Share News

Wholesale Inflation: 13 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం.. భారీగా పెరుగుతున్న నిత్యావసర ధరలు

ABN , Publish Date - May 15 , 2024 | 08:28 PM

భారత్‌లో టోకు ద్రవ్యోల్బణం(Wholesale Inflation) రోజురోజుకీ పెరిగిపోతోందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టోకు ధర సూచిక(Wholesale Price Index) ప్రకారం.. మార్చిలో 0.53 శాతం టోకు ద్రవ్యోల్బణం పెరగ్గా.. ఏప్రిల్‌కి వచ్చే సరికి 13 నెలల గరిష్ఠానికి చేరుకుని.. 1.26 శాతం వద్ద నిలిచింది.

Wholesale Inflation: 13 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం.. భారీగా పెరుగుతున్న నిత్యావసర ధరలు

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో టోకు ద్రవ్యోల్బణం(Wholesale Inflation) రోజురోజుకీ పెరిగిపోతోందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టోకు ధర సూచిక(Wholesale Price Index) ప్రకారం.. మార్చిలో 0.53 శాతం టోకు ద్రవ్యోల్బణం పెరగ్గా.. ఏప్రిల్‌కి వచ్చే సరికి 13 నెలల గరిష్ఠానికి చేరుకుని.. 1.26 శాతం వద్ద నిలిచింది. వరుసగా రెండు నెలలపాటు ద్రవ్యోల్బణం పెరగడానికి వివిధ కారణాలు చెబుతున్నారు ఆర్థిక వేత్తలు. ఆహార పదార్థాలు ముఖ్యంగా కూరగాయల ధరలు పెరగడం, ఇంధన, విద్యుత్ ధరలు కూడా పెరగడం టోకు ద్రవ్యోల్బణానికి దారి తీసిందని వారు వెల్లడిస్తున్నారు.

డబ్ల్యూపీఐ ప్రకారం.. గతేడాది ఏప్రిల్‌లో 0.79 టోకు ద్రవ్యోల్బణం నమోదుకాగా.. ఈ ఏడాది మార్చిలో 0.53 శాతంగా ఉంది. "2024 ఏప్రిల్‌లో ప్రధానంగా ఆహార వస్తువులు, విద్యుత్, ముడి పెట్రోలియం, సహజ వాయువు, ఆహార ఉత్పత్తులు, తదితర వస్తువుల తయారీ మొదలైనవి ధరల పెరుగుదలకు కారణమయ్యాయి" అని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.


ఆహార పదార్థాల ధరల పెరుగుదల..

మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఆహార పదార్థాల ధరలు మార్చిలో 6.88శాతం ఉండగా ఉండగా ఏప్రిల్‌కి వచ్చేసరికి 7.74 శాతానికి పెరిగింది. అత్యధికంగా కూరగాయల ధరల్లో పెరుగుదల ఎక్కువగా ఉంది. మార్చిలో 19.52 శాతం పెరిగిన కూరగాయల ధర, ఏప్రిల్ నెలలో 23.60 శాతానికి చేరుకున్నాయి. ఇంధనం, శక్తి విభాగంలో మార్చిలో(-)0.77 శాతం నుంచి, ఏప్రిల్‌లో 1.38 శాతానికి పెరిగింది.

ఏప్రిల్‌లో WPI పెరుగుదల అదే నెల రిటైల్ ద్రవ్యోల్బణం డేటాకి విభిన్నంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన ద్రవ్య విధాన నిర్ణయాలలో ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ట స్థాయికి 4.83 శాతానికి తగ్గింది. ఆర్బీఐ ఇటీవలే చేసిన ఓ ప్రకటనలో.. ఆహార ధరలు పెరిగే ప్రమాదాన్ని గుర్తించి వరసగా ఏడోసారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. అయినా టోకు ద్రవ్యోల్బణం పెరగడం గమనార్హం.

For Latest News and Business News

Updated Date - May 15 , 2024 | 08:29 PM