లక్షణాలుంటేనే టెస్టులు

ABN , First Publish Date - 2021-04-29T08:45:10+05:30 IST

కొవిడ్‌ లక్షణాలు.. అంటే జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, విరోచనం, కళ్లు ఎర్రబడటం, ఒళ్లునొప్పులు, వాసన, రుచి కోల్పోవడం వంటివి ఉంటేనే టెస్టు చేయించుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) గడల శ్రీనివాసరావు సూచించారు.

లక్షణాలుంటేనే టెస్టులు

  • అనవసరంగా వెళితే కొవిడ్‌ బారినపడతారు.. నిలకడగానే కేసులు
  • తగ్గుముఖం పడుతున్న ఉధృతి
  • అయినా జాగ్రత్తలు తప్పనిసరి
  • మే చివరి వరకు అప్రమత్తంగా ఉండాల్సిందే 
  • వచ్చే 3-4 వారాలు అత్యంత కీలకం
  • లాక్‌డౌన్‌పై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు
  • మీడియాతో డాక్టర్‌ గడల శ్రీనివాసరావు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ లక్షణాలు.. అంటే జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, విరోచనం, కళ్లు ఎర్రబడటం, ఒళ్లునొప్పులు, వాసన, రుచి కోల్పోవడం వంటివి ఉంటేనే టెస్టు చేయించుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) గడల శ్రీనివాసరావు సూచించారు. అది కూడా.. లక్షణాలు బయటపడ్డాక, మూడు నాలుగు రోజులు మందులు వాడినా తగ్గకుంటేనే టెస్టులకు రావాలని ప్రజలను ఆయన కోరారు. బుధవారం ఆయన డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. అనవసరమైన భయాందోళనలతో ప్రజలంతా టెస్టుల కోసం పరుగులు తీస్తున్నారని.. దీనివల్ల, నిజంగా అవసరమైన వారికి టెస్టులు చేయించుకోవడం ఇబ్బందిగా మారిందని ఆయన పేర్కొన్నారు. ‘‘కొంతమంది అయితే వారానికి రెండుసార్లు పరీక్షల కోసం వస్తున్నారు. ఇలా లక్షణాలు లేకపోయినా అనవసరంగా టెస్టుల కోసం వచ్చేవారు కొవిడ్‌ను కోరి తెచ్చుకుంటున్నారు’’ అని గడల ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రంలో సర్కారు చేపట్టిన కట్టడి చర్యలు, ప్రజల జాగ్రత్తలతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండటంతో కొవిడ్‌ ఉధృతి తగ్గుముఖం పట్టిందని ఆయన తెలిపారు.


కరోనా కేసుల సంఖ్య పెరుగుదలలో దేశవ్యాప్తంగా స్థిరత్వం వచ్చిందని, అటువంటి పరిస్థితే తెలంగాణలోనూ ఉందన్నారు. అయితే.. పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, అందుకు మూడు నుంచి నాలుగు వారాలు పడుతుందన్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. వచ్చే 3-4 వారాలూ అత్యంత కీలకమని పేర్కొన్నారు. మే నెలాఖరు వరకూ ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే  సెకండ్‌ వేవ్‌ గండం నుంచి బయటపడొచ్చన్నారు. సెకండ్‌వేవ్‌ మొదలైనప్పటి నుంచి ఏపీలో చాలా తక్కువగా కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారని, తెలంగాణలో మాత్రం భారీగా టెస్టులు చేస్తున్నట్లు గడల తెలిపారు. సీఎం కేసీఆర్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినప్పటికీ.. ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని కొవిడ్‌ పరిస్థితులపై పర్యవేక్షిస్తున్నారన్నారు. సీఎం ఆరోగ్యం చాలా బాగుందని, రెండు మూడు రోజుల్లో ఆయన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటారని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. రాత్రిపూట కర్ఫ్యూ మంచి ఫలితాలు ఇచ్చిందని, దానివల్ల వైరస్‌ వ్యాప్తి రేటు తగ్గిందని డీహెచ్‌ వెల్లడించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ ఎటువంటి ప్రతిపాదనలూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌పై వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎలకా్ట్రనిక్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.


అవసరం లేకున్నా ఆస్పత్రుల్లో చేరి..  

కరోనా చికిత్స కోసం ఆస్పత్రుల్లో అడ్మిషన్ల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే 50 వేల పడకలు సిద్ధం చేసినట్లు గడల వెల్లడించారు. ఇందులో 18వేల ఆక్సిజన్‌ పడకలు, ఐసీయూ పడకలు 10వేలకుపైగా ఉన్నాయని తెలిపారు. సర్కారీ ఆస్పత్రుల్లో పడకలను మరింత పెంచుతామన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్‌, ఐసీయూ పడకల ఆక్యుపెన్సీ (భర్తీ నిష్పత్తి) 50-60 శాతమే ఉందన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. 85ు మందికి ఆస్పత్రుల అవసరం లేదని, వైద్యుల సలహాతో ఇళ్ల వద్దే చికిత్స పొందొచ్చన్నారు. టెస్టులకు ఎలాగైతే పరుగెడుతున్నారో, పడకల కోసం కూడా అలాగే వస్తున్నారని.. దీంతో నిజంగా అవసరమైనవారికి ఇబ్బంది అవుతోందన్నారు. అత్యవసరమైతే 108కి, వైద్యపరమైన సలహాల కోసం 104కు కాల్‌ చేయాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రులపై చార్జీల విషయంలో ఫిర్యాదులు వస్తున్నాయని గడల తెలిపారు. గతంలో ఇచ్చిన వాట్సాప్‌ నంబరుకు( 9154170960) ఫిర్యాదు చేస్తే ఆయా ఆస్పత్రులపై చర్యలు తప్పవన్నారు.


గాంధీలో మరణాలన్నీ కొవిడ్‌ వల్ల కావు  

కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 10వేల పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యాన్ని కల్పించామని డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి  తెలిపారు. మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచుకున్నామన్నారు. 23 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ట్యాంకులను ఏర్పాటు చేశామన్నారు. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన తర్వాత ఆక్సిజన్‌పై ఉన్నతాధికారులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. సీహెచ్‌సీ వరకు ఆక్సిజన్‌ పైపు లైన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని ఆక్సిజన్‌ పడకల ఖాళీల వివరాలను 108 వాహనాలకు కూడా అందుబాటులో ఉంచామని, దీంతో అత్యవసర వైద్యం అవసరమైన వారితో అంబులెన్సులు ఆస్పత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి లేదన్నారు. గాంధీలో మరణాలన్నీ కొవిడ్‌ వల్ల కాదని డీఎంఈ స్పష్టంచేశారు. ఇతర రోగులకు కూడా అక్కడ వైద్య సేవలందిస్తున్నామని, వారిలో కొందరు అక్కడ చనిపోతున్నారని రమేశ్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-04-29T08:45:10+05:30 IST