వైఎస్‌ఆర్‌ నరరూప రాక్షసుడు

ABN , First Publish Date - 2021-06-26T08:04:52+05:30 IST

తెలంగాణకు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అన్యాయం చేశారని, ఆయన నరరూప రాక్షసుడు అని మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ వాఖ్యానించారు.

వైఎస్‌ఆర్‌ నరరూప రాక్షసుడు

  • తెలంగాణకు అన్యాయం చేశారు.. 
  • తాగడానికి నీళ్లివ్వకుండా ద్రోహం చేశారు
  • ఇపుడు జగన్‌.. రెట్టింపు జల దోపిడీ  
  • ఆయన్ను దొంగ అనకుంటే దొర అనాలా?
  • రాష్ట్రానికి నష్టమొస్తే కేసీఆర్‌ ఊర్కోరు: శ్రీనివాస్‌ గౌడ్‌  
  • వైఎస్‌ జల దోపిడీకి వంతపాడినోళ్లే.. 
  • నేడు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు: జగదీశ్‌రెడ్డి 
  • అక్రమంగా నిర్మిస్తే పాతరేస్తాం: నిరంజన్‌రెడ్డి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/వనపర్తి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అన్యాయం చేశారని, ఆయన నరరూప రాక్షసుడు అని మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ వాఖ్యానించారు. వైఎ్‌సఆర్‌ కుమారుడు, ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పద్ధతి కూడా మారలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల అనేక మంది చావులకు, తెలంగాణ వెనుకబాటుకు, వలసలకు కారణం వైఎ్‌సఆర్‌యేనని ఆరోపించారు. తెలంగాణకు తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా ద్రోహం చేశారని, ఇప్పుడు ఆయన కొడుకు దానికి రెట్టింపు జల దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయనను దొంగ అని అనకపోతే దొర అనాలా అని నిలదీశారు. శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు వైఎ్‌సఆర్‌ 40 వేల క్యూసెక్యుల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మిస్తే.. ఇప్పుడు జగన్‌ దాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచారన్నారు. ‘రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటా తేలేంతవరకు ప్రాజెక్టులను చేపట్టబోమని మీరు అన్నరా లేదా? దైవసాక్షిగా, మీ నాన్న సాక్షిగా చెప్పు. ఇప్పుడు మాట తప్పుతారా.?’’ అని ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీలు ఏవైనా జలాల విషయాల్లో కలిసికట్టుగా ఉందామని కాంగ్రెస్‌, బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఏపీ చేపట్టే అక్రమ ప్రాజెక్టులను ఆపడానికి ప్రయత్నం చేయాలని కోరారు. తెలంగాణకు నష్టం చేస్తే సీఎం కేసీఆర్‌ ఊర్కోరని  అన్నారు.  


 ‘‘ఏపీ సీఎం జగన్‌తో టీఆర్‌ఎ్‌సకు చీకటి ఒప్పందం ఉందని కొందరు మాట్లాడుతారు. ఎన్నిరోజులు కొట్లాడుకుంటూ ఉందాం? తండ్రి తప్పు చేస్తే కొడుకన్నా మంచి చేస్తారని అనుకున్నాం. కానీ మామిడి చెట్టుకు మామిడి పళ్లే కాస్తాయి అన్నట్లు.. ఆయన కడుపులో పుట్టినాయన అదే పద్ధతిలో ఉంటాడని అనుకోలేదు. మనుషుల్లో కొంత మార్పు వస్తుందని, మారాలనుకొని, రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి కావాలనుకొని ప్రయత్నం చేశాం. అది తప్పా. ఇది చీకటి ఒప్పందమా?’’ అని   శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించారు. రాజశేఖర్‌ రెడ్డి దొంగ అని అనగానే కొందరు ఎగిరెగిరి పడుతున్నారని, మరి ఏమనాలని అడిగారు. అప్పట్లో కాంగ్రెస్‌ మాజీ మంత్రి పి. జనార్దన్‌ రెడ్డి పోతిరెడ్డిపాడు మీద కొట్లాడితే ఎన్ని అవమానాలు పెట్టారో అందరికీ తెలుసునన్నారు. పీజేఆర్‌ మరణానికి వైఎ్‌సఆర్‌ కారణం కాదా అని ప్రశ్నించారు.  


జలాల విషయంలో కలిసికట్టుగా ఉందామని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు శ్రీనివా్‌సగౌడ్‌ విజ్ఞప్తి చేశారు. ‘‘కాంగ్రెస్‌ పని అయిపోయిందని కొందరు అంటున్నారు. భూమి ఉన్నంత వరకు కాంగ్రెస్‌ ఉంటుంది.’’ అని వ్యాఖ్యానించారు. అక్రమ ప్రాజెక్టులు ఆపాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధానికి లేఖ అందించాలని కోరారు. కాగా, ఆనాడు వైఎస్‌ జల దోపిడీకి వంతపాడిన వాళ్లే ఇప్పుడు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి టీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయంలో ఆరోపించారు. తెలంగాణలో షర్మిల తెస్తానంటున్న రాజన్న రాజ్యం అంటే.. తండ్రిని మించిన దోపిడీని కొనసాగించడమేనని విమర్శించారు. కాగా,   అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాతరేస్తామని, ఏపీలో నడిచిన విధంగా గుండాగిరీ, దాదాగిరీ ఇక్కడ నడవనివ్వమని  మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. 

Updated Date - 2021-06-26T08:04:52+05:30 IST