చోరీ చేసేందుకు వచ్చి యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-04-13T16:19:00+05:30 IST

బ్యాచిలర్స్‌ గదులను లక్ష్యంగా చేసుకొని చోరీకి వచ్చాడు. వేసవి కావడంతో...

చోరీ చేసేందుకు వచ్చి యువకుడి మృతి

  • భనవంపై నుంచి మరో భవనంపైకి దూకుతూ 
  • ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయిన దొంగ

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : బ్యాచిలర్స్‌ గదులను లక్ష్యంగా చేసుకొని చోరీకి వచ్చాడు. వేసవి కావడంతో అందరూ మేల్కొనే ఉండడంతో వారిని చూసి భయపడ్డాడు. ఓ భవనం పై నుంచి మరో భవనం పైకి దూకుతూ ప్రమాదవశాత్తు కింద పడి మరణించాడు. జూబ్లీహిల్స్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం... బోరబండ సఫ్దర్‌నగర్‌కు చెందిన సయ్యద్‌చాంద్‌పాషా అలియాస్‌ ఇబ్రహీం (22) ఓ గ్యాంగ్‌తో కలిసి దొంగతనాలు చేస్తుంటాడు. సనత్‌నగర్‌, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇతనిపై చోరీ కేసులు ఉన్నాయి. ఆదివారం మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై చోరీకి బయలు దేరాడు. వెంకటగిరిలో బ్యాచిలర్లు ఉండే భవనాలను చోరీ కోసం ఎంచుకున్నాడు.


తనతో వచ్చిన వ్యక్తిని కిందనే ఉండమని ఇబ్రహీం ఓ భవనం పైకి చేరుకున్నాడు. అక్కడ కొంత మంది మెలకువగా ఉన్నారు. ఇబ్రహీంను చూసి ఎవరు నువ్వు అంటూ గద్దించారు. వారికి దొరకకుండా ఉండేందుకు పక్కనే ఉన్న స్కూల్‌ భవనం పైకి దూకాడు. దాని మీద నుంచి నాలుగు అంతస్తుల భవనం పై దూకుతుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. తలకు తీవ్రమైన గాయం కావడంతో రక్తపు మడుగుల్లో పడిపోయాడు. ఇబ్రహీంను చూసి అతనితో వచ్చిన వ్యక్తి పరారయ్యాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇబ్రహీంను ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-04-13T16:19:00+05:30 IST