కేసీఆర్‌ మోసగాడు!

ABN , First Publish Date - 2021-07-09T07:50:17+05:30 IST

‘‘ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించకుండా లక్షల కోట్ల బడ్జెట్‌ పెడితే ఏం లాభం? పీజీ చదివిన వారికి ఉద్యోగావకాశాలు చూపకుండా గొర్రెలు పంపిణీ చేస్తే ఏం లాభం? సీఎం కేసీఆర్‌ మోసగాడు. కళ్లముందు ఉద్యోగ ఖాళీలు కనిపిస్తున్నా భర్తీ చేయాలన్న ఇంగిత జ్ఞానం..

కేసీఆర్‌ మోసగాడు!

పేదరికం నుంచి బయటపడింది తన కుటుంబమే

రెండేళ్లుగా ఆంధ్ర ప్రాజెక్టులు కడుతుంటే 

ఇప్పుడు తెలివి వచ్చిందా?

పక్క రాష్ట్ర సీఎంను పిలిచి కౌగిలించుకున్నారు

ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువునూ ఓడించారు!

జల వివాదంపై 2 నిమిషాలు మాట్లాడుకోలేరా?

కేసీఆర్‌ రైతు బంధువైతే 6వేల ఆత్మహత్యలేంటి?

మేమొస్తే బీసీలకు జనాభా దామాషాలో సీట్లు

వైఎస్సార్‌టీపీ ఆవిర్భావ సభలో షర్మిల 


ఒక ఇంట్లో ఉద్యోగం కోసం ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఇంట్లో ఇంకొకరికి ఉద్యోగం ఇస్తున్నారు. ఆ లెక్కన ఉద్యోగాల కోసం మీ ఇంట్లో ఎంత మంది చచ్చారని మీ ఇంటికి నాలుగు ఉద్యోగాలిచ్చారు కేసీఆర్‌? కళ్ల ముందు ఖాళీలు కనిపిస్తున్నా.. వాటిని భర్తీ చేయాలన్న ఇంగితం లేకుండా పోయింది పెద్ద మనిషికి. 


కేసీఆర్‌ మాట ఇచ్చిండంటే తల నరుక్కుంటడు తప్ప మాట తప్పడని ఆయనే అన్నడు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి చెయ్యలేదు కదా..! మరి ఆ తలకాయ సంగతేంటో చెప్పండి కేసీఆర్‌ సారూ? 

షర్మిల


హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజలకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించకుండా లక్షల కోట్ల బడ్జెట్‌ పెడితే ఏం లాభం? పీజీ చదివిన వారికి ఉద్యోగావకాశాలు చూపకుండా గొర్రెలు పంపిణీ చేస్తే ఏం లాభం? సీఎం కేసీఆర్‌ మోసగాడు. కళ్లముందు ఉద్యోగ ఖాళీలు కనిపిస్తున్నా భర్తీ చేయాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందా పెద్ద మనిషికి. ఎక్కడైనా ఉప ఎన్నికలు వస్తే మాత్రం త్వరలోనే ఉద్యోగాలని అక్కడో మాట, ఇక్కడో మాట పడేస్తారు. అది నమ్మి నిరుద్యోగులు నిలువు దోపిడీ అయి మరీ కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి శిక్షణలు తీసుకుంటారు. కానీ, నోటిఫికేషన్లు రావు. కేసీఆర్‌ ఇంట్లో మాత్రం నాలుగు ఉద్యోగాలు వచ్చాయి’’ అని వైఎస్‌ షర్మిల అన్నారు. గురువారమిక్కడ ఓ ఫంక్షన్‌ హాల్లో జరిగిన ‘వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ’ ఆవిర్భావ సభలో ఆమె కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే సీఎం కేసీఆర్‌ ఇప్పుడు తెలివిలోకి వచ్చారా? అని ప్రశ్నించారు. ‘‘పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించవచ్చు. కౌగిలించుకోవచ్చు.


