Share News

సమన్వయ లోపం!

ABN , Publish Date - May 04 , 2024 | 11:45 PM

పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో జిల్లా కలెక్టరు ఉత్తరువులకు, నోడల్‌ అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి మధ్య సమన్వయ లోపంపై చిలకలపూడి హైస్కూలుకు వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు.

సమన్వయ లోపం!
చిలకలపూడి మునిసిపల్‌ హైస్కూలు వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగులు

  • ఉద్యోగులకు ఇవ్వని ముందస్తు సమాచారం

మచిలీపట్నం టౌన్‌, మే 4 : పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో జిల్లా కలెక్టరు ఉత్తరువులకు, నోడల్‌ అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి మధ్య సమన్వయ లోపంపై చిలకలపూడి హైస్కూలుకు వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి బాలాజీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. ఇతర జిల్లాల్లో ఓటు కలిగి ఇక్కడ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు శనివారం పోస్టల్‌ బ్యాలెట్‌ వేసేందుకు మచిలీపట్నం చిలకలపూడి హైస్కూల్‌కు వచ్చారు. కలెక్టర్‌ బాలాజీ ఉద్యోగులకు ఎన్నికల శిక్షణ రోజున ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు ఈనెల 4వ తేదీన పోస్టల్‌ బాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించినట్టు చెప్పారు. లేని పక్షంలో చర్యలు తప్పవని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇచ్చారు. సదరు ఉత్తర్వుల మేరకు చిలకలపూడి హైస్కూల్‌కు శనివారం ఉదయం పదిగంటలకు కృష్ణాజిల్లాలో పనిచేస్తు ఇతర జిల్లాల్లో ఓటు ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. అయితే హైస్కూలు తలుపులు మూసి ఉండటంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఓటు ఉండి కృష్ణా జిల్లాలో ఎన్నికల విధులకు నియమించిన ఉద్యోగులు 2500 మంది ఉన్నారు. వీరందరూ తమ ఓటు వేసేందుకు ఫారం-12లో నమోదు చేసిన విధంగా ఆయా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బ్యాలెట్‌ పేపర్లను కృష్ణాజిల్లాకు కలెక్టరు తెప్పించారు. అయితే వాటిని చిలకలపూడి స్కూల్‌కు తీసుకురావడంలో విఫలమయ్యారు. కనీసం 6వ తేదీన రావాలని ముందుగా కనీస సమాచారం ఇవ్వలేదు. దీంతో శనివారం ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కార్యాలయ ఉద్యోగి బాలాజీ వారిని 6 వతేదీన రావాలని చెప్పడంతో.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మళ్లీ రావడానికి ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాఖల మధ్య సమన్వయ లోపం తమకు శాపమైందన్నారు.

ఆరో తేదీన పది కౌంటర్లు ఏర్పాటు చేస్తాం

- షేక్‌ షాహిద్‌ బాబు, నోడల్‌ ఆఫీసర్‌

చిలకలపూడి మునిసిపల్‌ హైస్కూల్‌లో ఆరో తేదీ ఉదయం నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌లు ఇచ్చి ఓటింగ్‌ నిర్వహిస్తాం. ఎక్కువ మంది వస్తున్నందున 10 కౌంటర్ల వరకు ఏర్పాటు చేస్తాం. ఎవరికీ ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు సుమారు 2500 మంది వచ్చే అవకాశం ఉంది.

Updated Date - May 04 , 2024 | 11:45 PM