Share News

పారిశ్రామిక ప్ర‘గతి తప్పింది..!’

ABN , Publish Date - May 04 , 2024 | 11:23 PM

పరుగులు పెట్టాల్సిన పారిశ్రామిక రంగం కుంటి నడకన సాగుతోంది. లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనుకున్న చంద్రబాబు లక్ష్యం తడబాటుకు గురవుతోంది.

పారిశ్రామిక ప్ర‘గతి తప్పింది..!’

33 వేల ఎకరాల్లో ఓర్వకల్లు ఇండస్ట్రీయల్‌ హబ్‌

సోలార్‌ పార్కు, పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్లాంట్‌కు శ్రీకారం

జైరాజ్‌ ఇస్పాత్‌ ఉక్కు పరిశ్రమ.. డీఆర్‌డీఓ ఏర్పాటు

మోగా సీడ్‌ హబ్‌, జైన్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు..

కొలిమిగుండ్ల కేంద్రంగా సిమెంట్‌ పరిశ్రమలు

చంద్రబాబు హయాంలో పురుడు పోసుకున్నవి ఎన్నో..

జగన్‌ వచ్చాక అవన్నీ రద్దు.. నత్తనడకన మరికొన్ని..

కర్నూలు, మే 4 (ఆంధ్రజ్యోతి): పరుగులు పెట్టాల్సిన పారిశ్రామిక రంగం కుంటి నడకన సాగుతోంది. లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనుకున్న చంద్రబాబు లక్ష్యం తడబాటుకు గురవుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓర్వకల్లు కేంద్రంగా 33 వేల ఎకరాల్లో పారిశ్రామిక వాడ (ఇండస్ట్రియల్‌ హబ్‌) ఏర్పాటు చేశారు. ఆసియాలోనే అతి పెద్దదైన వెయ్యి మెగా వాట్ల సోలార్‌ పార్కు, పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్లాంట్‌కు శ్రీకారం చుట్టారు. జైరాజ్‌ ఇస్పాత్‌ ఉక్కు పరిశ్రమకు భూమి పూజ చేశారు. తంగడంచలో మెగా సీడ్‌ పార్కు, జైన్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు తీసుకొచ్చారు. కొలిమిగుండ్ల కేంద్రంగా మూడు భారీ సిమెంట్‌ పరిశ్రమలతో ఒప్పందం (ఎంఓయూ) చేసుకొని పనులకు శ్రీకారం చుట్టారు. ఓర్వకల్లు విమానాశ్రయం నిర్మించారు. ఐదేళ్లలో విజన్‌ కలిగిన చంద్రబాబు పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించారు. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక పారిశ్రామిక ప్రగతి కుదేలయింది. కొత్తగా ఒక్క పరిశ్రమ తీసుకురాకపోగా.. తెచ్చిన ప్రరిశ్రమలను రద్దు చేశారు.

చంద్రబాబు ఉక్కు సంకల్పం

టీడీపీ ప్రభుత్వంలో ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌గా ప్రకటించి జైరాజ్‌ ఇస్పాత్‌ ఉక్కు పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. గుట్టపాడు, ఎస్‌.కొంతలపాడు గ్రామాల్లో 415 ఎకరాలు ఆ పరిశ్రమకు కేటాయించారు. రూ.1,658 కోట్ల పెట్టుబడితో ఏడాదికి ఏడు లక్షల మెట్రిక్‌ టన్నులు ఐరన్‌ ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ జైరాజ్‌ ఇస్పాత్‌ ఉక్కు పరిశ్రమకు 2018 మే 10న నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. వెయ్యి మందికి నేరుగా.. ఐదు వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేలా ఉక్కు పరిశ్రమకు శంకుస్థాన చేశారు. నిర్మాణం చివరి దశకు చేరుకుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లేకపోవడంతో ఐదేళ్లయినా ఉత్పత్తి మొదలు పెట్టలేదు. చంద్రబాబు ఉండి ఉంటే ఏనాడో ఉత్పత్తి మొదలయ్యేదని యువత అంటోంది.

జగన్‌ వచ్చాక..

