Share News

లోన్‌ యాప్‌కు యువకుడు బలి

ABN , Publish Date - May 04 , 2024 | 11:51 PM

యాప్‌ల్లో రుణాలు తీసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన శనివారం బయటపడింది.

లోన్‌ యాప్‌కు యువకుడు బలి

విజయవాడ, మే 4 (ఆంధ్రజ్యోతి) : యాప్‌ల్లో రుణాలు తీసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన శనివారం బయటపడింది. విజయవాడ మొగల్రాజపురంలోని గిరిపురం సంది ఏసేబు వీధికి చెందిన కుక్కల స్వరూప హోటల్‌లో పనిచేస్తోంది. ఆమెకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దమ్మాయి శార, ఆమె భర్త చినిపోవడంతో ఇద్దరు పిల్లలు స్వరూప వద్ద ఉంటున్నారు. మనవడు టేకేటి ఇసాక్‌(23) పీవీపీ వద్ద ఇంటర్నెట్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇంటి నుంచి వెళ్లి సాయంత్రం ఆరు గంటలకు తిరిగి వస్తాడు.

ఈనెల మూడున స్వరూప హోటల్‌కు వెళ్లింది. ఇంట్లో మనవరాలు దివ్య ఉంది. ఇసాక్‌ ఇంటర్నెట్‌ సెంటర్‌కు వెళ్లి మధ్యాహ్నం నుంచి అనారోగ్యంగా ఉందని ఇంటికి వచ్చాడు. దివ్య చర్చికి వెళ్లింది. స్వరూప కుమారుడు, పిల్లలు భోజనం చేయడానికి ఇంటిపైన ఉండే రేకుల షెడ్‌లోకి వెళ్లారు. ఎంత కొట్టినా తలుపులు తీయకపోవడంతో అతడు స్వరూపకు ఫోన్‌ చేశాడు. ఆమె వెంటనే వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా ఇసాక్‌ చున్నీతో ఉరిపోసుకుని ఉన్నాడు. వెంటనే సూర్యరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. స్వరూప ఇచ్చిన ఫిర్యాదుపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. లోన్‌ యాప్‌ల్లో రుణాలు తీసుకోవడంతో అప్పుల పాలయ్యాడని పోలీసులు తెలిపారు. ఇలా తీసుకున్న రుణాలను ఇసాక్‌ ఏం చేశాడన్నది తెలియడం లేదు.

క్రికెట్‌ బెట్టింగ్‌లపై తల్లిదండ్రులు మందలించారని..

రైల్వేస్టేషన్‌ : క్రికెట్‌ బెట్టింగ్‌లో పెద్ద మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నందుకు తల్లిదండ్రులు క్రికెట్‌ బెట్టింగ్‌లు ఆడవద్దని మందలించినందుకు మనస్థాపం చెంది రాణిగారితోటకు చెందిన మేకల చంద్రశేఖర్‌ (30) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాణిగారితోట మాదంశెట్టి సీతయ్య వీధిలో ఎం.వి.వి.సత్యనారాయణ భార్య, కుటుంబసభ్యులతో ఉంటున్నాడు. నక్కల రోడ్డులోని ఓ ఫార్మా కంపెనీలో డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. చంద్రశేఖర్‌ తండ్రితో పాటే పనిచేస్తున్నాడు. చంద్రశేఖర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బెట్టింగ్‌లకు అలవాటుపడ్డాడు. బెట్టింగ్‌ల వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నాడు. దీనివల్ల కొందరి వద్ద అప్పులు కూడాచేశాడు. అప్పుల వాళ్లు చంద్రశేఖర్‌ ఇంటికి వెళ్లి అప్పుడప్పుడు గొడవ చేస్తుండగా అతని తల్లిదండ్రులే అప్పులు తీరుస్తుండేవారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు చంద్రశేఖర్‌ డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్న తండ్రి వద్దకు వెళ్లి డబ్బులివ్వమని గొడవపడ్డాడు. ఈ విషయాన్ని సత్యనారాయణ తన భార్యతో చెప్పాడు. దీంతో కుమారుడు చంద్రశేఖర్‌ను మందలించారు. దీంతో మనస్థాపం చెందిన చంద్రశేఖర్‌ శనివారం మధ్యాహ్నం 1 గంటకు ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతనిని కిందకు దించి 108లో ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్టు నిర్థారించారు.

Updated Date - May 04 , 2024 | 11:51 PM