Share News

పోస్టల్‌ బ్యాలెట్‌కు విశేష స్పందన

ABN , Publish Date - May 04 , 2024 | 11:57 PM

జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌కు ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాల్లో మొత్తం ఏడు ఫెసిలిటేషన్‌ కేంద్రాలతో పాటు ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఐజీఎంసీ) స్టేడియంలో నిర్వహించిన సెంటరుకు ఉద్యోగులు భారీగా తరలివచ్చారు.

పోస్టల్‌ బ్యాలెట్‌కు  విశేష స్పందన

జిల్లావ్యాప్తంగా భారీగా తరలివచ్చిన ఉద్యోగులు

మండుటెండను సైతం లెక్క చేయకుండా..

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌కు ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాల్లో మొత్తం ఏడు ఫెసిలిటేషన్‌ కేంద్రాలతో పాటు ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఐజీఎంసీ) స్టేడియంలో నిర్వహించిన సెంటరుకు ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ మందకొడిగా సాగినప్పటికీ ఆ తర్వాత ఊపందుకుంది. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా బ్యాలెట్‌ బాక్సులను ఏర్పాటు చేశారు. సిద్ధార్థ ఆర్ట్స్‌ కాలేజీకి పెద్దసంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. ఇందిరాగాందీ స్టేడియంలో పోస్టల్‌ బ్యాలెట్‌ను జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సుమారు 23 వేల మందికి పైగా అధికారులు, సిబ్బంది ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. తొలిరోజు ప్రశాంత వాతావరణంలో ఉద్యోగులు ఓటుహక్కును వినియోగించుకున్నారన్నారు. ఆంధ్రా లయోల కళాశాల ఫెసిలిటేషన్‌ సెంటరును సబ్‌ కలెక్టర్‌ భవానీ శంకర్‌ పర్యవేక్షించారు. తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. చాలామంది ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రావటం వల్ల 5 గంటలకు ముగియాల్సిన బ్యాలెట్‌ ప్రక్రియ రాత్రి 7.30 గంటల వరకు కొనసాగింది. విజయవాడ తూర్పు, సెంట్రల్‌ నియోజకవర్గాల పరిధిలో పలువురు ఉద్యోగుల ఓట్లు వారి స్థానిక నియోజకవర్గాల జాబితాలో చేరాయి. దీంతో వారంతా అక్కడికి వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ఉద్యోగులు తమ సంఘ నేతల దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై సీఐ ఓవరాక్షన్‌

లయోల కాలేజీ ఫెసిలిటేషన్‌ సెంటరులో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై స్థానికంగా విధులు నిర్వహిస్తున్న సీఐ దురుసుగా ప్రవర్తించారు. ఫెసిలిటేషన్‌ సెంటరులో విధులు నిర్వహిస్తున్న రిటైర్డ్‌ తహసీల్దార్‌ రామకృష్ణ ఫొటోలు తీయటాన్ని ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఐడీలు ఉన్నాయా అంటూ అరిచారు. దీంతో అక్కడే ఉన్న సబ్‌ కలెక్టర్‌ భవానీశంకర్‌ ఐడీ ఉందో లేదో మాత్రమే పరిశీలించమన్నారు. దీనిని అలుసుగా తీసుకున్న సీఐ దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా పంపించే ప్రయత్నం చేయటంతో పాటు కెమెరాలో ఫొటోలను డిలీట్‌ చేయించారు.

Updated Date - May 04 , 2024 | 11:57 PM