‘మమ’ అనిపించారు

ABN , First Publish Date - 2020-09-13T10:00:33+05:30 IST

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని ఎప్పటిలాగానే మమ అనిపించారు.

‘మమ’ అనిపించారు

నివేదికలు చదవడంతోనే ముగిసిన జడ్పీ సమావేశం

గైర్హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు


హన్మకొండ టౌన్‌, సెప్టెంబరు 12: జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని ఎప్పటిలాగానే  మమ అనిపించారు. పదవులు చేపట్టి 14 నెలలు గడిచినా నిధులు లేకపోవడం, సభ్యులంతా అధికార పార్టీకి  చెందిన వారే కావడంతో సమస్యలపై గళమెత్తిన పాపాన పోలేదు. పైసా పని చేయకపోవడంతో దేని గురించి అడగాలో తెలియక అధికారులు నివేదికలు చదువుతుంటే వింటూ కూర్చుండిపోయారు. శనివారం హన్మకొండలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో చైర్మన్‌ సుధీర్‌కుమార్‌ అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ముందుగా ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి రెండు నిమిషాలు మౌనం పాటించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టి, పెరిగిన లక్నెపల్లి, వంగర గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, ఆయనకు భారతరత్న ప్రకటించాలని, కొవిడ్‌ నియంత్రణలో ఏనలేని సేవలు అందిస్తున్న పోలీస్‌, వైద్య, పారిశుధ్య సిబ్బందిని అభినందిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం జరిగిన సమావేశాన్ని చైర్మన్‌ సుధీర్‌కుమార్‌ మధ్యాహ్నం లోపు పూర్తిచేశారు. ఆయా శాఖల అధికారులను వేదికపైకి పిలిచిన చైర్మన్‌ క్లుప్తంగా ముగించాలని సూచించారు.


అధికారులు ‘కట్టెకొట్టె’ అన్నట్లుగా నివేదికలు చదివి వినిపించారు. సభ్యులు సైతం ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో చర్చించే ప్రయత్నం కూడా చేయకపోవడం విశేషం. ఒకరిద్దరు జడ్పీటీసీలు వారి ఏరియాల్లో ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గ్రామాల్లో కొవిడ్‌ పరీక్షలు పెంచాలని, మైనింగ్‌ అనుమతులతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి  ఇబ్బందులు లేకుండా రైస్‌మిల్లుకు ఒక అధికారిని నియమిస్తామన్నారు. గన్నీ బ్యాగుల కొరత ఉండకుండా చర్యలు తీసుకున్నామన్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు చేపట్టడంతో పాటు అవసరమైన చోట నూతన రోడ్లు నిర్మిస్తామని అన్నారు. మైనింగ్‌ల అనుమతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. 


డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు మాట్లాడుతూ తమ బ్యాంకు ద్వారా ఇప్పటికే  రూ.270కోట్ల పంట రుణాలు అందించామని, మరో వంద కోట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో డీసీసీబీ బ్రాంచ్‌లు 19 ఉన్నాయని, మరో 10 బ్రాంచ్‌లను పెంచుతామని అన్నారు. 


ఈ సమావేశానికి ఇద్దరు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కరు కూడా హాజరుకాలేదు. నగర ఎమ్మెల్యేలు సైతం హాజరు కాకపోవడం విశేషం. చైర్మన్‌ సుధీర్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఈవో ప్రసూనారాణి, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, జడ్పీటీసీలు వంగ రవి, పిట్టల శ్రీలత, ఎంపీపీలు మధుమతి, మేకల స్వప్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికై తొలిసారిగా మీటింగ్‌కు హాజరైన మార్నేని రవీందర్‌రావును, ఫిషరీస్‌లో డాక్టరేట్‌ పూర్తి చేసిన ధర్మసాగర్‌ జడ్పీటీసీ పిట్టల శ్రీలతను జడ్పీ చైర్మన్‌ ఘనంగా సత్కరించారు. 

Updated Date - 2020-09-13T10:00:33+05:30 IST