్సాప్‌ స్టేటస్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

మెళియాపుట్టి/ కొత్తూరు : పాతపట్నం ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌ వద్ద వైసీపీ నేతలు అత్యుత్సాహం చూపారు. ఉద్యోగులు ఎవరికి ఓటు వేశారో తెలిపేలా.. నియోజకవర్గానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు తన వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టడం చర్చనీయాంశమైది. ఓ ఉద్యోగి వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి ఓటు వేసి.. దాన్ని ఫొటో తీసి కొత్తూరు మండలానికి చెందిన వైసీపీ నాయకుడికి ఫోన్‌ ద్వారా పంపాడు. ఆ నాయకుడు దానిని తన వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టి.. ఇతర ఉద్యోగులను కూడా ప్రభావితం చేసేలా ప్రచారం చేశాడు. ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. పోలింగ్‌ వద్ద సెల్‌ఫోన్‌ వినియోగించరాదని నిబంధన ఉన్నా.. కొంతమంది బరితెగించి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నా.. అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - May 04 , 2024 | 11:46 PM