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టు పనులు మూడేళ్లు ఆగిపోయాయి. టీడీపీ ప్రభుత్వంలోనే రూ.వేల కోట్లు ఖర్చు చేసిన గ్రీన్‌కో సంస్థ యాజమాన్యం ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఎట్టకేలకు 2022 మే 17న సీఎం జగన్‌ సిమెంట్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రపంచానికే విత్తన సరఫరా చేసే భాండాగారంగా మెగా సీడ్‌ హబ్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగడంచ వ్యవసాయ క్షేత్రంలో 623.40 ఎకరాల భూమిని కేటాయించారు. అమెరికాకు చెందిన అయోవా విశ్వవిద్యాలయం సాంకేతిక సహకారంతో మెగా సీడ్‌ హబ్‌ ఏర్పాటుకు 2917 అక్టోబరు 9న చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.315 కోట్లతో డీపీఆర్‌ సిద్ధం చేశారు. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యలో ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 17 పంటలకు సంబంధించి 77 రకాల క్షేత్ర పదర్శనలు చేపట్టింది. వైసీపీ ప్రభుత్వం రాగానే మెగా సీడ్‌ హబ్‌ను రద్దు చేసింది. కేటాయించిన భూములను తంగడంచ ఫారమ్‌కు అప్పగించింది.

సూర్యకాంతి వెలుగులు:

సూర్యకాంతితో కరువు సీమ రాయలసీమలో విద్యుత్‌ వెలుగులు నింపాలనే లక్ష్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్‌ పార్కుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఓర్వకల్లు, గడివేముల మండలాల మధ్యన వెయ్యి మెగా వాట్లా విద్యుత్‌ ఉత్పత్తికి అల్ర్టా మెగా సోలార్‌ పార్క్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో ప్రణాళికలు సిద్ధం చేశారు. శరవేగంగా పనులు పూర్తి చేసి 2017 అక్టోబరు నుంచే సోలార్‌ పవర్‌ ఉత్పత్తి మొదలు పెట్టారు. అంతటితో చంద్రబాబు సంతృప్తి చెందలేదు. పాణ్యం మండలం పిన్నాపురం వద్ద 5,230 మెగావాట్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్‌, విండ్‌, హైడల్‌ (పంప్డ్‌ స్టోరేజ్‌) విద్యుత్‌కు సంబంధించిన ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు-ఐఆర్‌ఈపీ)కు శ్రీకారం చుట్టారు. గ్రీన్‌కో కంపెనీ చేపట్టిన ఈ ప్రాజెక్టుకు పాణ్యం మండలం పిన్నాపురం, ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా గ్రామాల్లో 4,750 ఎకరాల భూమి, గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి ఒక టీఎంసీ నీటిని చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. రూ.15 వేల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా పనులు కూడా మొదలు పెట్టారు.

మూతబడిన జైన్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు

జూపాడుబంగ్ల మండలం తంగడంచ వ్యవసాయ క్షేత్రంలో ప్రతిష్టాత్మకమైన జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌ పరిశ్రమకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దీనికి 623 ఎకరాలు కేటాయించారు. 3,500 మందికి ప్రత్యేక్షంగా, పది వేల మందికి పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది లక్ష్యం. రూ.340 కోట్లతో పైపులు, డ్రిప్‌ పైపులు తయారి సహా పండ్ల ప్రాసెసింగ్‌ ఏర్పాటు చేసేలా ఒప్పందం. ప్రాజెక్టు పూర్తి పెట్టుబడి లక్ష్యం రూ.800 కోట్లు. 2018లో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ముచ్చుమర్రి లిఫ్ట్‌ నుంచి నీటి సౌకర్యం అందించేందుకు ప్రభుత్వం డీపీఆర్‌ కూడా ఆమోదించింది. పనులు కూడా మొదలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పరిశ్రమపైన కూడా పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఫలితంగా ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడే ఆగిపోయి. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ముళ్ల పొందలు నిండిపోయాయి.

