Share News

పెన్షన్‌దారులతో జగనన్న రాక్షస క్రీడ

ABN , Publish Date - May 03 , 2024 | 02:38 AM

పెన్షన్ల పంపిణీపై జగన్‌ ప్రభుత్వం పన్నిన పన్నాగం వల్ల వృద్ధులు, వికలాంగులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

పెన్షన్‌దారులతో జగనన్న రాక్షస క్రీడ
పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లె సప్తగిరి బ్యాంకు వద్ద పెన్షన్‌ కోసం పడిగాపులు

కార్వేటినగరంలో వడదెబ్బకు ఒకరి మృతి

చాలామందికి బ్యాంకుల్లో సొమ్ము పడక వెనుతిరిగిన వైనం

చిత్తూరు, మే 2 (ఆంధ్రజ్యోతి): పెన్షన్ల పంపిణీపై జగన్‌ ప్రభుత్వం పన్నిన పన్నాగం వల్ల వృద్ధులు, వికలాంగులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వచ్చిన వృద్ధులు, వికలాంగుల్లో చాలా మందికి తమ ఖాతాల్లో పెన్షన్‌ సొమ్ము జమ కాకపోవడంతో లబోదిబో మంటున్నారు. ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేస్తే వలంటీర్లు ప్రభావితం చేస్తారని ఎన్నికల సంఘం మాజీ సీఈవో రమే్‌షకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యామ్నాయంగా సరిపడా సచివాలయ ఉద్యోగులున్నా జగన్‌ ప్రభుత్వం సచివాలయాల వద్దే పెన్షన్‌ పంపిణీ చేసి, నెపం ప్రతిపక్షాల మీద నెట్టింది. ఏప్రిల్‌లో పెన్షన్‌ కోసం వెళ్లిన గుడిపాల మండలానికి చెందిన ఓ వృద్ధుడు ఎండ వేడిమి తాళలేక మరణించారు కూడా. ఈ నేపథ్యంలో టీడీపీ గట్టిగా పోరాడి ఇంటికే పెన్షన్‌ అందించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అయినా ప్రభుత్వం కుట్ర పన్ని కొందరికే ఇంటికి పంపిణీ చేసి, ఎక్కువ మందికి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. బుధవారం ఇంటింటికీ పెన్షన్లను పంపిణీ చేయగా గురువారం నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం ప్రారంభమైంది. పెన్షన్‌ సొమ్ము మీదే ఆధారపడే చాలామంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గురువారం ఉదయం నుంచే ఎండను లెక్కచేయక సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరిగారు. బ్యాంకులన్నీ గురువారం పెన్షన్‌దారులతో కిటకిటలాడాయి. చాలామంది బ్యాంకు ఖాతాలు అనేక కారణాలతో యాక్టివ్‌గా లేకపోవడం, మైన్‌సలో ఉండడంతో పెన్షన్‌ సొమ్ము ఖాతాలో పడతానే కట్‌ అయిపోయింది. దీంతో లబ్ధిదారులకు పూర్తిగా రూ.3 వేల సొమ్ము చేతికి అందలేదు. గురువారం చాలామంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్‌ సొమ్ము పడకపోవడంతో వెనుతిరిగారు.

95 శాతం పింఛను బ్యాంకుల్లో జమ

చిత్తూరు (సెంట్రల్‌), మే 2: జిల్లాలో 95శాతం పింఛను మొత్తాలను బ్యాంకుల్లో జమ చేశారు. తొలిరోజు 28 శాతం జమకాగా, రెండో రోజుకు 95 శాతం పూర్తయింది. 2,72,867 మంది లబ్ధిదారులు ఉండగా, 2,59,039 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.79.87 కోట్ల నగదును అధికారులు జమ చేశారు. లబ్ధిదారుల వద్ద ఏటీఎం కార్డులు లేకపోవడంతో నగదు తీసుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూ కట్టారు.

బోరున ఏడ్చిన మునెమ్మ..

బంగారుపాళ్యం దళితవాడకు చెందిన 80 ఏళ్ల మునెమ్మ గురువారం పెన్షన్‌ తీసుకునేందుకు సచివాలయం వద్దకు వెళ్లింది. పెన్షన్‌ సొమ్ము బ్యాంకులో పడిందని సచివాలయ సిబ్బంది చెప్పడంతో ఊత కర్ర సాయంతో బంగారుపాళ్యంలోని ఎస్‌బీఐ వద్దకు చేరుకుంది. ఆ పెద్దామె అకౌంట్‌ చెక్‌ చేసి పెన్షన్‌ సొమ్ము ఇంకా పడలేదని బ్యాంకర్లు చెప్పారు. దీంతో ఆమె బ్యాంకు ఎదుట కూర్చొని బోరున ఏడ్చేసింది. మునెమ్మకు మరో ఆధారం లేదు. ఎండను తట్టుకుని ఎలాగోలా గురువారం తిరిగింది. ఈ ఎండలకు మరోసారి తిరగలేనంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

పెన్షన్‌ కోసమెళ్లి పరలోకానికి..

