Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ దృశ్యాలు చూసి చలించిపోయిన యువరాజ్ సింగ్

అతను ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌. మైదానంలోకి అడుగుపెడితే చాలు.. అరివీర భయంకరమైన బౌలర్‌కు కూడా ముచ్చెమటలు పట్టిస్తాడు. అయితే అతనికి ఎడమవైపున్న గుండె మాత్రం అంత కరుకైనది కాదు. ఎదుటివాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు కరిగిపోతుంది, బాధతో బరువెక్కుతుంది. జాలిగా ఆ చేతులు ఆదుకోవడానికి తపిస్తాయి. మృత్యువు దగ్గరికి వెళ్లొచ్చిన అతనికంటే ప్రాణం విలువ ఇంకెవరికి బాగా తెలుస్తుంది? యువరాజ్‌సింగ్‌ హృదయం క్రికెట్‌ మైదానమంత విశాలమైనది... కరోనా సెకెండ్‌వేవ్‌లో అతని సాయం కెరీర్‌లో నెలకొల్పిన రికార్డుల కంటే చిరస్మరణీయమైనది...


‘‘మీరు ఒంటరి కాదు. మీకు మేమున్నాం. భయపడొద్దు. మనమంతా కలిసి కరోనాను తరిమేద్దాం...’’ ఇది అతనికి నచ్చిన వాక్యం. చాలా ఇంటర్వ్యూల్లోనూ చెబుతుంటాడు. భారతీయులకు అభిమాన క్రికెటర్‌ అయిన యువరాజ్‌సింగ్‌ చేయని సంచలనం లేదు. ఓడిపోతారనుకున్న మ్యాచ్‌లను గెలిపించాడు. వ్యక్తిగత రికార్డుల కోసం స్వార్థపూరితంగా వ్యవహరించ కుండా... దేశం కోసమే ఆరాటపడ్డాడు. ఆయన పట్ల ప్రతి భారతీయుడికీ ఎంతో సానుభూతి ఉంది. అతను క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పుడు... నైతిక మద్దతు అందించారు క్రికెట్‌ అభిమానులు. ఆటతో ఆనందాన్ని పంచితే సరిపోదు... ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి అనిపించింది యువరాజ్‌సింగ్‌కు. ఆ ఆలోచనకు కొన్నేళ్ల కిందట ప్రాణం పోశాడు. యువియ్‌కెన్‌ పేరుతో స్వచ్ఛందసంస్థను నెలకొల్పాడు. ఆ సంస్థ ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి... క్యాన్సర్‌ బాధితుల కోసం ఎన్నో చేశాడు. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు చేయించడం, ఆత్మవిశ్వాసాన్ని, చైతన్యాన్ని నింపడం. ప్రాణం పట్ల భరోసాను వీడకుండా... గుండెను గట్టిగా చేసుకుని బతికేలా చేయడం సంస్థ బాధ్యతగా తీసుకుంది.  


యువియ్‌కెన్‌ గుర్‌గావ్‌ కేంద్రంగా పనిచేస్తున్నది. ప్రధానంగా యువరాజ్‌సింగ్‌ క్యాన్సర్‌ బాధితుడు కాబట్టి... ఆ జబ్బుతో కొట్టుమిట్టాడే వాళ్ల కోసమే పనిచేస్తోందా సంస్థ. ఇప్పటి వరకు సుమారు ఒకటిన్నర లక్షల మందికి వైద్య పరీక్షలు చేయించారు. మరో రెండు లక్షల మంది చేత పొగాకు మాన్పించారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఆరోగ్య చైతన్య శిబిరాలను ఏర్పాటు చేశారు. కేవలం క్యాన్సర్‌ బాధితులకే పరిమితం కాకుండా... వలస కూలీలు, కరోనా బాధితులకు అండగా ఉండేందుకు సంస్థ కృషి చేస్తోంది. గత ఏడాది తెలంగాణలో కూడా వలస కూలీల కోసం సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది యువియ్‌కెన్‌ సంస్థ. ఈ పదేళ్లలో అన్ని రకాల సేవలు కలిపి సుమారు 7.20 లక్షల మందికి సహాయపడినట్లు ఆ సంస్థ పేర్కొంది.


దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టించిన విలయం కనీవినీ ఎరుగనిది. ఆస్పత్రిలో బెడ్లు దొరక్క, ఆక్సిజన్‌ అందక... పిట్టల్లా రాలిపోయారు ప్రజలు. ఆ దృశ్యాలను చూసి చలించిపోయాడు యువరాజ్‌సింగ్‌. వెంటనే తన స్వచ్ఛంద సంస్థ రంగంలోకి దిగింది. మొదట్లో పద్నాలుగు రాష్ట్రాల్లో పదిలక్షల హైజెనిక్‌ కిట్లు సరఫరా చేసినట్లు సంబంధిత ప్రతినిధులు పేర్కొన్నారు.  ఆస్పత్రులకు వైద్య పరికరాలు సరఫరా చేయడానికి పూనుకున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో నిధుల సమీకరణను అధిగమించి... వెయ్యి క్రిటికల్‌ కేర్‌ బెడ్లను, రెండు వేల ఆక్సిజన్‌ సిలిండర్లను, వంద వెంటిలేటర్లను సమకూర్చింది సంస్థ. వీటి కొరత ఉన్న ఆస్పత్రులకు అందించారు. ఈ సహాయం వల్ల -  నెలకు ఆరువేల మంది కరోనా బాధితులకు వైద్యం దక్కింది. ఈ సేవను పకడ్బందీగా కొనసాగించేందుకు యువరాజ్‌ సింగ్‌ బృందం రాత్రింబవళ్లు కష్టపడింది. ఆ యువ ఆటగాడు క్రికెట్‌తో ఎన్నోసార్లు దేశాన్ని గెలిపించాడు... ఇప్పుడు కరోనాను చిత్తుగా ఓడించి, మా ప్రాణాలు కాపాడేందుకు క్రీజ్‌లోకి దిగాడు... అంటున్న కరోనా బాధితుల కళ్లలో కృతజ్ఞతను చూసి... ఉప్పొంగిపోతున్నాడు యువీ.

Advertisement
Advertisement