ఏపీలో ZPTC, MPTC స్థానాల ఓట్ల లెక్కింపు.. మినిట్ టూ మినిట్

ABN , First Publish Date - 2021-11-18T14:29:43+05:30 IST

10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్లను ఇవాళ లెక్కిస్తున్నారు...

ఏపీలో ZPTC, MPTC స్థానాల ఓట్ల లెక్కింపు.. మినిట్ టూ మినిట్

రాజధాని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఎదురుదెబ్బ (12:50 PM)

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ వెలువడుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగిరింది. వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్వగ్రామాల్లో సైతం టీడీపీ జెండా ఎగరడం గమనార్హం. ఇప్పటికే సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇదే జరగ్గా.. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీటయ్యింది.


రాజధాని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంత నియోజకవర్గంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఫిరంగిపురం మండలంలో రెండు ఎంపీటీసీ స్థానాలుండగా.. ఈ రెండు చోట్లా టీడీపీ జెండా ఎగిరింది. ఈ రెండు స్థానాలను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసుకున్నప్పటికీ ఏ మాత్రం వారి ప్రయత్నాలు ఫలించలేదు. గుండాలపాడులో 457 ఓట్లు మెజారిటీ, వేమవరం 93 ఓట్ల మెజారిటీ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాగా.. రాజధాని నియోజకవర్గంలో రెండు స్దానాల ఓటమితో వైసీపీ డీలపడినట్లయ్యింది. ఈ ఓటమితో వైసీపీ పెద్దల నుంచి శ్రీదేవికి ఫోన్లు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఓటమిపై శ్రీదేవి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.


126 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపు.. (12:31 PM)

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొజ్జిరియా ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైసీపీ తరఫున పోటీచేసిన కె. దాసరధారవు 126 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరోవైపు ఇదే జిల్లా నుంచి కొత్తూరు మండలం దిమిలి ఎంపీటీసీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన గూడ కళావతమ్మ 125 మెజార్టీతో గెలుపొందారు.


482 ఓట్ల మెజార్టీతో జనసేన గెలుపు.. (12:21 PM)

పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కె. కుముదవల్లి ఎంపీటీసీ స్థానాన్ని జనసేన కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థిపై జనసేన తరఫున పోటీచేసిన పిండి గోవిందరావు 482 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. కాగా గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల జనసేన-టీడీపీ కలిసి పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలోనూ ఓ స్థానంలో జనసేన గెలిచింది.


102 ఓట్లతో దుర్గాసి గెలుపు.. (12:18 PM)

విజయనగరం జిల్లా గుర్ల మండలం నాగుల వలస ఎంపీటీసీ స్థానంలో టీడీపీ గెలిచింది. వైసీపీ అభ్యర్థిపై 102  మెజార్టీతో దుర్గాసి కోటేశ్వరరావు గెలుపొందారు. ఇదే జిల్లా నుంచి రామభధ్రపురం మండలం బూసాయివలస టీడీపీ ఎంపీటీసీ అభ్యర్ధి మడక స్వర్ణలత 623 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.


పశ్చిమ గోదావరిలో టీడీపీ జెండా ఎగురుతోంది.. (12:00 PM)

జిల్లాలో టీడీపీ జెండా ఎగురుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం సత్తా చాటుతోంది. ఇప్పటికే పలు స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ తాజాగా.. పోలవరం మండలం కొరుటూరు ఎంపీటీసీ స్థానంలో గెలుపొందింది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ తరఫున పోటీచేసిన అరగంటి పెంటమ్మ 429 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. పెదవేగి మండలం రామశింగవరం ఎంపీటీసీ స్థానంలోనూ టీడీపీ గెలిచి నిలిచింది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి 87 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పెదపాడు మండలం సత్యవోలు ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి 27 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే.. వైసీపీ అభ్యర్థి రీ కౌంటింగ్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ప్రస్తుతం రీ కౌంటింగ్ కొనసాగుతోంది.


కట్టా ప్రసాద్ గెలుపు.. (11:40 AM)

గుంటూరు జిల్లాలో ఎక్కువ ఎంపీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటోంది. ఇప్పటికే పలు స్థానాల్లో తెలుగుదేశం గెలవగా.. తాజాగా ఫిరంగిపురం మండలం గుండాలపాడు ఎంపీటిసీ స్థానంలోనూ గెలిచింది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ నుంచి పోటీ చేసిన కట్టా ప్రసాద్ 457 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు.


