Share News

జిల్లాకు, పలమనేరుకు ఒక్క హామీ ఇవ్వని జగన్‌

ABN , Publish Date - May 05 , 2024 | 12:13 AM

సాధారణంగా సీఎం ఓ ప్రాంతానికి వస్తున్నారంటే స్థానిక సమస్యల పరిష్కారానికి కొన్ని హామీలిస్తారని ప్రజలు ఆశిస్తారు..కానీ మన సీఎం జగన్‌ మాత్రం ఎక్కడికెళ్లినా చంద్రబాబే లక్ష్యంగా విమర్శలు, నిందలు. అంతకుమించి ఇంకేం ఆశించకూడదు..

 జిల్లాకు, పలమనేరుకు ఒక్క హామీ ఇవ్వని జగన్‌

చిత్తూరు, మే 4 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా సీఎం ఓ ప్రాంతానికి వస్తున్నారంటే స్థానిక సమస్యల పరిష్కారానికి కొన్ని హామీలిస్తారని ప్రజలు ఆశిస్తారు..కానీ మన సీఎం జగన్‌ మాత్రం ఎక్కడికెళ్లినా చంద్రబాబే లక్ష్యంగా విమర్శలు, నిందలు. అంతకుమించి ఇంకేం ఆశించకూడదు.. ఆ మధ్య పూతలపట్టులో జరిగిన బస్సు యాత్ర సందర్భంగా కూడా జిల్లాకు, నియోజకవర్గానికి ఏ చిన్న హామీ ఇవ్వకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి రెండోసారి జిల్లాకు వచ్చారు. ఈసారైనా జిల్లాకు, నియోజకవర్గానికి ఏదైనా హామీ ఇస్తారని ప్రజలు ఆశించారు. శనివారం పలమనేరులో జరిగిన బహిరంగ సభ కూడా అలాగే సాగింది. ఎక్కడా జిల్లా, నియోజకవర్గ ప్రస్తావన తీసుకురాలేదు. ఆయన ప్రసంగం 25 నిమిషాల పాటు సాగింది. చంద్రబాబును విమర్శించేందుకు ఎక్కువ సమయాన్ని వాడేశారు. గత ఎన్నికల సమయంలో 2018 ప్రారంభంలో జగన్‌ ప్రతిపక్ష నేతగా జిల్లాలో పాదయాత్ర చేశారు. చిత్తూరులోని విజయా డెయిరీని, షుగర్‌ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తానని హామీనిచ్చారు. అలాగే జిల్లాకు హంద్రీనీవా నీళ్లు తెస్తానని, జీడీనెల్లూరు నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం, డిగ్రీ కాలేజీ ఏర్పాటు వంటి అనేక హామీలు ఇచ్చారు. ఈ ఐదేళ్లలో వాటిలో ఒక్కటీ అమలు చేయలేకపోయారు. డెయిరీని మాత్రం అమూల్‌కు కట్టబెట్టేసి ఇదే పునరుద్ధరణ అన్నారు. గత హామీలను అమలు చేయలేకపోయిన జగన్‌ ఈసారి కొత్తవి ఎందుకులే అనుకున్నారేమో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏదో వచ్చామా.. వెళ్లామా.. అన్నట్లు సాగింది సీఎం పర్యటన. అలాగే గత ఎన్నికల ప్రచార సమయంలో పలమనేరులో పర్యటించిన సీఎం జగన్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ కూడా నియోజకవర్గ అభివృద్ధికి హామీలిచ్చారు. ఆయన కూడా ఒక్క హామీని అమలు చేయలేకపోయారు.

Updated Date - May 05 , 2024 | 12:13 AM