Share News

ఓటరు స్లిప్‌లను పంపిణీ చేయండి : కలెక్టర్‌

ABN , Publish Date - May 04 , 2024 | 11:19 PM

ఓటర్‌ స్లిప్పుల పంపిణీ ఈ నెల 7వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి. సృజన ఆదేశించారు.

ఓటరు స్లిప్‌లను పంపిణీ చేయండి : కలెక్టర్‌

కర్నూలు(కలెక్టరేట్‌), మే 4: ఓటర్‌ స్లిప్పుల పంపిణీ ఈ నెల 7వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.జి. సృజన ఆదేశించారు. శనివారం పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ హోం ఓటింగ్‌, వెబ్‌ కాస్టింగ్‌, ఈవీఎం కమిషనింగ్‌, ఓటర్‌ స్లిప్‌ల పంపిణీ తదితర అంశాలపై రిటర్నింగ్‌ అధికారులతో కలెక్టర్‌ టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 6, 7, 8 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లు నిర్వహిస్తున్నామనే విషయాన్ని వివిధ వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేయడంతో పాటు బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ రూపంలో అన్ని రకాల ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలింగ్‌ సిబ్బందికి పంపించాలని ఆర్వోలను ఆదేశించారు. జిల్లాలో వంద శాతం వెబ్‌ కాస్టింగ్‌ అమలు చేస్తామని అన్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 9, 10, 11 తేదీలలో పెద్ద ఎత్తున స్వీప్‌ యాక్టివిటీ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య, ఆర్వోలు భార్గవ్‌తేజ, శివ్‌ నారాయణశర్మ, శేషిరెడ్డి, రామలక్ష్మి, చిరంజీవి, మురళి, రాము నాయక్‌, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కర్నూలు పార్లమెంటరీ స్థానానికి సంబంధించి రెండో ఈవీఎం ర్యాండమైజేషన్‌ పూర్తయిందని రాజకీయ పార్టీ ప్రతినిధులకు కలెక్టర్‌ సృజన తెలిపారు.

Updated Date - May 04 , 2024 | 11:19 PM