అన్నీ మంచి శకునములే!

ABN , First Publish Date - 2021-03-30T06:21:15+05:30 IST

ప్రస్తుతం భారత క్రికెట్‌ వెలిగిపోతోంది. సీనియర్‌ ఆటగాళ్లకు తోడు జట్టులోకి అడుగుపెట్టిన ప్రతీ కొత్త క్రికెటర్‌ కూడా తన సత్తా ఏమిటో చాటుకుంటున్నాడు. గతేడాది ఆసీస్‌ పర్యటనలో రిజర్వ్‌ బెంచ్‌ బలం ఓ ట్రైలర్‌లా కనిపిస్తే...

అన్నీ మంచి శకునములే!

ప్రస్తుతం భారత క్రికెట్‌ వెలిగిపోతోంది. సీనియర్‌ ఆటగాళ్లకు తోడు జట్టులోకి అడుగుపెట్టిన ప్రతీ కొత్త క్రికెటర్‌ కూడా తన సత్తా ఏమిటో చాటుకుంటున్నాడు. గతేడాది ఆసీస్‌ పర్యటనలో రిజర్వ్‌ బెంచ్‌ బలం ఓ ట్రైలర్‌లా కనిపిస్తే.. తాజాగా జరిగిన ఇంగ్లండ్‌తో సిరీ్‌సల్లో అయితే వారు 70 ఎం.ఎం సినిమానే చూపించారు. జట్టులోకి వచ్చిందే ఆలస్యం.. రికార్డుల మోత మోగిస్తూ ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన ఇతర కుర్రాళ్లంతా జట్టులో చోటు కోసం వేచిచూస్తుండడం దేశ క్రికెట్‌కు శుభసూచకం.


గత నాలుగు నెలల కాలం భారత క్రికెట్‌కు ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఆసీస్‌ పర్యటనలో చరిత్రాత్మక టెస్టు సిరీ్‌సతో పాటు స్వదేశంలో ఇంగ్లండ్‌తో వరుసగా మూడు సిరీ్‌సలను ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా తరఫున చాలా మంది స్టార్లు వెలుగులోకి వచ్చారు. భారత క్రికెట్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్వల్ప కాలంలోనే అరంగేట్ర ఆటగాళ్లు తమదైన ముద్రను వేయగలిగారు. కఠిన సవాళ్లు ఎదురైనా బెదరకుండా గొప్ప ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే స్టార్‌ ఆటగాళ్లు ఎంత మంది దూరమైనా అత్యద్భుత ఆటతీరుతో అక్కడ టెస్టు సిరీస్‌ను గెలవగలిగాం. ఇందుకు ప్రధాన కారణం.. జట్టు రిజర్వ్‌ బెంచ్‌ ఆటగాళ్లే. నెట్‌ బౌలర్‌గా వెళ్లిన నటరాజన్‌ అన్ని ఫార్మాట్లలోనూ ఆడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాగే ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ తొలిసారి టెస్టు బరిలోకి దిగి అంచనాలకు మించి ఆకట్టుకున్నాడు. 




