Share News

జనసేనానికి జన జేజేలు

ABN , Publish Date - May 05 , 2024 | 12:00 AM

గుడివాడ జనవాడను తలపించింది. అవనిగడ్డ అపూర్వ స్వాగతం పలికింది. వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం జిల్లాలో పర్యటించారు. ఇసుకేస్తే రాలనంతగా రహదారులు కిక్కిరిసిపోయాయి. గుడివాడకు అనుకున్న సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన పవన్‌ను చూసేందుకు అభిమానులు మండుటెండలోనే వేచి ఉన్నారు. పవన్‌ సభా వేదికపైకి రాగానే కేకలు, అరుపులతో అభిమానాన్ని చాటు కున్నారు. ఏఎన్‌ఆర్‌ కళాశాల హెలీప్యాడ్‌ నుంచి నెహ్రూచౌక్‌ సెంటర్‌ వరకు పవన్‌ రోడ్‌ షో జరిగింది. అడుగడుగునా నీరాజనాలు పలికి గజమాలలతో సత్క రించారు. అనంతరం పవన్‌ అవనిగడ్డ చేరుకున్నారు. శనివారం రాత్రి వరకూ జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. - గుడివాడ/అవనిగడ్డ

జనసేనానికి జన జేజేలు

గుడివాడ, అవనిగడ్డలో పవన్‌ కల్యాణ్‌ పర్యటన

అడుగడుగునా అపూర్వ స్వాగతం

కిక్కిరిసిపోయిన గుడివాడ రహదారులు

ఎండను సైతం లెక్క చేయకుండా ఎదురుచూపులు

అవనిగడ్డ బహిరంగ సభకు విశేష స్పందన

వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వంపై పవన్‌ ఫైర్‌

గుడివాడ జనవాడను తలపించింది. అవనిగడ్డ అపూర్వ స్వాగతం పలికింది. వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం జిల్లాలో పర్యటించారు. ఇసుకేస్తే రాలనంతగా రహదారులు కిక్కిరిసిపోయాయి. గుడివాడకు అనుకున్న సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన పవన్‌ను చూసేందుకు అభిమానులు మండుటెండలోనే వేచి ఉన్నారు. పవన్‌ సభా వేదికపైకి రాగానే కేకలు, అరుపులతో అభిమానాన్ని చాటు కున్నారు. ఏఎన్‌ఆర్‌ కళాశాల హెలీప్యాడ్‌ నుంచి నెహ్రూచౌక్‌ సెంటర్‌ వరకు పవన్‌ రోడ్‌ షో జరిగింది. అడుగడుగునా నీరాజనాలు పలికి గజమాలలతో సత్క రించారు. అనంతరం పవన్‌ అవనిగడ్డ చేరుకున్నారు. శనివారం రాత్రి వరకూ జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
- గుడివాడ/అవనిగడ్డ

నానీని ఇంటికి పంపినప్పుడే అసలైన పండుగ

గుడివాడలో పవన్‌ మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరాన్ని పూర్తిచేసి, కృష్ణాడెల్టాకు రెండు పంటలకు సాగునీటిని అందిస్తామన్నారు. పంటకాల్వలో పూడిక తీయడానికి కూడా ప్రభుత్వానికి చేతులు రాలేదన్నారు. గుడివాడ-కంకిపాడు రహదారి మరమ్మతులు చేయాలని అడిగితే స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని బూతుపురాణం ఎత్తుతున్నాడన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా మోటూరులో మట్టి దోపిడీ యథేచ్ఛగా జరుగుతోందని మండిపడ్డారు. చెరువులు, శ్మశాన వాటికల్లోని మట్టిని సైతం దోచేశారన్నారు. కొడాలి నానీని ఇంటికి పంపిన నాడే అసలైన పండుగ చేసుకోవాలన్నారు. గుడివాడను ఎలా అభివృద్ధి చేయాలో తాను, వెనిగండ్ల రాము అసెంబ్లీలో ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు. పేకాట క్లబ్‌లు, కేసినోలు, మట్టి, ఇసుక దోపిడీ చేయడానికి వైసీపీ నాయకులకు చాలా ఓపిక ఉందన్నారు. ఆక్వా రంగానికి రూ.1.50కే విద్యుత్‌ ఇస్తామని చెప్పి, వారి వద్ద నుంచి రూ.5 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టారని, హెల్త్‌ యూనివర్సిటీకి మాత్రం ఆయన పేరు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. వైసీపీ బ్యాచ్‌ తిట్టే తిట్లకు పన్ను విధిస్తే, ఆ డబ్బుతో రాష్ట్రమంతా విద్యను ఉచితంగా అందించవచ్చని ఎద్దేవా చేశారు. కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, మెజారిటీ ఎంత అన్నది మాత్రం ప్రజల ఆలోచన అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఉచిత బస్సు సౌకర్యం, మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ఆడబిడ్డ, తల్లికి వందనం పథకాలు అమలవుతాయన్నారు. ఎటువంటి పదవి లేనప్పుడే గుడివాడలోని పేదలకు, యువతకు ఉపాధి కల్పించిన వెనిగండ్ల రాము వంటి వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెడితే నియోజకవర్గానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. మచిలీపట్నం ఎంపీ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు ఓట్లు వేసి గెలిపించాలని పవన్‌ కోరారు. అనంతరం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఏం అభివృద్ధి సాధించావ్‌.. సింహాద్రి రమేశ్‌..?

అవనిగడ్డలో పవన్‌ మాట్లాడుతూ ఏం అభివృద్ధి సాధించావని ఓట్లు అడుగుతున్నావంటూ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌ను ప్రశ్నించారు. ఎదురుమొండి వారధి నిర్మించి గానీ ఓట్లు అడగనని చెప్పి ఇప్పుడు ఎలా అడుగుతున్నావన్నారు. తాము అధికారంలోకి రాగానే ఎదురుమొండి వంతెన, ఎడ్లంక వంతెన నిర్మించి తీరుతామన్నారు. డాక్టర్‌ కోట శ్రీహరి హత్య జరిగి నాలుగేళ్లు దాటుతున్నా దోషులు ఎవరో ఇంతవరకూ తేల్చలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దోషులను పట్టుకుంటామన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అణగారిన వర్గాలపై దాడులకు పాల్పడుతుందంటూ స్థానిక ఎమ్మెల్యే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అభివృద్ధి చేసి చూపిస్తాం.. : ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం పార్లమెంట్‌ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని సమర్థవంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్‌ ఏర్పాటు చేస్తామని, పోర్టు కనిక్టెవిటీ ద్వారా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము మాట్లాడుతూ పవన్‌ పేరులోనే వైబ్రేషన్‌ ఉందని, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌, గుడివాడలో నానీలు దుర్మార్గ పాలన సాగించారని, వారిని ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైందన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన పవన్‌ కల్యాణ్‌ను అభినందించారు. పామర్రు టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్‌రాజా, క్రికెటర్‌ అంబటి రాయుడు మాట్లాడారు.

Updated Date - May 05 , 2024 | 12:00 AM