Share News

అధికారుల అలసత్వం!

ABN , Publish Date - May 04 , 2024 | 11:48 PM

వివాదాస్పద నిర్ణయాలతో తరచుగా వార్తల్లో నిలుస్తున్న గుడివాడ రిటర్నింగ్‌ అధికారి ఎన్నికల విధుల్లో మరోసారి నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లకు సౌకర్యాల కల్పన, సమాచార విషయంలో అలసత్వం బయటపడింది.

అధికారుల అలసత్వం!
పోలింగ్‌ బూత్‌ వద్ద ఎండలో విధుల నిర్వహణ

  • పోలింగ్‌ బూత్‌ వద్ద ఎండలో ఉద్యోగుల పాట్లు

  • ఓట్లు మురిగిపోతాయని పలువురి ఆందోళన

గుడివాడ, మే 4 : వివాదాస్పద నిర్ణయాలతో తరచుగా వార్తల్లో నిలుస్తున్న గుడివాడ రిటర్నింగ్‌ అధికారి ఎన్నికల విధుల్లో మరోసారి నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లకు సౌకర్యాల కల్పన, సమాచార విషయంలో అలసత్వం బయటపడింది. స్థానిక వీకేఆర్‌ అండ్‌ వీఎన్‌బీ ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం ఉద్యోగుల పోస్టల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లకు కనీస వసతులు ఇక్కడ కల్పించకపోవడం గమనార్హం. మండల తహసీల్ధార్‌, రిట్నరింగ్‌ అధికారి అక్కడే ఉన్నా.. ఎండ వేడిమితో ఓటర్లు చెట్ల నీడకు చేరడం వారికి కనిపించకపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ బాలాజీ పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించనున్నారనే సమాచారంతో 10.45 నిమిషాలకు హుటాహుటిన షామియానా, కుర్చీలు, మంచినీటిని తెప్పించారు.

మోడల్‌ నమూనా బ్యాలెట్‌ ప్రదర్శన లేదు

పోలింగ్‌ జరిగే గదుల వద్ద మోడల్‌ నమూనా బ్యాలెట్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుందని ఏర్పాటు చేశారు. ఉద్యోగుల పోస్టల్‌ పోలింగ్‌ కేంద్రంలో పార్లమెంట్‌, అసెంబ్లీ నమూనా బ్యాలెట్‌ ఎక్కడా కానరాలేదు. దీంతో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు.

సందేహాలు తీర్చేవారే కరువయ్యారు..

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఓటు వినియోగించుకునే ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేయాలి. వారికి అవసరమైన సహాయాన్ని అందించాలి. ప్రతి ఉద్యోగి ఓటు వేసే సమయంలో ఫారం 13ఎ సమర్పించాలి. సదరు ఫారంలో ఓటరును ధృవీకరిస్తూ గెజిటెడ్‌ అధికారి సంతకం పెట్టాలి. సంతకంతో పాటు స్టాంప్‌, సీల్‌ తప్పనిసరిగా వేయాలి. అయితే గుడివాడలో దీనికి భిన్నంగా సాగింది. ఫారం 13ఎ పైన స్టాంప్‌ లేకుండానే గెజిటెడ్‌ అధికారి సంతకం పెట్టారు. ఉద్యోగులు అడిగితే అవసరం లేదని, ఓటును వినియోగించుకోవాలని ఉచిత సలహా యిచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్న ఉపాధ్యాయులకు ఓటు మురిగిపోయిందనే సందేహం తలెత్తింది. గెజిటెడ్‌ అధికారి స్టాంప్‌ లేకపోవడంతో ఓటును పరిగణలోకి తీసుకోరని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

సిబ్బందికి శిక్షణపై అనుమానాలు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో పాటించాల్సిన నియమ, నిబంధనలను సిబ్బందికి శిక్షణలో తెలిపాలి. ఫెసిలిటేషన్‌ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వలేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. సంతకంతో పాటు తప్పనిసరిగా స్టాంప్‌, సీల్‌ వేయాలన్న నిబంధన ఖచ్చితంగా పాటించాల్సి ఉన్నా ఎందుకు పట్టించుకోలేదనే సందేహం వారిలో వ్యక్తమవుతున్నది. గెజిటెడ్‌ అధికారి తీరుపై పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయి.

ఎన్నికల విధుల్లో ఆర్డీవో అలసత్వం

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న ఆర్డీవో పి.పద్మావతి విధుల పట్ల అలసత్వం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల కమిషన్‌ ఒత్తిడి మేరకే విధులు నిర్వర్తిస్తున్నట్టు ఆమె ప్రవర్తన ఉంది. నిబంధనలను తుంగలో తొక్కడం పరిపాటిగా మారింది. వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ప్రధాన ఎన్నికల ఏజెంట్‌ శశితో పోలింగ్‌ కేంద్రంలో దాదాపుగా గంటపాటు ఉద్యోగుల ఉండగానే బాతాఖానీ నిర్వహించినట్టు సమాచారం.

Updated Date - May 04 , 2024 | 11:48 PM