భోజనం పెట్టవచ్చు. స్వీట్లు కూడా తినిపించవచ్చు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించనూ వచ్చు! కానీ, రెండు నిమిషాలు కూర్చుని నీటి పంచాయితీపై మాట్లాడుకోలేరా?’’ అని నిలదీశారు. వైఎస్సాఆర్‌ జయంతి సందర్భంగా రాజన్న రాజ్యం మళ్లీ తీసుకురావడానికి వైఎ్‌సఆర్‌టీపీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం అనే మూడు అజెండాలతో వైఎస్సార్‌టీపీ సాగుతుందని స్పష్టం చేశారు.


తెలంగాణ నలు మూలలను ప్రస్తావిస్తూ..

‘‘జోహార్‌ వైఎస్సార్‌, జోహార్‌ తెలంగాణ. మీ రాజన్న బిడ్డ, మీ షర్మిల శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది’’ అని షర్మిల అన్నారు. ‘‘కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన సంక్షేమ సంతకం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. ఎన్ని సంక్షేమ పథకాలు! ప్రజల మీద ఎంత ప్రేముంటే అలాంటి సంక్షేమ పథకాలు రూపొందిస్తారు. శత్రువులు సైతం ప్రశంసించిన నేత వైఎస్సార్‌’’ అని వ్యాఖ్యానించారు.


అదే మా లక్ష్యం..

‘‘సంక్షేమం అంటే.. ప్రజలకు ఆత్మ నిబ్బరంతో పాటు రేపటిపై భరోసా కల్పించడమే. వైఎ్‌సఆర్‌ చేసిన సంక్షేమం ఇప్పటికీ ఒక రోల్‌ మోడల్‌. రైతులు చల్లగా ఉండాలని రుణమాఫీ చేశారు. ఉచిత విద్యుత్తు, పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. కోటి ఎకరాలకు నీరివ్వాలని తపించి జలయజ్ఞానికి రూపకల్పన చేసిన దార్శనికుడు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తెచ్చారు. ఎంతో మంది పేదలు ఉచితంగా చదువుకొని, లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ, 108 అత్యవసర అంబులెన్సులు.. ఇలా పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తెచ్చారు. ఇక ఉపాధి కల్పించే విషయంలో వైఎస్సార్‌ ఐదేళ్లు సీఎంగా ఉంటే మూడు సార్లు జాబ్‌ నోటిఫికేషన్‌లు విడుదల చేసి లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. 11 లక్షల ప్రైౖవేటు ఉద్యోగాలూ సృష్టించిన మహా నేత వైఎస్సార్‌. అదీ సంక్షేమ పాలన  అంటే. మళ్లీ అలాంటి పాలన తేవడమే మా పార్టీ లక్ష్యం’’ అని వివరించారు.


తెలంగాణలో పరిస్థితి ఇదీ..

‘‘ఇప్పుడు తెలంగాణలో సంక్షేమం ఎలా ఉందంటే.. పెట్టే పైసలు పెడుతూనే ఉన్నం. పోయే పైసలు పోతూనే ఉన్నాయి. రోగం మాత్రం నయమవడం లేదన్నట్టు ఉంది. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణను సాధించుకుని ఇన్నేళ్లయినా.. ప్రజలు మాకు తెల్లరేషన్‌ కార్డులివ్వండంటూ దరఖాస్తులు పెట్టుకుంటూనే ఉన్నారు. రూపాయి బియ్యం కోసం రేషన్‌  షాపుల బయట క్యూల్లో నిలబడుతూనే ఉన్నారు. లక్షల కోట్లు అప్పు చేసినా పేదరికం పోలేదు. అధికారం ఉన్నప్పుడే ఫాం హౌస్‌ చక్కబెట్టుకోవాలన్నట్లు.. అందిందల్లా దోచుకుంటున్నారు’’ అని విమర్శించారు.


వైఎస్‌ ఉంటే కరోనాకు ఉచిత చికిత్స అందేది..

