Abn logo
Mar 4 2021 @ 00:34AM

చివరివరకూ పోరాడాల్సిందే

1950లో బీజం పడిన విశాఖ ఉక్కు 70 ఏళ్ళలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. ఆంధ్రులు ఏమి సాధించాలన్నా రక్తతర్పణం చేయాల్సిందేనా? విశాఖ ఉక్కును కార్పొరేట్‌ సంస్ధలు తన్నుకుపోకుండా కాపాడు కోవడమేజాతి ఘనతకు గీటురాయి.


ఆంధ్రులు ఉద్యమించకుండా, రక్తం ధారపోయకుండా ఏదీ సాధించలేదు. త్యాగాలు, పోరాటాలతో వచ్చిన విశాఖ ఉక్కును కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరించటానికి చేస్తున్న ప్రయత్నాలను అదేస్థాయి పోరాటాలతో అడ్డుకోవాలి. విశాఖ ఉక్కు ప్రైవేట్‌ పరం అయితే లక్షలమంది ఉపాధికి దెబ్బ తగులుతుంది. అది ప్రైవేట్‌పరం అయిన తరువాత రాజధానిని విశాఖకు మార్చినా ప్రయోజనం ఉండదు. 


1979లో చరణ్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు, కేంద్ర ఉక్కుమంత్రి బిజూ పట్నాయక్‌ విశాఖ ఉక్కు కర్మాగార నిర్మాణం పనులు ప్రారంభించారు. విపి సింగ్‌ ప్రధానిగా ఉండగా 1989 నాటికి దాని నిర్మాణం పూర్తయింది. విశాఖ ఉక్కు కర్మాగారంలో బ్లాస్ట్‌ఫర్నేస్‌ (గోదావరి)ని 1990 మే 3న విపి సింగ్‌ జాతికి అంకితం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగార నిర్మాణపనులు ఒక విధంగా కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాల హయాంలోనే వేగంగా జరిగాయి. విశాఖ సిబియం కాంపౌండ్‌లో ఉక్కు కర్మాగార నిర్మాణ పనులకు లైజన్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, తెలుగువాడైన వెంకటేశ్వర్లును ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తే, అప్పట్లో పనుల పురోగతిని ఆయన ద్వారా తెలుసుకుంటూ నేను పత్రికల్లో అనేక వ్యాసాలు రాశాను కూడా.


ఇప్పుడు కేంద్రం ఉక్కు కర్మాగారం నష్టాలలో ఉందనీ అమ్ముతామని అంటోంది. నష్టాలకు ప్రధాన కారణం కర్మాగారానికి సొంతగనులు లేవు. గనులు కేటాయించటానికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వటం లేదు. గతంలో సహకారరంగంలో ఏపీ ప్రభుత్వం స్పిన్నింగ్‌ మిల్లులను నిర్మించి, అవసరమైన ముడిపదార్ధాన్ని అందించే జిన్నింగ్‌ మిల్లులను పెట్టలేదు. కోట్లు ఖర్చుచేసి స్పిన్నింగ్‌ మిల్లులు నిర్మించి, లక్షలు ఖర్చయ్యే జిన్నింగ్‌ మిల్లులను కట్టకపోవడంతో, అద్దెకు తీసుకున్న జిన్నింగ్‌ మిల్లులు అవినీతికి చిరునామాగా మారి స్పిన్నింగ్‌ మిల్లులు మూతపడ్డాయి. ఇదే తరహాలో వేలకోట్లతో నిర్మించిన ఉక్కు కర్మాగారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముడిసరుకును అందించే గనులను కేటాయించకుండా గాలి జనార్దనరెడ్డి వంటి వ్యాపారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు బళ్ళారిని కావాలని వదిలేయడంతో హోస్‌పేట, బళ్ళారిలో వున్న ఇనుపఖనిజం గాలి సోదరుల వంటి ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి పోయింది. ఒకటన్ను ఉక్కు తయారు కావాలంటే 1.6 టన్నులు ఇనుప ఖనిజం కావాలి. ఇనుప ఖనిజం లేకపోవటంతో టన్నుకు రూ.5 వేల చొప్పున ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. రాష్ట్రప్రభుత్వం గోదావరి నుంచి విశాఖ ఉక్కుకర్మాగారానికి రోజుకు 4 కోట్లగ్యాలన్ల నీరు సరఫరా చేస్తోంది. ఇందుకు ఉక్కుసంస్థ రోజుకు రూ.60 వేలు చెల్లిస్తోంది.