ముగిసిన కౌంటింగ్.. వైసీపీ గెలుపు.. (11:35 AM)

నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఎంపీడీవో కార్యాలయంలో అనంతమడుగు ఎంపీటీసీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు ముగిసింది. టీడీపీ అభ్యర్థి గుండిపాక చెంచు కిష్టయ్యపై 270 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి లేబాక వెంకటరమణయ్య గెలుపొందారు. కాగా ఇదే జిల్లా నుంచి బాలాయపల్లి మండలం వెంగమాంబాపురం ఎంపీటీసీ ఎన్నికల్లో 806 ఓట్లు మెజార్టీతో టీడీపీ అభ్యర్థి చెముడుగుంట చంద్రమౌళి విజయం సాధించారు. 


ఇటు 467.. అటు 345 ఓట్ల మెజార్టీతో గెలుపు.. (11:30AM) 

గుంటూరు జిల్లా వేమూరు-01 ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్ది చర్ల కామేశ్వరి 467 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు.. చావలి- 02 స్థానం నుంచి ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్ది సోమరౌతు రాజ్యలక్ష్మి 345 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు.


కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే పీఏ (11:25 AM)

గుంటూరు జిల్లా ఫిరంగిపురం ఎంపీటీసి కౌంటింగ్ కేంద్రంలోకి స్థానిక ఎమ్మెల్యే పీఏ ప్రవేశించాడు. కౌంటింగ్ కేంద్రంలోకి మీరు రావడమేంటి..? అని టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం రెండు ఎంపీటీసీ స్దానాలుకు యథావిధిగా కౌంటింగ్ కొనసాగిస్తున్నారు.


జనసేన గెలుపు.. (11:20 AM)

రాజమండ్రి మండలం కడియపులంక- 03వ ఎంపీటీసీ స్థానాన్ని జనసేన కైవసం చేసుకుంది. కానబోయిన రాఘవ 517 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జనసేన అభ్యర్థికి 1161 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి కేవలం 644 ఓట్లు మాత్రమే వచ్చాయి. తాజా ఫలితంతో కడియం మండలంలో మరోసారి పట్టు నిరూపించుకున్నది. కాగా.. ఈ స్థానం నుంచి జనసేన-టీడీపీ పొత్తు కుదుర్చుకుని పోటీ చేశాయి.


880 ఓట్లతో వైసీపీ గెలుపు.. (11:15 AM)

గుంటూరు జిల్లా రేపల్లె మండలం నల్లూరువారిపాలెం ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైసీపీ తరఫున పోటీ చేసిన గోరికపూడి దేవమణీ 880 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. దేవమణి గెలుపుతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. 


సుమిత్రమ్మ గెలుపు.. (11:10 AM)

నెల్లూరు జిల్లా కోవూరు మండలం గంగవరం ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సింగారెడ్డి సుమిత్రమ్మ 342 మెజార్టీతో గెలిచారు.


47 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి గెలుపు (11:05 AM)

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి యండ్రపల్లి నటరాజ్ 47 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఇదే జిల్లాలో ప్రత్తిపాడు మండలం నడింపాలెం -02 నుంచి ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి వెంకటేశ్వర్లు విజయం సాధించారు. బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం ఎంపీటీసీగా చిట్టెంశెట్టి శివనాగమణి 587 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.


కౌంటింగ్ కేంద్రం వద్ద వాగ్వివాదం (11:00 AM)

అనంతపురం జిల్లా చిలమత్తూరు జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎన్నికల అధికారులతో వైసీపీ నేత నాగరాజ్ యాదవ్ వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తాము కౌంటింగ్ చేస్తామని అధికారులు చెప్పగా.. దానికి ఆయనకు అంగీకరించలేదు. బూత్‌ల వారీగా లెక్కించాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు కౌంటింగ్ ఆగిపోయినట్లు తెలిసింది.


బొమ్మరాజుపల్లి ఎంపీటీసీ వైసీపీదే.. (10:45 AM)

గుంటూరు జిల్లా ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిపై కొండవర్జు వరుణ్ కుమార్ 179 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.


సత్తెనపల్లిలో నిత్య గెలుపు.. (10:35 AM)

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంకాణలపల్లి ఎంపీటీసీని వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైసీపీ తరఫున పోటీచేసిన ధర్మరాజ్ నిత్య ప్రియదర్శిని 85 ఓట్లతో గెలుపొందారు.


