Atmakuru By Election Result: ఆత్మకూరులో వైసీపీ ఘన విజయం.. కానీ జగన్ అనుకున్నది జరగలేదే..!

ABN , First Publish Date - 2022-06-26T17:49:52+05:30 IST

ఆత్మకూరు ఉప ఎన్నికలో (Atmakuru By Poll) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి (Vikram Reddy) 82,888 ఓట్ల మెజారిటీతో..

Atmakuru By Election Result: ఆత్మకూరులో వైసీపీ ఘన విజయం.. కానీ జగన్ అనుకున్నది జరగలేదే..!

నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికలో (Atmakuru By Poll) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి (Vikram Reddy) 82,888 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచే వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఇదిలా ఉండగా.. ఈ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీకి (BJP) 19,352 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,074 ఓట్లు పోలయ్యాయి. ఇతరులకు 11,496 ఓట్లు, నోటాకు 4,179 ఓట్లు పోలవడం విశేషం. బీఎస్పీ అభ్యర్థి ఓబులేష్‌కు 4,897 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. మేకపాటి కుటుంబం నుంచే అభ్యర్థిని ప్రకటించడంతో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. మొత్తంగా గమనిస్తే ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ గెలిచినప్పటికీ ఆశించిన మెజారిటీ సాధించలేకపోయింది. లక్ష మెజారిటీ కోసం మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలంతా ఆత్మకూరులోనే మకాం వేసి మరీ ప్రచారం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో అనూహ్యంగా ఓటింగ్‌ శాతం తగ్గడం వైసీపీ లక్ష మెజారిటీ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైంది.



ఉప ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ చూపించి ప్రజల్లో వ్యతిరేకత లేదని చాటి చెప్పాలని వైసీపీ అధిష్ఠానం భావించింది. ఆ మేరకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా మోహరించి, స్థానిక నాయకులకు దిశానిర్ధేశం చేయడంతోపాటు ఓటర్లకు భారీగానే తాయిలాలు అందజేశారు. ఆ మేర ఓటింగ్‌ శాతం పెంచేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే.. పోలింగ్‌ ముగిసే సమయానికి  64.17 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో ఈ నియోజకర్గంలో 82 శాతం పోలింగ్‌ జరిగింది. అంటే 18 శాతం పోలింగ్‌ తగ్గడంతో లక్ష ఓట్ల మెజారిటీ అసాధ్యమని అధికార పార్టీ నేతలు అంచనా వేశారు. చివరకు అనుకున్నదే జరిగింది. అనుకున్న మెజారిటీ రాకపోవడంతో తమ అధినాయకుడికి ఏం సమాధానం చెప్పాలా అనే ఆలోచనలో పడ్డారు. 

Updated Date - 2022-06-26T17:49:52+05:30 IST