‘‘నేను కరీంనగర్‌లో ఒక అక్కను కలిశాను. అమ్మా నా భర్తకు కరోనా వస్తే రూ.11 లక్షలు అప్పు చేశాను. అయినా చ నిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వైఎస్సార్‌ ఉన్నప్పుడు నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. దాన్ని రూ.6 లక్షలకు అమ్మి అప్పు తీర్చానని, ఇంకా రూ.5 లక్షల అప్పు అలాగే ఉందని చెప్పింది. నాకూ కన్నీళ్లు ఆగలేదు. కేసీఆర్‌ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉంటే ఎంతో మందికి ఆసరాగా ఉండేది. అలా చేయలేదు. కరోనాకు ఎంతో మంది బలయ్యారు. మరెంతో మంది ఆస్తులు అమ్ముకున్నారు. అప్పులపాలయ్యారు. కేసీఆర్‌ అప్పులపాలైన ఆ కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారు. తప్పయిపోయింది అని ముక్కు నేలకు రాస్తే మీ పాపం పోతుందా? ఇప్పుడేం జరుగుతోంది. రైతులకు పెట్టుబడి సాయం చేయాలి. మళ్లీ అవే పైసలు వడ్డీకి జమ కట్టుకోవాలి. ఆడ పిల్లకు పెళ్లి చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పాలి. ఆ పిల్లకు పెళ్లయు, కొడుకు పుట్టి, స్కూల్‌కు పోతున్నా ఆ డబ్బులు ఎగ్గొట్టాలి. చదువులు ఉచితమని చెప్పాలి. బడులే మూయించాలి. ఆత్మ గౌరవ ఇల్లు అని చెప్పి ఏడాదికో ఇల్లు అక్కడక్కడా కట్టి ఆశలు చూపిస్తూ ఉండాలి. వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చచ్చినోళ్లు రైతులే కాదని చెప్పాలి’’ అని తీవ్రంగా దుయ్యబట్టారు.


వైఎస్‌ బాటలో సంక్షేమ పథకాలు.. 

‘‘పథకాల గురించి ఏ అవ్వనడిగినా, ఏ తాతనడిగినా, చదువుకున్న ఏ బిడ్డనడిగినా, ఏ గుండెనడిగినా.. సంక్షేమానికి రారాజు వైఎస్సార్‌ అని చెబుతారు. అందుకే ఆయన్ను ఆదర్శంగా తీసుకుని, వైఎస్‌ పథకాలన్నింటినీ మళ్లీ ప్రారంభించి, పేదరికాన్ని రూపుమాపడమే మా పార్టీ లక్ష్యం’’ అని వివరించారు.


నాలుగు ఉద్యోగాలొచ్చాయ్‌..

‘‘ఈ రోజు తెలంగాణలో ఎంత మంది వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలుగుతున్నారు? ఇదే ప్రశ్న కేసీఆర్‌ను అడిగితే.. ‘అబద్ధాలు చెప్పడానికి ఆడ, ఈడ ఒకొక్కడు మోపయ్యిండు. జర బయటకు పోయి చూస్తే తెలుస్తది. ఎంత మంది వాళ్ల కాళ్ల మీద నిలబడిండ్రోనని. రేషన్‌  షాపులు, కరోనా వైద్యం కోసం దవాఖానాల వద్ద, రైతు కేంద్రాల్లో పంట కొనాలని, విత్తనాల కోసం, ఎరువుల కోసం, ఉద్యోగాల కోసం రోడ్ల మీద, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కోసం ఎమ్మెల్యేల ఇంటి వద్ద నిలబడతలేదా. మరి ఇంత మంది వారి కాళ్ల మీద వారు నిలబడుతుంటే ఇంకేం కావాలి’ అంటడు! వారి కాళ్ల మీద వారు నిలబడడమంటే అది కాదు దొరా..! ఎవరి మీదా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బతకాలి. అందుకు కావాల్సింది పని, ఉపాధి. ఉపాధి కల్పించకుండా ఎన్ని లక్షల కోట్లతో ఎంత బడ్జెట్‌ ప్రవేశ పెట్టి ఏం లాభం? నల్లగొండలో ఒక తమ్ముడు కలిశాడు. అక్కా.. మాకు ఎకరం పొలం ఉంది. అమ్మానాన్న, అక్క ఆ పొలంలో పని చేసి కష్టపడి నన్ను పీజీ వరకు చదివించారు. నేను ఉద్యోగం చేసి వారిని పోషించాలి.