సిమెంట్‌ హబ్‌కు చంద్రబాబు శ్రీకారం

కొలిమిగుండ్ల కేంద్రంగా సిమెంట్‌ పరిశ్రమల హబ్‌గా చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కల్వటాల, కనకాద్రిపల్లె, మీర్జాపురం గ్రామాల మధ్య 5,600 ఎకరాల విస్తీర్ణంలో రాంకో గ్రీన్‌ఫీల్డ్‌ సిమెంట్‌ పరిశ్రమతో ఒప్పందం చేసుకొని.. రూ.1,600 కోట్ల పెట్టుబడితో 3.15 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి లక్ష్యంగా 500 మందికి ప్రత్యేకంగా, 1,000 మందికి పరోక్షంగా ఉపాధి, ఉద్యోగాలు కల్పించే ధ్యేయంగా రాంకో సిమెంట్‌ పరిశ్రమ తీసుకొచ్చారు. 2018 డిసెంబరు 14న చంద్రబాబు ఉండవల్లి నుంచి వర్చువల్‌ (వీడియో లింక్‌) ద్వారా శంకుస్థాపన చేశారు. 2020 ఫిబ్రవరి ఆఖరులోగా నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి మొదలు పెట్టాలని లక్ష్యం. 4,600 ఎకరాల్లో ప్రిజం సిమెంట్‌ పరిశ్రమ, 4,600 ఎకరాల్లో గ్రాసింగ్‌ సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు, లైమ్‌ స్టోన్‌ మైనింగ్‌ లీజు అనుమతులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2022 సెప్టంబరులో చంద్రబాబు మొదలు పెట్టిన రాంకో సిమెంట్‌ పరిశ్రమను ప్రారంభించారు. అయితే.. చంద్రబాబు ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్న మిగిలిన రెండు పరిశ్రమలకు ఐదేళ్లలో కనీసం పునాది రాయి కూడా వేయలేదు.

చంద్రబాబు అభివృద్ధి ముద్ర

ఓర్వకల్లు పారిశ్రామక వాడలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు రావాలంటే విమానయాన సౌకర్యం ఉండాలనే అక్ష్యంగా గత టీడీపీ ప్రభుత్వంలో నాటి సీఎం చంద్రబాబు 1,010 ఎకరాల విస్తీర్ణంలో కర్నూలు (ఓర్వకల్లు) గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 2017 జూన్‌లో శంకుస్థాన చేశారు. రూ.110 కోట్లు వ్యయం చేపట్టిన ఈ విమానాశ్రయంను ఏడాదిన్నరలో పూర్తి చేసి 2018 డిసెంబరు 31న టర్బో విమానంతో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తే విజయవంతమైంది. 2019 జనవరిలో చంద్రబాబు జాతికి అంకితం చేశారు. అదే ఏడాది ఏప్రిల్‌, మే నుంచి కర్నూలు నుంచి విజయవాడకు నడిపేందుకు సన్నాహాలు చేపట్టారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక పైపై మెరుగులు దిద్ది.. అక్కడక్కడా రంగులు వేసి ఆయన తండ్రి వైఎస్‌ విగ్రహం పెట్టి ఎయిర్‌పోర్టును తామే నిర్మించినట్లు బిల్డప్‌ ఇస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.

ఓర్వకల్లు మండలం పాలకొలను, కుప్పలపాడు, ఉయ్యాలవాడ గ్రామాల్లో డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) చంద్రబాబు ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. ఆ ప్రాజెక్టు కోసం 2,295 ఎకరాల భూములు కేటాయించారు. రూ.500 కోట్లతో ఐదు వేల మందికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం. 2019 సెప్టంబరు 12న అత్యాధునిక క్షిపణిని పరీక్షించి డీఆర్‌డీఓ సక్సెస్‌ సాధించింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో యుద్ధ సామగ్రికి అవసమరైన క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, మిస్సైల్‌, గన్స్‌ వంటివి ఇక్కడ తయారు చేస్తారు. కీలకమైన డీఆర్‌డీఓ ఇక్కడికి రావడాన్ని చంద్రబాబు సాధించిన ఘనతగా చెప్పవచ్చు.

ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో విండ్‌ పవర్‌ (గాలిమర) విద్యుత్‌ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతోంది.

Updated Date - May 04 , 2024 | 11:23 PM