Share News

సత్తెనపల్లిలో అంబటి ఎదురీత!

ABN , Publish Date - May 06 , 2024 | 05:02 AM

పోరాటాల గడ్డ పల్నాడు జిల్లా సత్తెనపల్లి. స్వాతంత్య్ర సమరయోధులు, సంస్కరణోద్యమకారులకు పుట్టిల్లు. గాంధేయవాది వావిలాల గోపాలగోపాలకృష్ణయ్య, ఆమంచి నరసింహారావు వంటి ప్రముఖులు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని, జైలు శిక్ష అనుభవించారు.

సత్తెనపల్లిలో అంబటి ఎదురీత!

పోరాటాల గడ్డ పల్నాడు జిల్లా సత్తెనపల్లి. స్వాతంత్య్ర సమరయోధులు, సంస్కరణోద్యమకారులకు పుట్టిల్లు. గాంధేయవాది వావిలాల గోపాలగోపాలకృష్ణయ్య, ఆమంచి నరసింహారావు వంటి ప్రముఖులు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని, జైలు శిక్ష అనుభవించారు. మాజీ సీఎం భవనం వెంకట్రామ్‌ ఈ నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్లలోనే పుట్టారు.

వావిలాల 1952,55,62,67ల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక్కడ నుంచి 2014లో విజయం సాధించిన కోడెల శివప్రసాదరావు నవ్వాంధ్ర తొలి శాసనసభాపతిగా పనిచేశారు. 2019లో ఆయనపై గెలుపొందిన వైసీపీ సీనియర్‌ నేత అంబటి రాంబాబు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.

టీడీపీ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగడంతో ఈసారి ఇక్కడ రాజకీయం ఆసక్తిగా మారింది. పలు అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అంబటి రాంబాబు తాజా ఎన్నికల్లో ఎదురీదుతున్నారు.

కన్నా స్థానికేతరుడే అయినా.. కాంగ్రె్‌సలో సీనియర్‌ నేత. గతంలో పెదకూరపాడు, గుంటూరు పశ్చిమల్లో గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. సత్తెనపల్లితో కొద్దో గొప్పో సంబంధాలు ఉన్నాయి. 2019లో నరసరావుపేట ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. గత ఏడాది టీడీపీలో చేరారు. ఆయన్ను చంద్రబాబు సత్తెనపల్లి ఇన్‌చార్జిగా ప్రకటించారు.

నాటి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. అన్ని వర్గాలతో మమేకమై.. టీడీపీకి దూరమైన వర్గాలను తిరిగి పార్టీలోకి తీసుకురావడంలో విజయం సాధించారు. వైసీపీలోని అసంతుష్టులను కూడా పార్టీలోకి చేర్చుకుని.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

  • అంబటిపై కీలక నేతలు గుర్రు

అంబటి సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ప్రతి మండలంలో సొంత మనుషులను ఏర్పాటు చేసుకొని పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలను దూరంగా పెట్టారు. ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించి తన సొంత వ్యక్తుల ద్వారా వసూళ్లు చేస్తున్నారు. సీఎం సహాయ నిధి కింద వచ్చిన సాయంలోనూ సగం వసూలు చేయడం కలకలం రేపింది.

సంక్రాంతి సంబరాలకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఇక గనుల అక్రమ తవ్వకాల ఆరోపణలు ఎన్నో. సత్తెనపల్లిలో కూడా వసూళ్లు సాగించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆర్యవైశ్యులు వైసీపీకి దూరమయ్యారని ప్రచారం జరుగుతోంది.


జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై అనుచిత ఆరోపణల కారణంగా సొంత సామాజిక వర్గంలో కూడా వ్యతిరేకత వచ్చిందని, రెడ్డి సామాజికవర్గం నేతలు పైకి అంబటికి మద్దతిస్తున్నా.. పరోక్షంగా ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని అంటున్నారు.

ఈ సామాజిక వర్గానికి చెందిన పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అంబటిపై ఉన్న వ్యతిరేకత తనకు నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆందోళన చెందుతున్నారు.

- నరసరావుపేట, ఆంధ్రజ్యోతి.

కన్నా బలాలు..

గతంలో మంత్రిగా అందించిన సేవలు. జనసేన, ఎమ్మార్పీఎస్‌ మద్దతు. వైసీపీకి దూరంగా ఉంటున్న సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవడం. టీడీపీ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, డాక్టర్‌ కోడెల శివరాం, మల్లిని కూడా కలుపుకొని వెళ్లడం.

బలహీనతలు..

స్థానికేతరుడు.

వైవీ, కోడెల వర్గాల్లో

కొంత అసంతృప్తి.

అంబటి బలాలు..

మంత్రిగా అర్థ, అంగబలాలు మెండుగా ఉండడం. వైసీపీ నాయకత్వం మద్దతు.

ప్రతికూలతలు..

నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో విఫలం. విచ్చలవిడి అవినీతి, అక్రమాలు. జలవనరుల మంత్రిగా రైతులకు మేలు చేయకపోవడం. సాగర్‌ కాలువలు మరమ్మతులు చేయకపోవడంతో అన్నదాతల్లో ఆగ్రహం.. సొంత పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకత.

నియోజకవర్గ స్వరూపం

(సత్తెనపల్లి మున్సిపాలిటీ, రూరల్‌, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాలు)

మొత్తం ఓటర్లు 2,42,047

పురుషులు 1,18,400

మహిళలు 1,23,635

ట్రాన్స్‌జెండర్లు 12

కీలక సామాజిక వర్గాలు

కమ్మ-32 వేలు, ముస్లింలు-28 వేలు, మాదిగ-27 వేలు, కాపులు-19 వేలు, రెడ్లు-18 వేలు, యాదవ-15 వేలు,

మాల-13 వేలు, ఆర్యవైశ్య-7 వేలు,

వడ్డెర-9 వేలు, రజక-7 వేలు.

Updated Date - May 06 , 2024 | 05:02 AM