కానీ, ఎంత ప్రయత్నించినా ఉద్యోగం మాత్రం దొరకడం లేదు. మా అక్క పెళ్లికి ఉన్న ఎకరా పొలం అమ్మేశాం. ఇప్పుడు మా అమ్మానాన్న వేరే పొలంలో కూలీకి వెళుతున్నారు. ఈ సంవత్సరమైనా ఉద్యోగం వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. ఉద్యోగం రాకపోతే ఆత్మహత్యే శరణ్యం అన్నాడు. పీజీ చదివిన పిల్లలకు గొర్రెలిస్తే దానికంటే ఆత్మహత్యనే నయమనుకోరా? ఒక ఇంట్లో ఉద్యోగం కోసం ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఇంట్లో ఇంకొకరికి ఉద్యోగం ఇస్తున్నారు. ఆ లెక్కన ఉద్యోగాల కోసం మీ ఇంట్లో ఎంత మంది చచ్చారని నాలుగు ఉద్యోగాలిచ్చారు కేసీఆర్‌? కేసీఆర్‌ మోసగాడు’’ అని వ్యాఖ్యానించారు.


కేసీఆర్‌.. ఆ తలకాయ సంగతేంటి?

‘‘ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కేసీఆర్‌ రోజూ అవమానిస్తున్నారు. రాష్ట్రంలోని 3 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తామని, కనీసం 3ు మందికి కూడా ఇవ్వలేదు. పైగా గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్‌ భూములనూ లాక్కుంటున్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి చెయ్యలేదు కదా..! తల నరుక్కుంటానన్న కేసీఆర్‌.. ఆ తలకాయ సంగతేంటో చెప్పండి? దళితులపైన, గిరిజనులపైన దాడులు జరిగితే కేసీఆర్‌ రాక్షసానందం పొందుతారో ఏమో నాకు తెలియదు. ఇసుక లారీల కింద తమ పిల్లలు చనిపోతున్నారని మొరపెట్టుకుంటే వారిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాడు. మొన్న మరియమ్మ అనే దళిత మహిళను లాక్‌పలో చంపేశారు. అంతకుముందు పోడు భూముల కోసం గిరిజన మహిళ పోరాటం చేస్తే బట్టలూడదీసి చెట్టుకు కట్టేసి కొట్టి హింసించారు. ఇదీ.. కేసీఆర్‌ దొరకు ఎస్సీ, ఎస్టీలపై ఉన్న గౌరవం. సమాజంలో ఉన్నవారినే పట్టించుకోని కేసీఆర్‌.. అడవుల్లో ఉండే ఎస్టీల సమస్యలను పరిష్కరిస్తారా? వారి మాన, ప్రాణాలకు, జీవితాలకు రక్షణ లేదు.. మైౖనారిటీలకు 12ు రిజర్వేషన్‌లు ఇస్తానని చెప్పి ఓట్లు గుంజుకుని మోసం చేశారు’’ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. 


100రోజుల తర్వాత పాదయాత్ర

‘‘ఇప్పుడే మేం రంగంలోకి దిగాం. ప్రజలకొచ్చిన ప్రతి సమస్య మీద కొట్లాడతాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. 100 రోజుల తర్వాత పాదయాత్ర మొదలుపెడతాం. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు. సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధి కోసం పనిచేసే రాజకీయ వేదిక. మాకు అధికారం ఉన్నా లేకపోయినా, పదవులు వచ్చినా రాకపోయినా ప్రజల పక్షాన నిలబడతాం. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడే మొండి ధైర్యం నాది. నా మనసులో ప్రజలకు నమ్మకంగా సేవచేయాలనే చిత్తశుద్ధి ఉంది. దేవుని దయ.. ప్రజల ఆశీర్వాదం కావాలి! వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీని ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, సేవచేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నా’’  