విశాఖలో ఉక్కుకర్మాగారాన్ని ప్రారంభించినప్పుడు ఆప్రాంతంలో 20 గ్రామాలు, 64 శివారు ప్రాంతాలలో 21,592 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. ఈ భూమిలో గంగవరం పోర్టుకు 1100 ఎకరాలు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం దీనిని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించింది. గంగవరం పోర్టు ఏటా ఐదు మిలియన్‌ల బొగ్గు, 1.5 మిలియన్‌ల సున్నపురాయిని విదేశాలకు పంపుతోంది. నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (యన్‌యండిసి) పరిధిలో విశాఖకు 300–400 కిలోమీటర్ల దూరంలో గనులున్నాయి, ఇనుపఖనిజం అందుబాటులో వుంది. అయినా యన్‌యండిసి విశాఖఉక్కుకు గనులను కేటాయించలేదు. ఇప్పటి వరకు విశాఖ ఉక్కు కేంద్రప్రభుత్వానికి రూ. 35,100 కోట్లు, రాష్ట్రప్రభుత్వానికి రూ.8,600 కోట్లు పన్నుల రూపంలో చెల్లించింది. సంస్థ విస్తరణకు దశలవారీగా రూ.20 వేల కోట్లు ఖర్చు చేయటంతో వడ్డీల భారం పెరిగింది.


ప్రస్తుతం సంస్థను కాపాడటానికి సావరిన్‌ బాండ్లను విడుదల చేయాలి. వీటికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. గతంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ రూ.8,500 కోట్లు, ఎపి ప్రభుత్వం అమరావతి రాజధాని కోసం రూ.2వేల కోట్లు బాండ్లు విడుదల చేశారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ కేవలం రెండుగంటల్లో రూ.17,183 కోట్లు సేకరించింది. అదేతరహాలో విశాఖ ఉక్కుకు సావరిన్‌ బాండ్ల రూపంలో రూ.20 వేల కోట్లు సేకరించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి. ఉక్కుకర్మాగారానికి అనుసంధానంగా అచ్యుతాపురం పోర్టును నిర్మించాలనే ప్రతిపాదనలను వెంటనే అమలు చేయాలి. రాష్ట్రప్రభుత్వం విశాఖ ఉక్కును బలోపేతం చేయడానికి ప్రయత్నించాలి. విశాఖలో ఉక్కుకర్మాగారం అభివృద్ధి చెందటం వలనే గంగవరం, అచ్యుతాపురం పోర్టులొచ్చాయి. విమానాల రాకపోకలు పెరగటంతో భోగాపురం విమానాశ్రయం వచ్చింది. విశాఖఉక్కు నవ్యాంధ్రకు తలమానికం. దానిని బలోపేతం చేయటానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. అందుకు భిన్నంగా కార్పొరేట్‌సంస్థలకు లక్షల కోట్ల విలువైన భూములను అప్పగించాలని ప్రయత్నించటం శోచనీయం. బడావ్యాపారులు ఇటువంటి సంస్థల భూములను అమ్మటం లేదా బ్యాంకుల్లో తనఖాపెట్టి రూ.లక్షల కోట్లు రుణాలు తేవటం, కొంతకాలానికి సంస్థ నష్టాల్లో ఉందని మూసివేయటం వంటి పరిణామాలు చూస్తూనే ఉన్నాం. భారీగా నష్టాల్లో ఉన్నట్లు చూపించి ఆర్‌బిఐ ద్వారా కేంద్రం నుంచి రాయితీలు పొందే వ్యవహారమూ నడుస్తోంది. 


దేశంలో ప్రతిఏటా 206 మిలియన్‌ టన్నుల ఇనుపఖనిజం వస్తోంది. దేశ అవసరాలకు 165 మిలియన్‌టన్నులు సరిపోగా, 40 మిలియన్‌ టన్నులు ఎగుమతి చేస్తున్నాం. ఇనుపఖనిజం ఎగుమతి చేసి ఉక్కును దిగుమతి చేసుకోటం వల్ల దేశ ఆర్ధికవ్యవస్థ దెబ్బతింటుంది. ప్రపంచంలో నాలుగో వంతు ఇనుపఖనిజం మనదేశంలో లభ్యమవుతోంది. జపాన్‌కు మనదేశం 1964 నుంచి ఇప్పటివరకు 20 లక్షల టన్నుల ఉక్కు ఎగుమతి చేసింది. 1950లో బీజం పడిన విశాఖ ఉక్కు 70 ఏళ్ళలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. ఆంధ్రులు ఏమి సాధించాలన్నా రక్తతర్పణం చేయాల్సి వస్తున్నది. విశాఖ ఉక్కును కార్పొరేట్‌ సంస్ధలు తన్నుకుపోకుండా చివరివరకూ పోరాడాల్సిందే. 

డాక్టర్‌ యలమంచిలి శివాజి

రాజ్యసభ మాజీ సభ్యులు

Advertisement
Advertisement
Advertisement