Share News

డబ్బుతో ఎర.. ఉద్యోగి ససేమిరా!

ABN , Publish Date - May 05 , 2024 | 12:22 AM

వైసీపీ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్న వ్యతిరేకత ఆరంభంలోనే బయటపడింది. వారి ఓట్ల కోసం సామ, దాన,భేద దండోపా యాలు ఉపయో గించిన వైసీపీ చివరికి డబ్బుతో కొనుగోలుకు విఫలయత్నం చేసింది.

డబ్బుతో ఎర.. ఉద్యోగి ససేమిరా!
చీమకుర్తిలో ఓటు వేసేందుకు బారులు తీరిన పీవోలు, ఏపీవోలు

ఆరంభంలోనే వైసీపీకి చేదు అనుభవం

ఓటు రూ.3వేల నుంచి 5వేలతో కొనుగోలుకు ప్రయత్నం

ప్రలోభాలకు లొంగబోమని తేల్చిచెప్పిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

వైసీపీ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్న వ్యతిరేకత ఆరంభంలోనే బయటపడింది. వారి ఓట్ల కోసం సామ, దాన,భేద దండోపా యాలు ఉపయో గించిన వైసీపీ చివరికి డబ్బుతో కొనుగోలుకు విఫలయత్నం చేసింది. అయినా అధికశాతం ఉద్యోగులు ప్రలోభాలకు తాము లొంగమని పలుచోట్ల బహిరంగంగా వ్యాఖ్యానించడం కనిపించింది. గతం కన్నా ఈ పర్యాయం ఒక్కో బ్యాలెట్‌ ఓటుకు రూ.3వేల నుంచి రూ.5వేలు వరకు ఆయా ప్రాంతాలను బట్టి కొనుగోళ్లకు ప్రయత్నించారు. అయితే గతం కన్నా భిన్నంగా ఎక్కువశాతం మంది ఉద్యోగులు వైసీపీ నేతలు ఇచ్చే డబ్బులను తిరస్కరించారు. మొత్తంగా జిల్లాలో శనివారం ప్రారంభమైన ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల పోలింగ్‌ సందర్భంగా ఉద్యోగ వర్గాలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగంగానే కనిపించింది.

పోలింగ్‌ విధానం మార్పుతో..

గత పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని మార్చి ఉద్యోగులు నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి అక్కడే ఓటు వేసి వెళ్లాలని ఈ పర్యాయం ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. గతంలో ఉద్యోగులు ఇంటి వద్ద ఓటువేసి దాన్ని సంబంధిత అధికారులకు నేరుగా కానీ, పోస్టల్‌లో కానీ ఇతరత్రా ద్వారా కానీ పంపించే అవకాశం ఉండేది. ఈ పర్యాయం కేటాయించిన పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లి బ్యాలెట్‌ పేపరు తీసుకుని అక్కడే ఓటు వేసి బాక్సులో వేయాల్సి ఉంది. దీంతో శనివారం నుంచి నాలుగురోజులపాటు ముందుగా ఓటు వేసుకోవాలనుకున్న ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పించారు.

ఒంగోలులోనే అత్యధికం

విభజిత అనంతర జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగిం చుకునేందుకు 24,631 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అత్యధికంగా ఒంగోలు అసెంబ్లీలో 5,884 మంది, గిద్దలూరులో 3,772 మంది, కనిగిరిలో 3,003 మంది, మార్కాపురంలో 3,100 మంది ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ 2వేలకుపైబడి ఈ ఉద్యోగులు ఉన్నారు. ఆయా కేంద్రాలలో శనివారం వారికి ఓటు వేసుకునే అవకాశం కల్పించటంతో వారి ఓట్ల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను గుర్తించి కాబోలు వైసీపీ తరపున ప్రలోభాలపర్వం భారీగా పెంచారు. ఒంగోలు, దర్శిలాంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్కరికి రూ.5వేల ప్రకారం ఇచ్చేందుకు వైసీపీ మద్దతుదారులు ప్రయత్నించారు. మిగిలినచోట్ల 3వేల ప్రకారం పంపిణీ చేసే ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ నాయకులు ఆశించిన రీతిలో ఉద్యోగులు ముందుకొచ్చి డబ్బులు తీసుకోలేదు. ఒంగోలులో వైసీపీకి మద్దతుగా ప్రతి ఎన్నికల్లో రమారమి 150 మంది ఉద్యోగుల బ్యాలెట్‌ పత్రాలను సేకరించే ఒకరు ఈసారి విశ్వప్రయత్నం చేసినా 15మందే వైసీపీ తరఫు నుంచి డబ్బులు తీసుకునేందుకు సిద్ధపడినట్లు సమాచారం. దాదా పు అన్నిచోట్ల ఇదే పరిస్థితి కనిపించింది. మార్కా పురంలోనూ ఒక పోలింగ్‌ కేంద్రానికి ఆమడదూరంలో డబ్బు పంపిణీకి ప్రయత్నించిన కొందరికి చేదు అనుభవం ఎదురైంది. అక్కడ పరిస్థితిని గమనిస్తే 60శాతం మంది మేము డబ్బులు తీసుకోం, ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిం చుకున్నామంటూ బహిరంగంగానే చెప్పటం విశేషం.

