అది తెలిస్తే అంతా తెలిసినట్టే!

ABN , First Publish Date - 2020-02-14T06:01:23+05:30 IST

ఆధ్యాత్మికం అంటే మేధాశక్తి కాదు. ఉన్నతమైన ఆదర్శం కాదు. నైతికమైన ప్రవర్తన కాదు. నియమ నిష్ఠలు కాదు. మతపరమైన విశ్వాసాలు కాదు. ఉత్సాహంతో కూడిన భావతీవ్రత కాదు. అత్యుత్తమమైన ఈ లక్షణాల రాశి కూడా కాదు! మన అంతరంగంలో స్థిరమైన సత్యం ఒకటి ఉంది. మన మనస్సుకూ...

అది తెలిస్తే అంతా తెలిసినట్టే!

‘నేను’ కన్నా భిన్నంగా ఏదీ లేనప్పుడు, అంతా ‘నేనే’ అయినప్పుడు జీవితంలోని ద్వంద్వాలు అన్నీ అంతరించిపోతాయి. చావు పుట్టుకల అర్థం, సృష్టి- స్థితి- లయాలకు ఉన్న పరమార్థం అవగతం అవుతుంది.


ఆధ్యాత్మికం అంటే మేధాశక్తి కాదు. ఉన్నతమైన ఆదర్శం కాదు. నైతికమైన ప్రవర్తన కాదు. నియమ నిష్ఠలు కాదు. మతపరమైన విశ్వాసాలు కాదు. ఉత్సాహంతో కూడిన భావతీవ్రత కాదు. అత్యుత్తమమైన ఈ లక్షణాల రాశి కూడా కాదు! మన అంతరంగంలో స్థిరమైన సత్యం ఒకటి ఉంది. మన మనస్సుకూ, జీవశక్తికీ, దేహానికీ కూడా అది అతీతమైనది. అది మనలోనే కాదు, సకల సృష్టిలోనూ ఉంది. ఆ అతీత సత్యంతో మనం ఏకం కావాలి. సన్నిహితం కావాలి. సంయోగం కావాలి. మనలో ఉన్న ఆకాంక్షా జ్వాల అందుకోసమే! అదే ఆధ్యాత్మికం అంటే! 


నేను ఎవరిని? ఈ ప్రపంచం ఏమిటి? ఈ ప్రపంచంలోని చావు పుట్టుకలు ఎక్కడి నుంచి వచ్చాయి? పుట్టుకకు ముందు నేను ఉన్నానా? మరణం తరువాత నేను ఉంటానా? ఉంటే ఎలా ఉంటాను? ఈ చావు పుట్టుకల వలయంలోకి నేను రావడం ఎందుకు జరిగింది? ఇన్ని బాధలు పడడం ఎందుకు? ఈ జగత్తులోకి నేను రావడానికి కారణం ఏమిటి? ఏది సాధించాలని వచ్చాను? ఏం చేస్తున్నాను? చేయాల్సిందే చేస్తున్నానా? లేక తప్పటడుగులు వేస్తున్నానా? ఈ రహస్యం తెలిసేదెలా?


ఈ ప్రశ్నలు ఈనాటివి కావు. అనాదిగా మానవుణ్ణి వేధిస్తున్నవే! వీటన్నిటికీ సమాధానాలు మన మహర్షులు ఏనాడో కనుగొన్నారు. ‘‘అన్నిటికీ మూలం ‘నేను ఎవరిని?’ అనే ప్రశ్న. దీనికి సమాధానం తెలుసుకుంటే మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు వాటంతట అవే దొరుకుతాయి’’ అంటారు భగవాన్‌ శ్రీరమణ మహర్షి. అందుకే ‘‘నేనెవరిని అనేది ముందు తెలుసుకో!’’ అని చెప్పారు ఆ మహానుభావుడు. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ ‘అహం బ్రహ్మాస్మి’ అని ఒకే ఒక వాక్యంలో ‘బృహదారణ్యకోపనిషత్తు’ సమాధానం చెప్పింది. ‘అహం’ అంటే ‘నేను’. ‘బ్రహ్మ’ అంటే సర్వానికీ మూలం అయిన పరతత్త్వం. ‘అస్మి’ అంటే ‘అయి ఉన్నాను’ అని అర్థం. మనలో రెండు ‘నేను’లు ఉన్నాయి. ఒకటి అజ్ఞానంలో ఉన్న ‘నేను’. ఈ ‘నేను’కు అసలైన ‘నేను’ ఎవరో తెలీదు. మరొకటి అన్ని ‘నేను’లూ నేనైన ‘నేను’! వీటిలో మొదటిది రెండవ దాన్ని తెలుసుకొని, దానిలో ఏకమైనప్పుడు- మొదటిది తన ఉనికిని కోల్పోతుంది. అసలైన ‘నేను’ మిగులుతుంది. అదే ‘బ్రహ్మ’. ‘ఓం తద్బ్రహ్మ’ అంటుంది మంత్రపుష్పం.