కుర్రాళ్ల జోరు

ఇంగ్లండ్‌తో టెస్టు, టీ20, వన్డే సిరీ్‌సలను సైతం కోహ్లీ సేన గెలుచుకుంది. గతంలో ఈ జట్టుపై భారత్‌కు మెరుగైన రికార్డు ఉండేది కాదు. కానీ ప్రస్తుతం విరాట్‌ నేతృత్వంలోని యువ భారత్‌ దూకుడైన గేమ్‌ప్లాన్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తోంది. అందుకే టెస్టులను 3-1, టీ20లను 3-2, వన్డేలను 2-1తో గెలవగలిగింది. ఈ విజయాల్లోనూ కొందరు తమదైన ముద్ర వేశారు. శార్దూల్‌ ఠాకూర్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభను ఘనంగా చాటుకున్నాడు. సూపర్‌ స్వింగ్‌తో పాటు అద్భుత టెక్నిక్‌ కలిగిన అతడి బ్యాటింగ్‌ తీరు విదేశీ గడ్డపై జట్టుకు లాభపడనుంది. ఇషాంత్‌, బుమ్రా, షమి, హార్దిక్‌లతో పాటు సీమ్‌ ఆల్‌రౌండర్‌గా శార్దూల్‌తో భారత బౌలింగ్‌ దళం ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. వాషింగ్టన్‌ సుందర్‌ రూపంలో జట్టుకు అదనపు ఆల్‌రౌండర్‌ సిద్ధంగా ఉన్నాడు. ఓపెనర్‌గా.. కొత్త బంతి బౌలర్‌గానూ సేవలందించగలడు. అతడి వేగవంతమైన ఆఫ్‌ బ్రేక్‌ బౌలింగ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతుంది. ఇక సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ టీ20 ఫార్మాట్‌లో అరంగేట్రంలోనే అర్ధసెంచరీలతో అదుర్స్‌ అనిపించుకున్నారు. మూడో నెంబర్‌లో సూర్యకుమార్‌ ఆడిన తీరు హైలైట్‌గా నిలిచింది. దీంతో ఈ ఏడాది భారత్‌లోనే జరిగే టీ20 ప్రపంచక్‌పలోనూ ఈ ఇద్దరిని విస్మరించే సాహసం జట్టు చేయకపోవచ్చు. ఆసీస్‌ టూర్‌లో సరికొత్త రిషభ్‌ పంత్‌ను చూడగలిగాం. ఆ జోరుతో ఇంగ్లండ్‌పై తను అన్ని ఫార్మాట్లలో ఆడి ప్రతిభను నిరూపించుకున్నాడు. అతడి హిట్టింగ్‌ గురించి అందరికీ తెలిసిందే. కానీ ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో జట్టు అవసరాలకు తగినట్టుగా డిఫెన్సివ్‌ ఆటతోనూ ఆశ్చర్యానికి గురి చేశాడు.


‘ఇంగ్లండ్‌’పై ఏం సాధించాం..: ఇంగ్లండ్‌తో మూడు ఫార్మాట్లలో జరిగిన సిరీస్‌ల ద్వారా భారత జట్టు కీలక ఫలితాలనే సాధించింది. ముందుగా టెస్టు సిరీ్‌సలో ఘన విజయంతో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్‌ బెర్త్‌ ఖాయమైంది. చెపాక్‌లో జరిగిన తొలి టెస్టులో ఓడాక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో జట్టు విజృంభించిన తీరు అపూర్వం. స్పిన్నర్లు అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ బంతులకు ఇంగ్లండ్‌ విలవిల్లాడింది. కెరీర్‌లో ఆడిన తొలి మూడు టెస్టుల్లోనే అక్షర్‌ 27 వికెట్లు తీసి వహ్వా అనిపించాడు. అంతేకాకుండా ఐపీఎల్‌ ముగిశాక ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే తమ బలగం ఎలా ఉండాలనే విషయంలోనూ జట్టుకు ఓ స్పష్టత వచ్చింది. అక్కడ కివీస్‌తో డబ్ల్యుటీసీ ఫైనల్‌తో పాటు రూట్‌ సేనతో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడాల్సి ఉంది. అలాగే ఐదు టీ20ల సిరీస్‌లో ప్రయోగాలతో ఇదే ఫార్మాట్‌లో జరిగే ప్రపంచకప్‌ కోసం ఓ అంచనాకు రాగలిగింది. అన్ని డిపార్ట్‌మెంట్లలోనూ తగిన ఆప్షన్స్‌ సిద్ధంగా ఉన్నాయి. ఓసెనర్లుగా రోహిత్‌, రాహుల్‌, ధవన్‌లతో పాటు కోహ్లీని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది. వన్డే సిరీ్‌సలోనూ ప్రసిద్ధ్‌ కృష్ణ, క్రునాల్‌ పాండ్యా రికార్డు ప్రదర్శన కనబర్చారు. అందుకే ప్రస్తుత భారత జట్టును చూస్తుంటే 70వ దశకంలో విండీ్‌సలాగా.. 90వ దశకంలో ఆసీ్‌సలాగా కనిపిస్తోందని ఇయాన్‌ చాపెల్‌లాంటి దిగ్గజం కితాబిచ్చాడు. ఏదిఏమైనా దేశవాళీల్లోనూ అద్భుతంగా రాణిస్తున్న యువ క్రికెటర్లతో.. ప్రస్తుత రిజర్వ్‌ బెంచ్‌తో భారత క్రికెట్‌ భవిష్యత్‌కు ఢోకా లేదనిపిస్తోంది.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

Updated Date - 2021-03-30T06:21:15+05:30 IST