దుబాయ్‌లో చెర నుంచి యువతికి విముక్తి

ABN , First Publish Date - 2021-01-18T13:01:12+05:30 IST

ఏజెంట్ల చేతిలో మోసపోయి, దుబాయ్‌లోని ఓ అరబ్‌ షేక్‌ చేతిలో బందీగా ఉన్న హైదరాబాద్‌ యువతికి విముక్తి లభించింది. విదేశాంగ శాఖ చొరవతో ఆమె హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. మైలార్‌దేవ్‌పల్లి ప్రాం

దుబాయ్‌లో చెర నుంచి యువతికి విముక్తి

హైదరాబాద్‌ సిటీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఏజెంట్ల చేతిలో మోసపోయి, దుబాయ్‌లోని ఓ అరబ్‌ షేక్‌ చేతిలో బందీగా ఉన్న హైదరాబాద్‌ యువతికి విముక్తి లభించింది. విదేశాంగ శాఖ చొరవతో ఆమె హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతానికి చెందిన ఆ యువతి.. దుబాయ్‌లో ఉద్యోగం కోసం కిషన్‌బాగ్‌కు చెందిన ఏజెంట్లు ఖాలిద్‌, షమీనా, షబానాను కలిసింది. దుబాయ్‌లో మంచి జీతంతో ఉద్యోగం ఉందని వారు ఆమెను నమ్మించారు. వారి మాటలు నమ్మిన యువతి గత ఏడాది నవంబరు 6న దుబాయ్‌కు చేరుకుంది. అక్కడ ఏజెంట్లు ఆమెను ఓ లేబర్‌ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆ కార్యాలయ సిబ్బంది ఆమెను ఓ అరబ్‌ షేక్‌కు రూ.2 లక్షలకు విక్రయించారు. బాధితురాలితో అతను వెట్టిచాకిరి చేయించుకున్నాడు. దీంతో స్వల్పకాలంలోనే ఆమె అస్వస్థతకు గురైంది.


అనంతరం బాధితురాలిని అరబ్‌ షేక్‌ తిరిగి సదరు రిక్రూట్‌మెంట్‌ సంస్థకు అప్పగించాడు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు దుబాయ్‌లోని ఏజెంట్‌ను సంప్రదించగా.. రూ.2 లక్షలు చెల్లిస్తేనే స్వదేశానికి వెళ్లేందుకు అనుమతిస్తామని తెలిపాడు. దాంతో బాధితురాలి తల్లి రూ.90 వేలు సేకరించి ఏజెంట్‌ సూచించిన ఖాతాలో జమచేశారు. మూడు రోజుల్లో మీ కూతురిని పంపుతామని చెప్పిన ఏజెంట్‌.. ముఖం చాటేశాడు. దాంతో ఆమె ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్‌ను సంప్రదించారు. ఆయన విదేశాంగ శాఖకు సమస్య గురించి తెలియజేశారు. స్పందించిన అధికారులు ఆ యువతిని రక్షించి నగరానికి చేరేలా ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2021-01-18T13:01:12+05:30 IST