Share News

Elections 2024: వైసీపీకి బిగ్ షాక్.. సొంత మనుషుల తిరుగుబాటుతో నేతల్లో ఆందోళన..

ABN , Publish Date - May 06 , 2024 | 08:58 AM

ఎన్నికల వేళ రాష్ట్రప్రజలు మొత్తం రాజకీయాలపైనే ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో నిషితంగా పరిశీలిస్తారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అది చేసే నష్టాన్ని ఊహించలేం.. ఇలాంటి అనుభవాలు ఎన్నో స్వాతంత్య్ర భారతంలో చూశాం. అందుకే రాజకీయ పార్టీలు, నాయకులు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. నిన్నటి వరకు మనవాళ్లుగా ఉన్నవాళ్లే.. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా మారిపోవచ్చు. నువ్వు సూపర్ అంటూ ప్రశంసినవాళ్లే.. వాడో వేస్ట్ అంటూ విమర్శించవచ్చు.. ఎన్నికల వేళ ఇవ్వన్నీ సాధారణ విషయాలు అయిపోయాయి.

Elections 2024: వైసీపీకి బిగ్ షాక్.. సొంత మనుషుల తిరుగుబాటుతో నేతల్లో ఆందోళన..
YSRCP

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ రాష్ట్రప్రజలు మొత్తం రాజకీయాలపైనే ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో నిశితంగా పరిశీలిస్తారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అది చేసే నష్టాన్ని ఊహించలేం.. ఇలాంటి అనుభవాలు ఎన్నో స్వాతంత్య్ర భారతంలో చూశాం. అందుకే రాజకీయ పార్టీలు, నాయకులు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. నిన్నటి వరకు మనవాళ్లుగా ఉన్నవాళ్లే.. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా మారిపోవచ్చు. నువ్వు సూపర్ అంటూ ప్రశంసినవాళ్లే.. వాడో వేస్ట్ అంటూ విమర్శించవచ్చు.. ఎన్నికల వేళ ఇవ్వన్నీ సాధారణ విషయాలు అయిపోయాయి. అధికారం, పదవి కోసం పూటకో కండువా మార్చే నాయకులను చూశాం.


ఈ ఎన్నికల్లో మాత్రం కుటుంబ సభ్యులపై సొంత మనుషులే విమర్శలు గుప్పించడం, మా వాళ్లను ఓడించాలని పిలుపునిస్తున్న ఘటనలు ఎక్కువుగా చోటుచేసుకుంటున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలున్నా.. అవి బహిర్గతం అయ్యేవి కాదు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు రాజకీయంశాలుగా మారిపోయాయి. దీంతో నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేసేవాళ్లపై సొంత కుటుంబ సభ్యులు విమర్శలు చేస్తుండటంతో నాయకులు ఇబ్బందులు పడుతున్నారంట.


ముఖ్యంగా అధికార వైసీపీ నేతలే ఇలాంటి సమస్యలను ఎక్కువుగా ఎదుర్కొంటున్నారు. రాష్ట్రస్థాయిలో పేరుండి, మంత్రులుగా ఉన్నవాళ్లపై కుటుంబ సభ్యులు విమర్శలు చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీలకు మద్దతు పలుకుతుండటం అధికార వైసీపీకి నష్టం కలిగించే అంశమనే చర్చ జరుగుతోంది. సొంత కుటుంబ సభ్యులతోనే సఖ్యత లేనప్పుడు ప్రజలకు ఏం సేవ చేస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జగన్‌ అవినీతి వల్లే పోలవరం జాప్యం!


డిప్యూటీ సీఎంపై కుమారుడు..

ఉమ్మడి విశాఖ జిల్లా మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం అనకాపల్లి నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. దీంతో మాడుగుల నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు కుమార్తె ఈర్లే అనురాధకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం బూడి ముత్యాలనాయుడు కుమారుడు బూడి రవికుమార్ తన తండ్రిని ఓడించాలంటూ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. సొంత కొడుకుకు న్యాయం చేయలేనివారు ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరు..? ఆలోచించి ఓటు వేయండంటూ రవికుమార్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి.