ఆ హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు 

తెలంగాణలో ఇంకా కాంగ్రెస్‌ పార్టీ నిలబడి ఉందంటే దానికి కారణం వైఎస్సారే. నాయకులని చెప్పుకుంటున్న ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టిందే ఆయన. అలాంటి వైఎస్సార్‌ను టీఆర్‌ఎస్‌ నాయకులు దూషిస్తుంటే.. చేతులకు గాజులు తొడుక్కొని, నోరు మూసుకొని కూర్చున్న వీళ్లా వైఎస్సార్‌ వారసులు?. అలా చెప్పేందుకు సిగ్గుండాలి. వైఎస్సార్‌ బిడ్డగా చెబుతున్నా. వైఎస్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది కాంగ్రెస్‌ పార్టీయే. వైఎస్‌ఆర్‌ అనే మూడు పదాలు ఉచ్ఛరించే హక్కు, అర్హత కాంగ్రెస్‌ పార్టీకి లేదు. వైఎస్సార్‌ నిజమైన వారసులం మేమే.


‘ఎడుగూరి సందింటి రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ పార్టీ’నే.  కేసీఆర్‌ అవినీతిపై ఆధారాలున్నాయని, ఆయన్ను జైల్లో పెడతామని చెబుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఎందుకు జైల్లో పెట్టట్లేదు. వారిద్దరి మధ్యా ఏమైనా డీల్‌ కుదిరిందా?వారు తోడు దొంగలే, ప్రజల్ని మోసం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌.. ఏవైనా వైఎస్సార్‌ను కించపరిచి మాట్లాడితే కోట్లల్లో ఉన్న వైఎస్‌ అభిమానులు ఉరికించి కొడతారు.




బతుకమ్మ అంత అందంగా..

‘‘ఒక పువ్వుకు ఉన్న రంగు, సువాసన మరో పువ్వుకు భిన్నం. కానీ తీరొక్క పూలను పేర్చిన బతుకమ్మ ఎంత అందంగా ఉంటుందో.. అదే విధంగా వివిధ వర్గాల వారిని ఒక చోటికి చేరిస్తే అదే అందమైన తెలంగాణ అవుతుంది. వైఎస్‌ తన ప్రజలను కులమతాలకు అతీతంగా సమానంగా గౌరవించారు. అదే సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుంటాం. అన్ని కులాలు, మతాలు, వర్గాలను సమానంగా గౌరవిస్తాం. ఇదే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ లక్ష్యం’’ 


జనాభా లెక్కన బీసీలకు సీట్లు

‘‘ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు పోను మిగిలిన సీట్లలో బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తాం. రాష్ట్రంలో 52 శాతంగా ఉన్న బీసీలకు అవకాశాలు దక్కకపోవడం వల్లే వెనకబడి ఉన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 ురిజర్వేషన్‌ ఉంటే.. కేసీఆర్‌ దాన్ని 24 శాతానికి కుదించారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ భద్రత ఉంది కాబట్టి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉంది. కానీ, బీసీలకు రాజ్యాంగ భద్రత లేకనే చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం లేదు’’


ఉద్యమకారులకు సంక్షేమ నిధి

‘‘తెలంగాణ కోసం 1200 మంది ఆత్మబలిదానాలు చేస్తే కేసీఆర్‌ ప్రభుత్వం వారిలో 400 మందినే గుర్తించింది. అనేక మంది ఉద్యమకారులు ఇంకా కేసులపై కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యమ కారుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తాం. స్వాతంత్య్ర సమరయోధులను గుర్తించినట్లుగానే తెలంగాణ ఉద్యమకారులనూ గుర్తించి సత్కరించి, అన్ని సేవలూ ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది’’


కూర్చొని మాట్లాడుకోలేరా? 

