Share News

హోరెత్తిన ప్రజాగళం

ABN , Publish Date - May 05 , 2024 | 01:02 AM

ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శిలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న ప్రజాగళం ప్రచార సభ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. నియోజకవర్గం నలుమూలల నుంచి శ్రేణులు వేలాది మంది ఉత్సాహంగా తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికసంఖ్యలో స్వచ్ఛందంగా సభకు హాజరయ్యారు.

హోరెత్తిన ప్రజాగళం
చీమకుర్తి సభకు హాజరైన అశేష జనవాహిని (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న చంద్రబాబబు

దర్శిలో బాబు సభ సూపర్‌ సక్సెస్‌

వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు

మండుటెండలోనూ కిక్కిరిసిన పట్టణ వీధులు

ఉత్సాహంతో కేరింతలు కొట్టిన యువత

దర్శిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా

రాలిపోతున్న నవరత్నాలు

జగన్‌కు ఓటు అడిగే హక్కు లేదు

టీడీపీ అధినేత చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శిలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న ప్రజాగళం ప్రచార సభ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. నియోజకవర్గం నలుమూలల నుంచి శ్రేణులు వేలాది మంది ఉత్సాహంగా తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికసంఖ్యలో స్వచ్ఛందంగా సభకు హాజరయ్యారు. దీంతో కేడర్‌లో ఉత్సాహం ఉప్పొంగింది. అధినేత చంద్రబాబు ప్రసంగాన్ని ఆసక్తిగా వినడంతోపాటు విక్టరీ చూపుతూ కేరింతలు కొట్టారు. ఆయన వైసీపీ పాలకులను విమర్శించినప్పుడు, సీఎం జగన్‌ అవినీతి అక్రమాల గురించి ప్రస్తావించినప్పుడు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. బాబు ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ అవునా? కాదా? అంటూ ప్రజల నుంచే సమాధానాలు రాబట్టారు. టీడీపీ సభ విజయవంతం కావడంతో ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించడం ఖాయమని శ్రేణులు భావిస్తున్నాయి.

దర్శి, మే 4 : దర్శి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభి వృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. దర్శిలో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నిలిచిపోయిన ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ శిక్షణ పరిశోధన కేంద్రం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. దొనకొండలో పరిశ్ర మలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా మన్నారు. జాబు రావాలంటే బాబు రావాలి.. గంజాయి వద్దు జాబు ముద్దు అని ప్రజల చేతనే చెప్పించారు. గోదావరి నీళ్లను నాగార్జునసాగర్‌లో కలిపి సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. తాళ్లూరులో మొగిలిగుండాల రిజర్వాయర్‌ టీడీపీ హయాంలో శంకుస్థాపన చేసినప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రిజర్వాయర్‌ నిర్మాణం చేస్తామన్నారు. నడికు డి-శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేసి హైదరాబాద్‌, తిరుపతి పట్టణాలకు దర్శి ప్రాంత ప్రజలు సులభంగా వెళ్లేలా రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. ముసి నదిపై పెదఉయ్యాలవాడ వద్ద బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. చందవరం వద్ద ఓవర్‌ బ్రిడ్జికి అప్రోచ్‌రోడ్డు లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే అప్రోచ్‌రోడ్డు వేస్తామన్నారు. దర్శికి మహర్దశ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

కూటమి అభ్యర్థులను గెలిపించండి

ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మిని అత్యధిక మెజా రిటీతో గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఒంగోలుకు మంచి ఎంపీ, బ్రాండ్‌ అంబాసిడర్‌, అజాతశత్రువు, నిజాయి తీకి మారుపేరైన మాగుంట శ్రీనివాసరెడ్డి కావాలా, ఎర్రచంద నం స్మగ్లర్‌ వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కావా లా అని ప్రశ్నించారు. సుదీర్ఘ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి వైద్య వృత్తిలోనే కాక ప్రజా జీవితంలో కూడా హీరోగా సేవలందిస్తారని చెప్పారు. గొట్టి పాటి లక్ష్మి తండ్రి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేశారని, ఆమె బాబాయి గొట్టిపాటి రవి సమర్ధవంత నాయకుడిగా కొనసాగు తున్నారని చెప్పారు. ఎన్నికల క్యాంపెయిన్‌లో ఉండి కూడా గర్భిణి పురిటినొప్పులతో ఉన్న సమాచారం తెలియడంతో ఆప రేషన్‌ చేసి తల్లీబిడ్డను కాపాడిన గొట్టిపాటి లక్ష్మి సమర్ధవం తమైన డాక్టరే కాక ప్రజా నాయకురాలని ప్రశంసించారు.

తెలుగు జాతిని నెంబర్‌-1గా ఉంచాలన్నదే మా సంకల్పం

జనసేనాని పవన్‌కల్యాణ్‌ ఒక పవర్‌స్టార్‌, ప్రజా జీవితంలో నిజమైన హీరో అని చంద్రబాబు అన్నారు. ఎట్టి పరిస్ధితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా సైకోను ఇంటికి పంపాలనేది లక్ష్యంగా ఆయన కృషిచేస్తున్నారని ప్రశంసించారు. దేశాన్ని 2047కు నెంబర్‌-1గా చేయా లనే లక్ష్యంతో ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారన్నారు. తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్‌-1 గా ఉంచాలనేదే మాసంకల్పమన్నారు. ‘ఐదేళ్లు జగన్‌ పరదాలు కట్టుకొని తిరిగారు.. చెట్లు నరికాడు.. ఎన్నికల ముందు ప్రజల దగ్గరకు వచ్చి మళ్లీ తలపై చేయి వేసి, బుగ్గలు నిమిరి మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు ఆ మోసాల మాయలో పడొద్దు’ అని బాబు సూచించారు. రాష్ర్టాభివృద్ధి జరగాలంటే కూటమిని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

సూపర్‌ సిక్స్‌తో అద్భుతమైన మేనిఫెస్టో తెచ్చాం

సూపర్‌ సిక్స్‌ పథకాలతోపాటు అద్భుతమైన మేనిఫెస్టోను తెచ్చామని చంద్రబాబు చెప్పారు. కేంద్రంలో మోదీ గ్యారెంటీతోపాటు కూటమి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందన్నారు. వృద్ధులకు పింఛన్‌ రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచింది ఎవరనే విషయాన్ని ప్రజలకు వివరించి సైకోకు గూబ తగిలేటట్టు సమాధానం చెప్పాలని కోరారు. ప్రజలకు సేవ చేయాల్సిన వలంటీర్లను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృద్ధులకు పింఛన్‌ రూ.4వే లకు పెంచి జూన్‌ నెలలో పంపిణీ చేస్తామన్నారు. ఓట్ల కోసం ముసలి వాళ్లతో సీఎం వైఎస్‌ జగన్‌ శవ రాజకీయాలు చేస్తు న్నారని చంద్రబాబు ఽధ్వజమెత్తారు. ప్రజలను అన్నిరకాలుగా ముంచిన జగన్‌కు ఓటు అడిగే హక్కులేదని చెప్పారు. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం బొమ్మలు ఎందుకని ప్రశ్నించారు. సభలో ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, దర్శి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూక సాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ దర్శి ఇన్‌చార్జ్‌ గోరంట్ల రవికుమార్‌, జనసేన దర్శి ఇన్‌చార్జ్‌ గరికపాటి వెంకట్‌ పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 01:02 AM