Share News

ఉద్యోగులూ... ఇది మీ రోజు

ABN , Publish Date - May 05 , 2024 | 12:20 AM

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను ఈ ఐదేళ్ల పాటు ఏ స్థాయిలో వేధించిందో తెలిసిందే. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో వేధించలేదంటే అతిశయోక్తి కాదు.

ఉద్యోగులూ... ఇది మీ రోజు

చిత్తూరు, మే 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను ఈ ఐదేళ్ల పాటు ఏ స్థాయిలో వేధించిందో తెలిసిందే. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో వేధించలేదంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడెప్పుడు తమకంటూ ఓ రోజు వస్తుందని వారంతా వేచి చూశారో.. ఆ రోజు రానే వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ రూపంలో వినియోగించుకునేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆదివారం అవకాశం కల్పించింది. జిల్లాలో 16,571 మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం ఉండగా, ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఉద్యోగులను గొంతెత్తకుండా చేసి..

సీపీఎస్‌ రద్దు హామీని గుర్తు చేశారు.. పీఆర్సీ తక్కువ ఉందని అడిగారు.. పీఎఫ్‌ రుణాలు మంజూరు కావడం లేదని నిరసనలు చేశారు.. పదవీ విరమణ తర్వాత అందే బెనిఫిట్స్‌ కోసం ప్రాధేయపడ్డారు.. వీటిలో దేన్నీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పరిష్కరించలేదు. ఉద్యోగులు నిరసనలకు అడుగు బయట పెట్టకుండా గృహ నిర్బంధాలు చేశారు. రోడ్డెక్కితే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ముందస్తు నోటీసులిచ్చి ఇళ్లకే పరిమితం చేశారు. ఉపాధ్యాయులు నిరసనల్లో పాల్గొనకుండా తరగతి గదుల్లో పోలీసులు కాపలా ఉన్నారు. ఇలా ఉద్యోగ, ఉపాధ్యాయులను వైసీపీ ప్రభుత్వం బాగా వేధించింది. చివరికి ఒకటో తేదీన జీతం కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. మెరుగైన పీఆర్సీ కోసం గొంతెత్తిన ఉద్యోగులు ఇప్పుడు ఒకటో తేదీన జీతం పడితే చాలనుకునే దశకు చేరుకున్నారు. జిల్లాలోని అన్ని శాఖల్లో కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 31 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వారిలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 16,571 మంది ఆదివారం పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోనున్నారు. మెరుగైన పీఆర్సీ కోసం, సీపీఎస్‌ రద్దు కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక ఉద్యమాలు చేశారు. వారిని పోలీసులు ఎప్పటికప్పుడు అణగదొక్కారు. 2,750 మందికి నిరసనల్లో పాల్గొనవద్దని పోలీసులు నోటీసులిచ్చారు. పలు సందర్భాల్లో సుమారు 2,400 మందిని గృహ నిర్బంధాలు చేశారు. 210 మంది ఉద్యోగులను బైండోవర్‌ చేశారు.

Updated Date - May 05 , 2024 | 12:20 AM