Share News

గంజాయి ముఠా అరెస్టు

ABN , Publish Date - May 04 , 2024 | 11:49 PM

చింతపండు, యూరియా బస్తాల మధ్య గంజాయి రవాణా చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి పోలీసులు రూ.2లక్షల 35వేల విలువైన 9.5కిలోల గంజాయితోపాటు నాలుగు సెల్‌ఫోన్లు, చింతపండు బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి ముఠా అరెస్టు
వివరాలను వెల్లడిస్తున్న ఏసీపీ దేవేందర్‌రెడ్డి

హనుమకొండ టౌన్‌, మే 4 : చింతపండు, యూరియా బస్తాల మధ్య గంజాయి రవాణా చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి పోలీసులు రూ.2లక్షల 35వేల విలువైన 9.5కిలోల గంజాయితోపాటు నాలుగు సెల్‌ఫోన్లు, చింతపండు బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి శనివారం హనుమకొండ పోలీ్‌సస్టేషన్‌లో వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలానికి చెందిన ఈదర కృష్ణనాగేశ్వర్‌రావు, ఆనుమొలు వెంకటరమణలు గంజాయి వ్యాపారం చేస్తున్నా రు. ప్రస్తుతం పరారీలో ఉన్న సీలేరుకు చెందిన సరేష్‌ వద్ద గంజాయి కొనుగోలు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా చింతపండు, యూరియా బస్తాల మధ్య గంజాయిని భద్రపరిచి హనుమకొండలో పరిచయం ఉన్న మహ్మద్‌ అబ్దుల్‌రహీమ్‌, మహారాష్ట్రకు చెందిన త్రిపాఠిలకు విక్రయించేందుకు శుక్రవారం హనుమకొండ బస్టాండ్‌ చేరుకున్నారు. ఏపీ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బస్టాండ్‌ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు సమాచారం రావడంతో ఎస్సై శ్రావణ్‌ సిబ్బందితో హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకున్నారు. ఇద్దరు నిందితులు హనుమకొండకు చెందిన ఇద్దరి నిందితులకు గంజాయిని విక్రయించే క్రమంలో ఎస్సై శ్రావణ్‌ సిబ్బందితో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నిందితులు గంజాయి క్రయ విక్రయాలను జరుపుతున్నట్టు వెల్లడైంది. నిందితుల నుంచి గంజాయి, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన హనుమకొండ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌, ఎస్సై శ్రావణ్‌తో పాటు హనుమకొండ పోలీస్‌ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. దాడుల్లో ఎస్సైలు శ్రీనివాస్‌, పరుశురాములు, పోలీసు సిబ్బంది భాస్కర్‌, కిరణ్‌, శివ, గౌస్‌పాష పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:50 PM