మా నాన్న బూడి ముత్యాలనాయుడిని ఓడించాలంటూ అనకాపల్లి లోక్‌సభ పరిధిలో రవికుమార్ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల వేళ కుటుంబ తగదాలు రాజకీయాంశంగా మారడం, సొంత కొడుకుని పట్టించుకోని వ్యక్తి ప్రజలను ఏం పట్టించుకుంటారంటూ విపక్షాల నుంచి విమర్శలు వస్తుండటం బూడి ముత్యాలనాయుడికి కొంత మైనస్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. బూడి ముత్యాలనాయుడుపై కుమారుడు రవికుమార్ తిరుగుబాటు వైసీపీకి నష్టం చేస్తుందనే ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

Budi Ravikumar Poster.jpg


ముద్రగడపై కుమార్తె..

మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి తన తండ్రిపై తిరుగుబాటు చేశారు. పవన్ కళ్యాణ్‌ను ఓడించాలని ముద్రగడ ప్రచారం చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. పవన్‌ కళ్యాణ్‌ను తిట్టడానికే ముద్రగడను వైసీపీలో చేర్చుకున్నట్లు ఉందని ఆరోపించారు. ఇదే సమయంలో తన తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాను పవన్ కళ్యాణ్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్‌ను పిఠాపురంలో ఓడించి.. ఇక్కడి నుంచి తన్ని తరిమేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ చేసిన ఛాలెంజ్‌ ఆశ్చర్యం కలిగించిందని ముద్రగడ కుమార్తె క్రాంతి తెలిపారు.


ముద్రగడ చేసిన ఛాలెంజ్ తమ కుటుంబ సభ్యులకే కాదని, ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదన్నారు. మరోవైపు క్రాంతి పవన్ కళ్యాణ్‌ను కలిసి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా.. ముద్రగడ అభిమానులను ఆలోచనలో పడేసింది. దీంతో ముద్రగడ పద్మనాభం చేరికతో వైసీపీకి ఎంత ప్రయోజనమనేది పక్కన పెడితే.. ముద్రగడ కుమార్తె తిరుగుబాటు మాత్రం వైసీపీకి నష్టం చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.


మంత్రి అంబటిపై అల్లుడు..

సత్తెనపల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అంబటి రాంబాబు మనిషే కాదని, శవాల మీద పేలాలు ఏరుకునే రకం అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. అంబటి రాంబాబు అల్లుడ్ని కావడం నా దురదృష్టకరం.. ఆయనంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నా జీవితంలో చూడలేదు. రోజూ దేవుడికి దండం పెట్టుకొనేటప్పుడు ఇంతటి నీచుడ్ని ఇంకోసారి నా జీవితంలో ఇంట్రడ్యూస్ చేయకుస్వామి అని మొక్కుకుంటానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


అల్లుడు వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నా కుమార్తె, అల్లుడు ఇద్దరూ డాక్టర్లని, వారు రాజకీయాల్లో లేరన్నారు. డాక్టర్ గౌతమ్ వ్యాఖ్యలను తాను పట్టించుకోనని తేల్చేశారు. తన కుమార్తు, అల్లుడు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని, ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉందన్నారు. నా అల్లుడు మాత్రమే మాట్లాడితే తాను స్పందించేవాడిని కాదని, ఆయన మాటల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారంటూ అంబటి రాంబాబు ఆరోపించారు. ఏది ఏమైనా అంబటి రాంబాబుపై డాక్టర్ గౌతమ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయదుమారాన్ని రేపుతున్నాయి.


ఏపీలో కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు రాజకీయాంశాలుగా మారడంతో ప్రత్యర్థులకు ఇది ప్రచారస్త్రంగా మారింది. సొంత కుటుంబ సభ్యులనే చూసుకోని వ్యక్తులు.. ప్రజలను ఏమి ఉద్దరిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల వేళ ఈ ఘటనలు వైసీపీకి నష్టం కలిగిస్తాయా.. ఒకవేళ నష్టం చేస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది జూన్4 తర్వాత తేలనుంది.


AP Elections: జగన్‌ను ఎలా నమ్మాలి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సూటి ప్రశ్న!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - May 06 , 2024 | 09:20 AM