ఇప్పుడు మనకు అనుభవంలో ఉన్న ‘నేను’ ఈ దేహానికే పరిమితమై, తన ఉనికిని అంతటితోనే సరిపెట్టుకుంటోంది. ‘నేను వేరు- మిగిలినవారందరూ, ఈ ప్రపంచమంతా నాకన్నా భిన్నమైనది’ అనుకుంటోంది. ఈ ‘నేను’ ఎక్కడ ఉందో అక్కడ ‘నాది’ అనేది కాచుకొనే ఉంటుంది. ఈ ‘నేను - నాది’ అనేవే అహంకార - మమకారాలు. ఇవి ఎక్కడ ఉన్నాయో అక్కడ సుఖ దుఃఖాలు, వెలుగు చీకట్లూ, ఈర్ష్య అసూయలు, పగ ప్రతీకారాలు, అభిమాన దురభిమానాలు, జయాపజయాలు... ఇలా ద్వంద్వాలన్నీ ఉంటాయి. వీటన్నిటినీ జయించేందుకే ఆధ్యాత్మిక సాధన - అంటే ఈ ‘నేను’ను ఆ ‘నేను’తో కలిపే సాధన అవసరం అవుతుంది.


అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి? దాన్ని గురించి శ్రీఅరవిందులు ఇలా చెప్పారు: ‘‘ఆధ్యాత్మికం అంటే మేధాశక్తి కాదు. ఉన్నతమైన ఆదర్శం కాదు. నైతికమైన ప్రవర్తన కాదు. నియమ నిష్ఠలు కాదు. మతపరమైన విశ్వాసాలు కాదు. ఉత్సాహంతో కూడిన భావతీవ్రత కాదు. అత్యుత్తమమైన ఈ లక్షణాల రాశి కూడా కాదు! మన అంతరంగంలో స్థిరమైన సత్యం ఒకటి ఉంది. మన మనస్సుకూ, జీవశక్తికీ, దేహానికీ కూడా అది అతీతమైనది. అది మనలోనే కాదు, సకల సృష్టిలోనూ ఉంది. దానికి ఆధారంగా కూడా ఉంది. ఆ అతీత సత్యంతో మనం ఏకం కావాలి. సన్నిహితం కావాలి. సంయోగం కావాలి. మనలో ఉన్న ఆకాంక్షా జ్వాల అందుకోసమే! అదే ఆధ్యాత్మికం అంటే! ఈ ‘నేను’ ఆ ‘నేను’ను చేరుకోవడానికి చేసే ప్రయాణమే యోగసాధన అంటే.! ఇంతవరకూ మానవుడు చేస్తున్న ఆలోచనలు అప్పుడు ఆ ‘నేను’ను కలుసుకోవడంతో ఆగిపోతాయి. ‘అహం బ్రహ్మాస్మి - నేనే బ్రహ్మను’ అని తెలుసుకోవడమే ఈ జీవితానికి సార్థకత! అదే మోక్షం!!’’ కానీ శ్రీ అరవిందుల యోగం అంతటితో సరిపెట్టుకోదు. వాస్తవానికి వారి యోగసాధన అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ‘‘దైవాన్ని తెలుసుకోవాలి. దైవంతో ఏకం కావాలి. దైవాన్ని అభివ్యక్తం చేయాలి’’ అంటారు శ్రీఅరవిందులు. 


మనం ఆ స్థితిని సాధించినప్పుడు... మనం సాధించినది మనతోనే ఆగిపోదు. ‘నేను’ అంతటా, అన్నిటా అభివ్యక్తం అవుతుంది. అనుభూతం అవుతుంది. ప్రకటితం అవుతుంది. తన వెలుగును ప్రసరిస్తుంది. అంతా తానే అయినప్పుడు ఇక తనకు వెలితి ఏముంటుంది? తనకు లేనిది కానీ, కావలసింది కానీ ఏదీ ఉండదు. అంతా నిండుగా ఉంటుంది. తన కన్నా భిన్నంగా ఏదీ లేనప్పుడు, అంతా తానే అయినప్పుడు ఈ అవినీతి, దోపిడి, నేను- నాది, గెలుపు - ఓటమి, తన - పర, అధికార లాలస, స్వార్థం, అహంకారం, ఈర్ష్య - ద్వేషం, పగ - ప్రతీకారం, ఆశ - నిరాశ వంటి ద్వంద్వాలు, మత ఛాందసాలు, ప్రాంతీయ దురభిమానాలు, భాషా వైషమ్యాలు, ఉగ్రవాదాలు, పనికిమాలిన ఇజాలు... అన్నీ అంతరించిపోతాయి. చావు పుట్టుకల అర్థం - సృష్టి - స్థితి, లయాలకు ఉన్న పరమార్థం అవగతం అవుతుంది. మనలో ఈ అవగాహనను పెంపొందించుకోవడానికి ఇకనైనా ప్రయత్నించమని చెబుతోంది బృహదారణ్యకోపనిషత్తు. 


కె. సంపూర్ణ

Updated Date - 2020-02-14T06:01:23+05:30 IST