కార్వేటినగరం, మే 2: మండుటెండలో పెన్షన్‌ కోసం కాలినడకన పద్మసరస్సు గిరిజన కాలనీ నుంచి కార్వేటినగరం వెళుతూ వడదెబ్బ తగిలి గోపాలయ్య(70) మృతిచెందాడు. కార్వేటినగరం గ్రామ పంచాయతీ పద్మ సరస్సు గిరిజన కాలనీకి చెందిన గోపాలయ్య మామిడి తోటలలో కాపలాదారుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం పింఛన్‌ తీసుకోవడానికి కాలినడకన కార్వేటినగరానికి బయలుదేరాడు. ఎండ ఎక్కువగా ఉండడంతో మార్గంమధ్యలో వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. పెన్షన్‌ కోసం కార్వేటినగరం వెళ్లాడని భావించిన కుటుంబ సభ్యులు సాయంత్రం వరకు పట్టించుకోలేదు. పొద్దుపోయినా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి వెతకడం ప్రారంభించారు. గుర్తించే సమయానికి ఆయన మృతిచెంది ఉన్నాడు. ఆయన భార్య ఇప్పటికే మృతిచెంది ఉండడం, పెద్ద దిక్కు చనిపోవడంతో కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. పెన్షన్‌ ఇంటి వద్దనే అందించి ఉంటే నాన్న బతికి ఉండేవారని, ఈ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన పిల్లలు మండిపడ్డారు. పింఛన్లు ఇంటి వద్దే అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల కమిషన్‌ సూచించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే గోపాలయ్య మృతి చెందాడని గ్రామస్తులు అన్నారు.

తిరుపతి జిల్లాలో సగంమందికీ అందని పెన్షన్లు

తిరుపతి, మే 2 (ఆంధ్రజ్యోతి): సామాజిక భద్రతా పెన్షన్లు జిల్లాలో సగంమందికి కూడా అందలేదు. జిల్లాలోని 2,70,390మంది పెన్షనర్లకు నెలవారీ రూ. 80.48 కోట్లు పంపిణీ కావాల్సి వుంది. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన ఈ మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్టు ప్రకటించింది. ఇందులో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ విధానంలో ఆఽధార్‌ కార్డు బ్యాంకు ఖాతాలకు లింకైన 2,00,868మందికి నేరుగా వారి ఖాతాలకు నగదు జమ చేసినట్టు ప్రకటించింది. మిగిలిన 69,522 మందికి రూ. 20.21 కోట్లు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ళ వద్దనే పంపిణీ చేస్తామని ప్రకటించింది.బుధవారం 53,206 మందికి, గురువారం 64506 మందికి మొత్తం రూ. 18.79 కోట్లు పంపిణీ చేసినట్టు జిల్లా యంత్రాంగం ప్రకటన జారీ చేసింది.బ్యాంకు ఖాతాల్లో పెన్షన్‌ నగదు జమ చేసినట్టు అధికారులు ప్రకటించడంతో ఖాతాలు కలిగిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎండన పడి బ్యాంకులకు పరుగులు తీశారు.అయితే కొద్దిమందికి మాత్రమే నగదు ఖాతాల్లో జమైంది. ఎక్కువ శాతం మందికి జమ కాలేదని సిబ్బంది చెప్పడంతో ఇళ్ళకు పోయి మళ్ళీ రావడం ఎందుకని మధ్యాహ్నం వరకూ బ్యాంకుల వద్దే పడిగాపులు కాయడం కనిపించింది. ఖాతాల్లో జమ కాలేదని తెలిసి కొందరు, ఇళ్ళ వద్దకు వచ్చి ఇస్తారని తెలియక కొందరు ఇలా పలువురు సచివాలయాలకు కూడా వెళ్ళి వాకబు చేయడం కనిపించింది. సచివాలయాల్లో సిబ్బంది తమ దగ్గరున్న లిస్టులు పరిశీలించి కొందరిని తిరిగి బ్యాంకులకు పంపుతుండగా మరికొందరిని ఇళ్ళకు వెళ్ళండి తామే వచ్చి ఇస్తామని చెప్పి పంపుతున్నారు.

