వైఎస్‌ ఇచ్చారు.. జగన్‌ తీసేసుకున్నారు

ABN , First Publish Date - 2020-07-01T08:47:53+05:30 IST

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందిన అమర్‌రాజా కంపెనీకి ఇచ్చిన భూములను జగన్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కంపెనీకి ఇచ్చిన భూముల్లో హామీ మేరకు అభివృద్ధి జరగలేదని..

వైఎస్‌ ఇచ్చారు.. జగన్‌ తీసేసుకున్నారు

అమర్‌రాజా కంపెనీ భూములు వెనక్కి

సకాలంలో అభివృద్ధి చేయలేదనే!

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం


అమరావతి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కుటుంబానికి చెందిన అమర్‌రాజా కంపెనీకి ఇచ్చిన భూములను జగన్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కంపెనీకి ఇచ్చిన భూముల్లో హామీ మేరకు అభివృద్ధి జరగలేదని.. అందుకే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు మంగళవారం  ఉత్తర్వులు జారీచేసింది. అమర్‌రాజా గ్రూపునకు చెందిన అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్‌ కంపెనీ చిత్తూరు జిల్లా వెనుకబడిన ప్రాంతాల్లో డిజిటల్‌ వరల్డ్‌ సిటీ పేరిట ఒక సెజ్‌ను అభివృద్ధి చేస్తానని గతంలో ప్రతిపాదించింది. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే మీ గ్రూప్‌ ఉంది...ఇంకేదైనా ప్రాజెక్టు చేపట్టవచ్చు కదా అని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డే అప్పట్లో అడిగారని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. దానికి భూముల విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు వైఎస్‌ ఒక ప్రతిపాదన చేశారని.. పంటలు పండే భూములు, చదునుగా ఉన్న భూములు సేకరించాలంటే ఇబ్బంది అవుతుందని.. గుట్టలు, కొండలు ఉన్న భూమి అయితే సమస్య ఉండదని ఆయన సూచించినట్లు సమాచారం. దీంతో అలాంటి భూములనే తీసుకునేందుకు కంపెనీ అంగీకరించింది.


2009 ఫిబ్రవరిలో ఈ మేరకు 483.27ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. యాదమర్రి మండలం కొత్తపల్లిలో సర్వే నంబరు 1/1బీ, బంగారుపాళ్యం మండలం నూనెగుండ్లపల్లిలోని సర్వే నంబరు 65/1లో ఈ భూములను కేటాయించారు. ఇందులో 478.7 ఎకరాలు డీకేటీ కాగా...4.56 ఎకరాలు మాత్రమే పట్టాభూమి. ఈ భూకేటాయింపు జరిగిన మండలాలను చిత్తూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలని చెప్పొచ్చు. ఎకరం రూ.1.80 లక్షల చొప్పున ఈ భూములను అమ్మకం పద్ధతిలో ఇచ్చారు. సుమారు రూ.10.70 కోట్లను భూమి ధర గాను, మరో రూ.50 లక్షల వరకు అక్కడున్న చెట్లు, ఇతర చార్జీల కింద ఇంకో రూ.50 లక్షలు ప్రభుత్వానికి కంపెనీ చెల్లించింది. 2010లో ఈ భూములను అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్‌కు సేల్‌ డీడ్‌ ద్వారా రిజిస్ర్టేషన్‌ చేశారు. ఈ భూములు మరీ ఎత్తుపల్లాలు, గుట్టలుగా ఉండడంతో అభివృద్ధి చే సేందుకు సమయం పట్టింది. అప్పటికీ కేటాయించిన భూమిలో 229 ఎకరాలు అభివృద్ధి చేసి, డిజిటల్‌ వరల్డ్‌ సిటీ ఇండస్ర్టియల్‌ పార్కుగా విస్తరించారు. 4,310 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. అయితే మిగతా 253.61 ఎకరాలను ఇప్పటికీ అభివృద్ధి చేయలేదని, పైగా రూ.2,100 కోట్ల పెట్టుబడిని ఈ ప్రాజెక్టు కోసం పెడతామని చెప్పిన కంపెనీ... ఆ మేరకు చేయలేదని జగన్‌ ప్రభుత్వం పేర్కొంది. ఈ కారణాలతో సదరు భూములను వెనక్కి తీసుకుంటున్నామని ఉత్తర్వులు జారీచేసింది. హక్కు ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. దీంతో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నాడు కేటాయించిన భూములను...ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌ వెనక్కి తీసుకున్నట్లయిందని అంటున్నారు.


సీఎంసీ భూములు భద్రం

చిత్తూరు: అమరరాజా ఇన్‌ఫ్రాటెక్‌తో పాటే భూములు కేటాయించిన క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ(సీఎంసీ) నిరుపయోగ భూముల జోలికి మాత్రం జగన్‌ ప్రభుత్వం వెళ్లలేదు. వేలూరులోని సీఎంసీ ప్రధాన ఆస్పత్రి పట్టుమని పాతిక ఎకరాల్లో లేకపోయినా.. దానికి అనుబంధ శాఖ ఏర్పాటుకు చిత్తూరు, గుడిపాల మండలాల్లో ఏకంగా 640.17 ఎకరాలను 2010 మార్చిలో కేటాయించారు. కానీ సీఎంసీ 14 ఎకరాలను మాత్రమే వినియోగించింది. ఆ విస్తీర్ణంలో ప్రస్తుతం ఆస్పత్రి నడుస్తోంది. మిగతా 624 ఎకరాలను సొంతం చేసుకుంది. పైగా తన ఆస్పత్రిలో ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్‌ కార్డులను.. సామాన్య ప్రజల ఆరోగ్యశ్రీ కార్డులను స్వీకరించడం లేదు. 


రాజకీయ కక్షతోనే రద్దు: చంద్రబాబు 

అమరావతి(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతంలో అమర్‌ రాజా కంపెనీకి కేటాయించిన భూములను కేవలం రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీపీ నేత గల్లా జయదేవ్‌పై రాజకీయ కక్ష తీర్చుకోవడానికే ఆయన కుటుంబానికి చెందిన కంపెనీకిచ్చిన భూముల కేటాయింపు రద్దు చేశారని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. 

Updated Date - 2020-07-01T08:47:53+05:30 IST