Share News

పోస్టల్‌ బ్యాలెట్‌కు ప్రలోభాలు

ABN , Publish Date - May 05 , 2024 | 12:27 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లకు ప్రలోభాలు ముమ్మరమయ్యాయి.నేటినుంచీ నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లకు పోలింగ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లావ్యాప్తంగా 22,299 మంది పోస్టల్‌ బ్యాలెట్‌, హోమ్‌ ఓటింగ్‌ వంటి కేటగిరీ ఓటర్లుండగా పీవో, ఏపీవో, ఇతర పోలింగ్‌ అధికారులు వంటి ఎన్నికల విధుల్లో వున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు మాత్రం 16,552మంది వున్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌కు  ప్రలోభాలు

తిరుపతి, మే 4 (ఆంధ్రజ్యోతి):పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లకు ప్రలోభాలు ముమ్మరమయ్యాయి.నేటినుంచీ నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లకు పోలింగ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లావ్యాప్తంగా 22,299 మంది పోస్టల్‌ బ్యాలెట్‌, హోమ్‌ ఓటింగ్‌ వంటి కేటగిరీ ఓటర్లుండగా పీవో, ఏపీవో, ఇతర పోలింగ్‌ అధికారులు వంటి ఎన్నికల విధుల్లో వున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు మాత్రం 16,552మంది వున్నారు. జిల్లాలో నివాసముంటూ ఇతర జిల్లాల్లో ఎన్నికల విధులకు కేటాయించబడిన వారు మరో 3789మంది కూడా ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులు. మొత్తం 20,341 మంది ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. కనిష్టంగా ఓటుకు రూ. 2 వేల నుంచీ గరిష్టంగా రూ. 3 వేల వరకూ ఆఫర్‌ చేస్తున్నట్టు సమాచారం.తిరుపతిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లకు పెద్దగా డిమాండ్‌ కనిపించలేదు. అఽధికార పార్టీ నేతలు కొందరు రంగంలోకి దిగి ఓటుకు రూ. 2 వేల వంతున పంపిణీని ముగించేసినట్టు తెలిసింది. అదే సమయంలో టీడీపీ ,జనసేన వర్గాలు ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేయనున్నట్టు శనివారం ఉదయం నుంచీ ప్రచారమైతే జరిగింది కానీ పంపిణీ మాత్రం చేయలేదని సమాచారం. చంద్రగిరికి సంబంధించి వైసీపీ వర్గాలు ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు మండలాలను మినహాయించి మిగిలిన మండలాల్లో ఓటుకు రూ. 3 వేల వంతున సీల్డ్‌ కవర్లు అందజేసినట్టు తెలిసింది.శుక్రవారం ఉదయం నుంచీ మొదలుపెట్టి శనివారం మధ్యాహ్నానికే పని పూర్తి చేసినట్టు సమాచారం. టీడీపీ విషయానికొస్తే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు కొందరు ముఖ్యనేత వద్దకు వెళ్ళి డబ్బు పంచాల్సిన అవసరం లేదని, తామంతా మూకుమ్మడిగా టీడీపీకే ఓటు వేస్తామని నమ్మబలికినట్టు ప్రచారమవుతోంది. దీన్ని నమ్మి ముఖ్యనేత డబ్బు పంపిణీ వైపు దృష్టి పెట్టలేదని తెలిసింది. అయితే మరికొందరు నాయకులు జోక్యం చేసుకుని సరికాదని చెప్పడంతో ఎట్టకేలకు రూ. 2 వేల వంతున పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తమకు ఓటు వేస్తారని నమ్మకమున్న వారిని మాత్రమే వైసీపీ నేతలు కలుస్తున్నారని, అలాంటి వారికి మాత్రమే ఓటుకు రూ. 2 వేల చొప్పున ముట్టుజెపుతున్నట్టు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ నేతలు మాత్రం ఉద్యోగులందరినీ కలసి ఓట్లు అభ్యర్థించడంతో పాటు రూ. 2 వేల చొప్పున అందరికీ పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది.వెంకటగిరిలో ఇరు పార్టీల నాయకులూ ఓటర్లను కలసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వైసీపీ రూ. 2500 చొప్పున నగదు పంపిణీ చేయగా టీడీపీ రూ. 2 వేల చొప్పున ఇస్తున్నట్టు సమాచారం. అయితే తీసుకునే వారికే ఇస్తున్నారు తప్ప ఎవరినీ బలవంతపెట్టడం లేదని చెబుతున్నారు.

గూడూరులో ఫోన్‌ అభ్యర్థనలు

గూడూరు నియోజకవర్గంలో ఇరు పార్టీల నాయకులూ ఉద్యోగులకు ఫోన్లు చేసి తమకు అనుకూలంగా ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారు తప్పితే ప్రలోభాల జోలికి వెళ్ళడం లేదని సమాచారం.పోలింగ్‌కు వెళ్ళడానికి వాహనాలు అవసరమైతే సమకూరుస్తామని మాత్రం చెబుతున్నట్టు తెలిసింది.సూళ్ళూరుపేటలో అయితే రెండు పార్టీల తరపునా ఎవరూ ఉద్యోగులను ఓటడగడం లేదని సమాచారం. ఎలాగూ తమకు ఓటు వేయరన్న భావనతో వైసీపీ నేతలు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్ల వైపు దృష్టి పెట్టలేదని తెలిసింది. అదే సమయంలో ఎలాగూ తమకే ఓటు వేస్తారు కదా అన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు కూడా ఉద్యోగులను టచ్‌ చేయలేదని సమాచారం.

సత్యవేడులో ఇండిపెండెంట్‌ అభ్యర్థుల బేరసారాలు

సత్యవేడు నియోజకవర్గంలో పరిస్థితి తారుమారుగా వుంది. ఇక్కడ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్ల మద్దతు కోసం టీడీపీ, వైసీపీ రెండూ పట్టించుకోకపోవడం గమనార్హం. వైసీపీ నేతలు తాము అడిగినా ఉద్యోగులు ఓటు వేయరని, డబ్బు ఇచ్చినా ప్రయోజనం వుండదని భావించి ఉద్యోగులకు దూరంగా వున్నట్టు తెలిసింది. వైసీపీ వారు డబ్బిచ్చినా ఉద్యోగులు ఓటేసేది తమకేనన్న ధీమాతో టీడీపీ నేతలు సైతం పట్టించుకోవడం లేదని ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా బరిలో వున్న ఇద్దరు అభ్యర్థులు మాత్రం ఓటుకు రూ. 2 వేల చొప్పున పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లతో బేరసారాలు ఆడుతున్నట్టు సమాచారం.

Updated Date - May 05 , 2024 | 12:27 AM