Share News

AP Elections: గన్నవరం చాలా స్పెషల్ గురూ.. ఎందుకో మీరే చూడండి..!

ABN , Publish Date - May 17 , 2024 | 11:28 AM

ప్రజలిచ్చిన విరాళాలతో పోటీచేసి గెలిచిన పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ఏలిన నియోజకవర్గమది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు డబ్బే ప్రధానమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నగదు వెదజల్లాయి. ఒక ఓటు సుమారు రూ.3 వేల వరకూ పలికిందంటే ఈ నియోజకవర్గం ఎంత ఖరీదైందో తెలుస్తుంది.

AP Elections: గన్నవరం చాలా స్పెషల్ గురూ.. ఎందుకో మీరే చూడండి..!
Gannavaram

ప్రజలిచ్చిన విరాళాలతో పోటీచేసి గెలిచిన పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ఏలిన నియోజకవర్గమది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు డబ్బే ప్రధానమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నగదు వెదజల్లాయి. ఒక ఓటు సుమారు రూ.3 వేల వరకూ పలికిందంటే ఈ నియోజకవర్గం ఎంత ఖరీదైందో తెలుస్తుంది. ఓట్ల కొనుగోలుకే ప్రధాన పార్టీలు సుమారు రూ.150 కోట్ల పైచిలుకు ఖర్చు చేసిన ఈ నియోజకవర్గం మరేదో కాదు.. మన గన్నవరమే.

(విజయవాడ–ఆంధ్రజ్యోతి) : గన్నవరం నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఇక్కడ తొలి ఎమ్మెల్యేగా కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేశారు. ప్రజల నుంచి పోగేసిన విరాళాల నుంచే ఆయన ఎన్నికలకు ఖర్చు పెట్టేవారు. ఇదంతా గతం. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఓటు ఖరీదైనదిగా మారింది. 1999లో దాసరి బాలవర్ధనరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో ఓటుకు రూ.500 ఇచ్చారని, అది కూడా పేదలకే ఇచ్చేవారని గన్నవరానికి చెందిన పాతతరం నాయకుడొకరు చెప్పారు. అప్పట్లో అదే చాలా ఎక్కువ మొత్తమని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత క్రమేణా ఓటు ధర పెరుగుతూ వచ్చింది.


2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ ఓటుకు రూ.700, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు రూ.500 ఇచ్చారని, సగంమంది ఓటర్లకు డబ్బు పంచారని హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన శివరామకృష్ణ తెలిపారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేయగా, వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో వెంకట్రావు గెలుస్తారనే ఊపు కనిపిం చింది. అయినా ఇరువర్గాలు డబ్బు పంపిణీ చేశాయి. టీడీపీ నాయకులు ఓటుకు రూ.2 వేలు పంచగా, వైసీపీ నుంచి రూ.1,000 నుంచి రూ.1,500 వరకూ ముట్టాయని ప్రచారం జరుగుతోంది.


పోటాపోటీగా..

గన్నవరం నియోజకవర్గంలో మొత్తం 2,79,054 ఓట్లు ఉన్నాయి. 2,36,861 ఓట్లు పోలయ్యాయి. అంటే 84.88 శాతం పోలింగ్‌ నమోదైంది. కానీ, గన్నవరం నియోజకవర్గ ఓటర్లను డబ్బు ప్రభావితం చేసింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల నుంచి గతంలో కంటే ఎక్కువ మొత్తం లభిస్తుందని ఓటర్లు ఆశించారు. యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా విదేశాల్లో ఉన్న ఆయన స్నేహితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. డబ్బు పంపిణీ మొత్తం వారి కనుసన్నల్లోనే జరిగింది. ఓటుకు రూ.3 వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సుమారు 2.65 లక్షల మందికి డబ్బు పంపిణీ చేసినట్లు సమాచారం. మరోవైపు వంశీ డబ్బు పంపిణీలో ఆచీచూతి వ్యవహరించారు. ఎలాగూ ఓటమిపాలవుతామన్న సంకేతాలతో ఆయన ఇందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో కొండలు, గుట్టల నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్న వంశీ అనుచరులు కూడా సొంత డబ్బు పైసా బయట పెట్టలేదు. పార్టీ నుంచి ఆయనకు సుమారు రూ.50 కోట్ల వరకు వచ్చిందని సమాచారం. ఇతరత్రా వసూలు చేసింది మరో రూ.10 కోట్ల వరకు ఉందని ఆయన వర్గంవారే చెబుతున్నారు. ఆ మొత్తం నుంచే ఎన్నికల ఖర్చుతో పాటు ఓటర్లకు పంచారని తెలుస్తోంది. వైసీపీకి ఓటేస్తారని పక్కాగా గుర్తించిన వారికే వంశీ డబ్బు పంచారు.


చివరి నిమిషం వరకు వంశీ పాట్లు..

గతంలో ఎన్నడూ లేని విధంగా వంశీ ఈసారి గెలుపు కోసం నానా తిప్పలు పడ్డారు. నియోజకవర్గంలో కీలకమైన వ్యక్తిగా ఉన్న డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు మద్దతు కోసం చేయని ప్రయత్నాలు లేవు. దుట్టా కూతురు, అల్లుడిని బతిమాలుకుని తన శిబిరం వైపు తెచ్చుకోవడంలో సఫలమైన వంశీ దుట్టా మద్దతు మాత్రం కూడగట్టుకోలేకపోయారు. ఒకప్పుడు వంశీ చేతిలో తీవ్ర అవమానాలపాలైన డాక్టర్‌ దుట్టా ఆయనకు మద్దతు తెలిపేందుకు ససేమిరా అనడంతో పాటు తన వర్గాన్ని యార్లగడ్డ గెలుపు కోసమే పనిచేసేలా చూశారు. మరోవైపు వైసీపీలో కార్యకర్తలు మొదలు గ్రామ, మండల స్థాయి నాయకుల వరకు పెద్ద ఎత్తున ఆ పార్టీని వీడి టీడీపీ వైపు వచ్చారు. వీరిలో కొందరు యార్లగడ్డతో పాటు రాగా, మరికొందరు ఎన్నికలకు ముందు టీడీపీవైపు వచ్చారు. వంశీ ఎంత బతిమాలినా వలసలను ఆపలేకపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని వంశీ అసెంబ్లీ సాక్షిగా అవమానించడం, దానికి చంద్రబాబు కన్నీరుపెట్టుకోవడం వంటి అంశాలు నియోజకవర్గ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయి. యార్లగడ్డ గెలుపు చంద్రబాబు కన్నీటికి సమాధానంగా నియోజకవర్గ ప్రజలు భావించారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇన్ని అనుకూలతల నడుమ వంశీ ఓటమికి మానసికంగా సిద్ధమయ్యారని, అందుకే డబ్బు తీయలేదని, పోలింగ్‌ రోజున అసహనంతో దాడులకూ తెగబడ్డారనేది టీడీపీ నాయకుల మాట.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 17 , 2024 | 11:28 AM