‘చదివించకపోయుంటే నా కొడుకు చనిపోయేవాడు కాదమ్మా’

ABN , First Publish Date - 2021-07-13T16:28:10+05:30 IST

తన కొడుకును చదివించానని, అందుకే చనిపోయాడని.. చదివించకపోయుంటే చనిపోయేవాడు కాదని ఆ తల్లి కన్నీరుమున్నీరవుతుంటే....

‘చదివించకపోయుంటే నా కొడుకు చనిపోయేవాడు కాదమ్మా’

వనపర్తి జిల్లా: జిల్లాలోని గోపాల్ పేట మండలం తాటిపర్తి గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకు వైఎస్ఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆత్మహత్యకు పాల్పడ్డ కొండల్ కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. వారికి తమ పార్టీ తోడుంటుందని భరోసా ఇచ్చారు. దీక్ష ప్రారంభించిన అనంతరం షర్మిల మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ మొద్దు నిద్ర నుంచి లేపటానికి ప్రతి మంగళవారం నిరుద్యోగ దినంగా.. నిరసన దినంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్వహిస్తుందని ప్రకటించారు. పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసం మూడు రోజుల నిరాహార దీక్ష చేపట్టానని, ఉద్యోగుల పక్షాన పోరాటాన్ని ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. 


ఆ పోరాట స్ఫూర్తితో ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్షలు చేపడతామని.. దేశంలోనే నిరుద్యోగులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటన్నారు. నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా సీఎం కేసీఆర్ దున్నపోతుపై వాన పడినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. ఇవాళ కొండల్ తల్లిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు.. కొండల్ తల్లి చెప్పిన మాటలు ఆవేదన కలిగించాయన్నారు. తన కొడుకును చదివించానని, అందుకే చనిపోయాడని.. చదివించకపోయుంటే చనిపోయేవాడు కాదని ఆ తల్లి కన్నీరుమున్నీరవుతుంటే చూడలేకపోయానన్నారు. ఇంతకన్నా అవమానకరమైన మాట ఏమన్న ఉంటుందా సీఎం కేసీఆర్ అని ప్రశ్నించారు. వెంటనే క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి దళితుడిని ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అంటూ ప్రకటన చేస్తారని, అదే సమయంలో 50 వేల మంది ఉద్యోగులను పీకేశారని విమర్శించారు.  


ఇదిలా ఉంటే, దీక్షా శిబిరం వద్ద పోలీసుల హల్ చల్ చేశారు. స్పీకర్స్ ఉన్న ఆటోను అడ్డుకుని కాసేపు హడావుడి చేశారు. సౌండ్ బాక్స్‌లు పెట్టవద్దని వారించారు. నాయకులు కలగజేసుకుని మాట్లాడటంతో అప్పుడు పోలీసులు శాంతించారు. 



Updated Date - 2021-07-13T16:28:10+05:30 IST