బ్యాంకుల్లో సవాలక్ష సమస్యలు

బ్యాంకుల్లో నగదు కాని వారి సమస్య ఒకలా వుండగా నగదు జమైన వారి సమస్యలు రెండింతలు కనిపిస్తున్నాయి. పలువురు లబ్ధిదారుల ఖాతాలు యాక్టివ్‌గా లేవు. నెలల తరబడీ లావాదేవీలు జరపకపోవడంతో చాలావరకూ ఫ్రీజ్‌ అయ్యాయి. వాటిని తిరిగి యాక్టివ్‌ చేసి ఆపరేట్‌ చేయడానికి బ్యాంక్‌ పాస్‌ బుక్‌,ఆధార్‌ కార్డుల జిరాక్స్‌ ప్రతులు ఇవ్వాల్సి వస్తోంది.ఆ పని పై ఒకటికి రెండు సార్లు బ్యాంకులకు తిరగాల్సి వస్తోంది. మరోవైపు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్‌ లేనివారికి ఆ వ్యవధికి తగ్గట్టు నెలకు రూ. 15 చొప్పున పెన్షన్‌ నగదులో ఆటోమేటిగ్గా కట్‌ అయిపోతోంది.

పెరుమాళ్ళపల్లి వృద్ధురాలికి హోసూరులో పెన్షన్‌ జమ

తిరుపతి రూరల్‌ మండలం పెరుమాళ్ళపల్లి పంచాయతీలోని లక్ష్మిచెరువు గ్రామానికి చెందిన ఈమె పేరు లక్ష్మి. చెర్లోపల్లిలోని కెనరా బ్యాంకులో పెన్షన్‌ డబ్బులు తీసుకుందామని వెళ్ళి వాకబు చేస్తే ఇంకా జమ కాలేదని చెప్పారు. దాంతో పడుతూ లేస్తూ సచివాలయం దారి పట్టింది. అక్కడ విచారిస్తే పెన్షన్‌ తమిళనాడు రాష్ట్రం హోసూరులోని తమిళనాడు గ్రామీణ బ్యాంకు ఖాతాలో జమైందని చెప్పడంతో ఆమె ఖంగుతింది. తాను గతంలో హోసూరులో నివాసం వున్నామని, అయితే అక్కడ తనకు బ్యాంకు అకౌంట్‌ వుందన్న సంగతి కూడా తెలియదని, ఇపుడు పెన్షన్‌ డబ్బు కోసం అంత దూరం వెళ్ళి రావాలా అంటూ వాపోయింది.

ఎప్పుడు పడితే అప్పుడొచ్చి తీసుకోమంటున్నారు!: సుబ్బయ్య, ఎర్రమరెడ్డిపాలెం, రేణిగుంట మండలం

తూకివాకం పంచాయతీ ఎర్రంరెడ్డి పాలెం నుంచీ పెన్షన్‌ తీసుకుందామని ఎండనపడి వచ్చా. తీరా వస్తే అకౌంట్లో పెన్షన్‌ పడలేదని చెప్పారు. మళ్ళా ఎప్పుడు రమ్మంటారని అడిగితే చెప్పడం లేదు. ఎప్పుడు అకౌంట్లో డబ్బు పడితే అప్పుడొచ్చి తీసుకో అని చెబుతున్నారు. సరిగా సమాధానం చెప్పేవారే లేరు. ఎన్నిసార్లు తిరగాలో ఏమో...

బ్యాంకులో పడలేదు... సచివాలయంలోనూ ఇవ్వడంలేదు! : రామయ్య, సి.మల్లవరం, తిరుపతి రూరల్‌ మండలం

నా వయసు 83 ఏళ్ళు. చెర్లోపల్లి బ్యాంకులో పెన్షన్‌ పడిందేమోనని అడిగితే ఇంకా పడలేదన్నారు. దాంతో మల్లవరం సచివాలయానికి వచ్చి అడిగాము. ఇంకా లిస్టు రాలేదని చెబుతావుండారు. బ్యాంకులో పడుతుంది... మళ్ళా చెక్‌ చేసుకోండి... పడకపోతే మేమే ఇంటికి వచ్చి ఇస్తామని చెబుతా వుండారు. అంతా అయోమయంగా వుంది. ఎండకు తిరగల్లంటే ఇబ్బందిగా వుంది.

Updated Date - May 03 , 2024 | 02:38 AM