పెనుకొండలో టీడీపీ విజయం.. (10:25 AM)

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం రాంపురం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పద్మావతి 51 ఓట్లతో విజయం సాధించారు. మరోవైపు.. రాయదుర్గం నియోజకవర్గం చెర్లోపల్లి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి నుంచి మల్లికార్జున 315 ఓట్లతో విజయం సాధించారు.


970 ఓట్ల మెజార్టీతో గెలుపు.. (10:15 AM)

పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు ఎంపీటీసీ-05వ స్థానానికి ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. టీడీపీ అభ్యర్థిపై వైసీపీ తరఫున పోటీ చేసిన ఉన్న మట్ల విజయకుమారి 970 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.


శ్రీకాకుళంలో సుగుణ విజయం..  (09:54 AM)

శ్రీకాకుళంలో జిల్లా ఆముదాలవలస మండలం కాత్యాచార్యులపేట ఎంపీటీసీ టీడీపీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థిపై 256 ఓట్ల ఆధిక్యంలో బొడ్డేపల్లి సుగుణ గెలుపొందారు. ఇదే జిల్లాలో వీరఘట్టం-03 నుంచి ఎంపీటీసీగా పోటీచేసిన వైసీపీ అభ్యర్ధి నులకజోడు కన్మణి 899 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.


కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ (9:32 AM)

కృష్ణా జిల్లాలో పెడన, జి కొండూరు, విస్సన్నపేట జడ్పీటీసీ స్థానాలకు.. ఏడు ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్‌ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ నివాస్ ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం నాడు జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో ఈ జిల్లాలో ఒకట్రెండు చోట్ల అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవడంతో ఇవాళ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను కూడా విధించారు.


మొదటి రౌండ్‌లో టీడీపీ ఆధిక్యం (9:23 AM)

నెల్లూరు జిల్లా బాలయపల్లి మండలం వెంగమాంబాపూరం ఎంపిటిసి ఎన్నికల కౌటింగ్ ప్రారంభమైంది. మొదటి రౌండ్‌లో 250 ఓట్లతో టీడీపీ ఆధిక్యంలో ఉంది. జిల్లాలో కోట, గంగవరం, అనంతమడుగు, వెంగమాంబపురం, ఎంపీటీసీ స్థానాలకి సంబంధించి ఓట్లు లెక్కింపు జరుగుతోంది.


వైసీపీ-బీజేపీ మధ్యే పోటీ.. (9:21 AM)

కడప జిల్లా జమ్మలమడుగు నియోజక వర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. గొరిగనూరు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానానికి.. ముద్దనూరు కొర్రపాడు ఎంపీటీసీ స్థానానికి కౌంటింగ్‌ను అధికారులు ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఇక్కడ వైసీపీ, బీజేపీల మధ్యే పోటీ ఉంది.


అందరి దృష్టి పెనుగొండ కౌంటింగ్ పైనే.. (08:57 AM)

ఆంధ్రప్రదేశ్‌లో అందరి దృష్టి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌పైనే ఉంది. టీడీపీ మద్దతుతో జనసేన అభ్యర్థి పోటీచేశారు. 14 ఎంపీటీసీ స్థానాల్లోనూ కౌంటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 12గంటలకు ఫలితాలు కొలిక్కి రానున్నాయి. చాగల్లు, అత్తిలి, దెందులూరు, పోలవరం, ఇరగవరం,  కుక్కునూరు నిడదవోలు, పెరవలి, జంగారెడ్డిగూడెం, భీమడోలు ఎంపీటీసీ కార్యాలయాల్లో ఓట్లు లెక్కింపు జరుగుతోంది. కాగా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. విజయోత్సవ ర్యాలీలను పోలీసులు నిషేధించారు.


అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నాడు జరిగిన 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్లను ఇవాళ లెక్కిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఆయా ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకే ఎంపీటీసీ, మధ్యాహ్నం 12 గంటలకు జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కాగా.. 14 జడ్పీటీసీల్లో 04 ఏకగ్రీవం కాగా.. 10 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 176 ఎంపీటీసీల్లో 50 ఏకగ్రీవం కాగా.. 03 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ మిగిలిన 123 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 16న జరిగిన పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే.



Updated Date - 2021-11-18T14:29:43+05:30 IST