ఆ డబ్బు అనాథ శరణాలయానికి ఇస్తా

గిద్దలూరులో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద ఒక ఉద్యోగి ‘మా మనోభావాలను ఈ ప్రభుత్వం దెబ్బతీసింది. డబ్బుకన్నా ఆత్మగౌరవం ముఖ్యం.’ అని భావోద్వేగంతో వ్యాఖ్యానించడం గమనార్హం. దర్శిలో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద డబ్బు తీసు కున్న ఒక ఉద్యోగిని ‘డబ్బు సరే, ఓటు ఎవరికి వేస్తున్నారు’ అని ప్రశ్నించగా ‘అది మా ఇష్టం.. పాలనా తీరుకు అనుగుణంగా ఎవరికి ఓటు వేయాలనేది నిర్ణయించుకుం టాం. డబ్బు తీసుకోవటం తప్పే ఈ పర్యాయం ఈ డబ్బును ఓ అనాథ శరణాలయానికి పంపిస్తా’ అని బహిరంగంగానే చెప్పారు. మొత్తం పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తే గత ఎన్ని కల సమయంలో వలే ఉద్యోగులు డబ్బులు తీసుకునేందుకు ఆరాటపడిన దాఖలాలు కనిపించలేదు. ప్రత్యేకించి వైసీపీ నుంచి డబ్బులు తీసుకునేందుకు వెనుకడుగు వేశారు. తొలి రోజు ఎదురైన ఈ అనుభవంతో రానున్న నాలుగురోజుల్లో ఉద్యోగుల ఓట్లకోసం ఎలాంటి అధికారపార్టీ అభ్యర్థులు ఎన్ని కుయుక్తులు పన్నుతారో వేచిచూడాల్సి ఉంది.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రారంభం

జిల్లావ్యాప్తంగా శనివారం నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఎన్నికల విధులకు నియమితులైన పీవోలు, ఏపీవోలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ నిర్వహించారు. ఆది, సోమవారాల్లో ఇతర పోలింగ్‌ అధికారులు (ఓపీవోలకు) ఓటింగ్‌ జరుగుతుంది. మరోవైపు 80 ఏళ్లపైబడిన వృద్ధులు, 40శాతానికిపైన వైకల్యం ఉన్న దివ్యాంగులకు హోం ఓటింగ్‌ కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కోసం సంతనూతలపాడుకు సంబంధించిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌ (పోలింగ్‌ కేంద్రం)ను చీమకుర్తిలో, మిగిలిన ఏడు అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో ఏర్పాటు చేశారు.

ఆలస్యంగా ప్రారంభమైన ఓటింగ్‌

జిల్లావ్యాప్తంగా శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్‌ ప్రక్రియ కొన్ని ప్రాంతాల్లో 9గంటలకు మొదలైంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో 10 గంటల తర్వాత ప్రారంభమైంది. ఓటింగ్‌కు అవసరమైన బ్యాలెట్‌ పత్రాల పంపిణీలో జాప్యం కారణంగా ఈపరిస్థితి ఏర్పడింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో నగరంలోని డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌లో జరుగుతున్న బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ పరిశీలిం చారు. అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవ డాన్ని గుర్తించిన ఆయన సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఒంగోలు ఆర్వో సుబ్బారెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ జశ్వంత్‌రావు తదితరులు ఉన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:22 AM