Share News

మద్యేమార్గం

ABN , Publish Date - May 04 , 2024 | 11:58 PM

అక్రమ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారిపై సినిమాల ప్రభావం తీవ్రంగా పడుతోంది. తక్కువ ధరకు వచ్చే సరుకును సరిహద్దులు దాటించి ఎక్కువ ధరకు అమ్ముకుంటే ఆదాయం సంపాదించుకోవచ్చనుకుంటున్నారు లోకల్‌ ‘పుష్పాలు’. తెలంగాణతో పోల్చి చూసుకుంటే ఇక్కడ మద్యం ధరలు చాలా ఎక్కువ. బ్రాండెడ్‌ కంపెనీలకు సంబంధించిన మద్యం అక్కడ అందుబాటులో ఉంటే, ఇక్కడ చిత్రవిచిత్రమైన బ్రాండ్లే ఉన్నాయి.

మద్యేమార్గం

మద్యం వ్యాపారుల సరికొత్త మార్గం

తెలంగాణ నుంచి భారీగా డంప్‌

వాహనాలకు ప్రత్యేక ఏర్పాట్లు

సీసాలు పైకి కనిపించకుండా ముసుగు

ఎన్నికల వేళ మందు ప్రయోగాలు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : అక్రమ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారిపై సినిమాల ప్రభావం తీవ్రంగా పడుతోంది. తక్కువ ధరకు వచ్చే సరుకును సరిహద్దులు దాటించి ఎక్కువ ధరకు అమ్ముకుంటే ఆదాయం సంపాదించుకోవచ్చనుకుంటున్నారు లోకల్‌ ‘పుష్పాలు’. తెలంగాణతో పోల్చి చూసుకుంటే ఇక్కడ మద్యం ధరలు చాలా ఎక్కువ. బ్రాండెడ్‌ కంపెనీలకు సంబంధించిన మద్యం అక్కడ అందుబాటులో ఉంటే, ఇక్కడ చిత్రవిచిత్రమైన బ్రాండ్లే ఉన్నాయి. ఇష్టమైన సరుకు దొరక్కపోవడం, ధరలు దారుణంగా ఉండటంతో మందుబాబులు పొరుగు రాష్ట్రం మద్యం వైపు చూస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు సరిహద్దులు దాటించేస్తున్నారు. తెలంగాణ నుంచి మద్యాన్ని వివిధ మార్గాల్లో సరిహద్దుల్లోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం రకరకాల సదుపాయాలను వాహనాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు.

100 సీసాలకు తగ్గకుండా..

తెలంగాణ మద్యాన్ని సరిహద్దులు దాటిస్తున్న వారిలో అటు తెలంగాణవాసులు, ఇటు ఆంధ్రా వ్యక్తులు ఉంటున్నారు. ఒక్కో ట్రిప్పునకు 100 సీసాలకు తగ్గకుండా తరలిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీ బృందాలకు చిక్కకుండా అనుకున్న గమ్యానికి చేరితే ఆరోజు పంట పండినట్టే. అదే తనిఖీ బృందాలకు చిక్కితే మాత్రం కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇలా మద్యాన్ని తరలిస్తున్న వారిలో యువకుల నుంచి వృద్ధుల వరకు ఉంటున్నారు. మద్యం సీసాలను తరలించడానికి వీలుగా ద్విచక్ర వాహనాలను తయారు చేయించుకుంటున్నారు. ఈ తరలింపునకు ఎక్కువగా స్కూటీలు, యాక్టివా వాహనాలను ఉపయోగిస్తున్నారు. జగ్గయ్యపేట, తిరువూరు సరిహద్దుల నుంచి ఈ మద్యం రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశిస్తోంది. బ్రాండెడ్‌ మద్యం ధరలో తెలంగాణకు, ఆంధ్రాకు వ్యత్యాసం ఉండటంతో తెలంగాణ మద్యానికే సరిహద్దు జిల్లాల్లోని మందుబాబులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా తీసుకొచ్చిన సరుకును బెల్టుషాపుల వద్ద విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నందిగామ పోలీసులు రెండు రోజుల క్రితం నిర్వహించిన తనిఖీల్లో ఒక వృద్ధుడిని పట్టుకున్నారు. స్కూటీపై వస్తున్న అతడిని ఆపి తనిఖీ చేయగా, మద్యం సీసాలను దాచిపెట్టడానికి చేసిన ఏర్పాట్లను చూసి పోలీసులు అవాక్కయ్యారు. స్కూటీకి సీటు కింద డిక్కీకి ఒక బాక్సును తయారు చేయించుకున్నాడు. దీనికి అడుగు భాగాన ఖాళీ ఉండేలా చూసుకున్నాడు. ఇందులో కొన్ని మద్యం సీసాలు పెట్టాడు. బాక్సులా తయారు చేయించు కున్న డిక్కీలో కొన్ని సీసాలు పెట్టాడు. హ్యాండిల్‌ భాగంలో హెడ్‌లైట్‌కు కింద ఉండే ప్లాస్టిక్‌ ప్లేట్‌ లోనూ కొన్ని సీసాలు పెట్టాడు. తీసేకొద్దీ సీసాలు వస్తుండటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

Updated Date - May 04 , 2024 | 11:58 PM