‘‘కృష్ణా జలాల వివాదంపై ఇద్దరు ముఖ్యమంత్రులూ కూర్చుని మాట్లాడి, పరిష్కరించుకోలేరా? సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉందామనుకున్నాం. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత లేదా? గోదావరి నది మీద ఉన్న ప్రాణహిత నుంచి పోలవరం వరకు, కృష్ణా నది మీద జూరాల నుంచి పులిచింతల వరకు ఏ ప్రాజెక్టు విషయంలోనైనా న్యాయబద్ధంగా తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ఒక్క చుక్క నీటిబొట్టును కూడా వదులుకోం. ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా మేం అడ్డుకోం. సమన్యాయం జరగాలన్నదే మా పార్టీ లక్ష్యం’’


6వేల మంది రైతుల ఆత్మహత్యలెందుకు? 

‘‘సీఎం కేసీఆర్‌ రైతు బంధువే అయితే ఈ ఆరేళ్లలో 6 వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? రాష్ట్రంలో రైతుబంధు పథకం అమలవుతున్న తీరు.. కంట్లో కారం కొట్టి.. నోట్లో బెల్లం పెట్టినట్లుగా ఉంది. కేసీఆర్‌ దయతలిచి రుణాలిస్తేనే తీసుకోవాలి. ఆయన చెప్పిన పంటనే వేసుకోవాలి. పండిన పంటకు.. అయిన పెట్టుబడికి పొంతనే ఉండదు. రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవడమో, లేకుంటే పొలాలను అమ్ముకోవడమో జరుగుతుంది. నిరుడు కేసీఆర్‌ చెప్పిన పంటను వేయడం వల్ల రైతులకు ఎకరాకు రూ.25-30 వేల వరకు నష్టం వచ్చింది. రైతుల స్వయం సంవృద్ధికి అప్పులే అడ్డుగోడలు. రాష్ట్రంలో అప్పులేని కుటుంబమే లేదు. పెట్టుబడి పెట్టాలన్నా, బిడ్డ పెళ్లి చేయాలన్నా, ఇంటి కిరాయి కట్టాలన్నా, పండగొచ్చినా అప్పు చేయాల్సిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రమే అప్పుల పాలైంది. సీఎం కేసీఆర్‌  రూ.4 లక్షల కోట్ల మేరకు అప్పులు చేశారు. ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?’’


చట్ట సభల్లో మహిళలకు సగం

‘‘చట్ట సభల్లో 50 శాతం మహిళలనే కూర్చోపెట్టాలన్నది వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ లక్ష్యం. రాష్ట్రంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంలో కేసీఆర్‌ విఫలమయ్యారు. మహిళలు ఎదగాలంటే పాలనలో సమాన భాగస్వామ్యం ఉండాలి. కానీ జనాభాలో సగభాగమైన మహిళలు ఇంకా అధికార నిచ్చెనలో అట్టడుగునే ఉన్నారు. మహిళలు పాలకులుగా పనికిరారన్న ఆలోచనలో మార్పురావాలి. వార్డు సభ్యులు, సర్పంచులుగా పనికొస్తారు కానీ.. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా  మంత్రులుగా పనికి రారా? ఇది సిగ్గుచేటు. అధికార పార్టీ కార్యక్రమంలో మహిళకు ఒక కుర్చీ కూడా వెయ్యని ఈ టీఆర్‌ఎస్‌ నాయకులు మహిళా సాధికారత సాధిస్తారట. అంతటి మొగోళ్లే అయితే, ఇన్నాళ్లు చేతులకు ఎందుకు గాజులేసుకున్నారు? తెలంగాణ శాసనసభలో 50 ు మహిళలను కూర్చోబెట్టాలన్నది మా ఆకాంక్ష. చట్టసభల్లో 50 శాతం మంది మహిళలే కూర్చోవాలన్నది మా పార్టీ లక్ష్యం’’

Updated Date - 2021-07-09T07:50:17+05:30 IST