Share News

40 ఏళ్ల తర్వాత కురువలకు అవకాశం

ABN , Publish Date - May 04 , 2024 | 11:16 PM

తెలుగుదేశం పార్టీ పుణ్యాన 40 ఏళ్ల తర్వాత కురువలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చిందని కర్నూలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు.

40 ఏళ్ల తర్వాత కురువలకు అవకాశం

సాగు నీరు, పారిశ్రామిక రంగాలపై దృష్టి

టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు

మద్దికెర, మే 4: తెలుగుదేశం పార్టీ పుణ్యాన 40 ఏళ్ల తర్వాత కురువలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చిందని కర్నూలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. శనివారం మద్దికెర టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్‌ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని అఽథోగతి పట్టించారన్నారు. జగన్‌ను ఇంటికి పంపించే సమయం వచ్చిందన్నారు. నవరత్నాలు, పథకాల పేరుతో రాష్ట్రంలో రూ.15 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారని విమర్శించారు. పేదలను ధనికులను చేసేలా టీడీపీ కూటమి మేనిఫెస్టో ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. తనను గెలిపిస్తే కర్నూలు జిల్లాలోని సాగునీరు, పారిశ్రామిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ది చేసి చూపిస్తానని అన్నారు. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యతతో విజయం సాధిస్తానని అన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో పస లేదని, పాత మేనిఫెస్టోనే యథావిధిగా పెట్టారన్నారు. యువతకు ఉపాధి దొరకాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు. జిల్లాలోని కురువలు, యాదవులు అంతా ఒక్కటేనని, వారితోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలను అభివృద్ధి చేస్తానన్నారు. ముస్లింలకు కూడా న్యాయం జరగాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా కురువల ఆరాధ్యదేవుడైన బీరప్పస్వామి దేవాలయంలో ఆయన పూజలు చేశారు. ఎంపీగా గెలిచాక దేవాలయం అభివృద్ధికి సాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసులు, పురుషోత్తం చౌదరి, రాజన్న యాదవ్‌, ధనుంజయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు శివప్రసాద్‌ యాదవ్‌, ఎన్‌. లక్ష్మీనారాయణ, రామాంజులు, నెట్టికంటి నాగరాజు, రఘు యాదవ్‌, కిష్టన్న, తదితరులు ఉన్నారు.

నాగరాజును గెలిపిస్తాం : పంచలింగాల గ్రామస్థులు

కర్నూలు(రూరల్‌), మే4: కర్నూలు పార్లమెంటు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజును గెలిపిస్తామని పంచలింగాల గ్రామస్థులు వెల్లడించారు. శనివారం నాగరాజు తన సొంత ఊరు పంచలింగాల గ్రామపెద్దలు రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆదామ్‌, నారాయణ, నాగన్న, కృపాదానం, గొల్లకృష్ణ, సుధాకర్‌, నాగన్న, లక్ష్మయ్యలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు మాట్లాడుతూ గ్రామంలో అందరం నాగరాజుకు మద్దతుగా నిలిచి ఆయనను గెలిపించుకుంటామని అన్నారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ తనకు అండగా నిలిచిన గ్రామ ప్రజలకు, పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - May 04 , 2024 | 11:16 PM